ప్రశ్నాభాగం
▪ క్రైస్తవ కూటాలకు హాజరైనప్పుడు, పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు సెల్‌ఫోన్ ఉపయోగించే విషయంలో ఏ లేఖన సూత్రాలు అన్వయిస్తాయి?
“ప్రతీదానికి సమయము కలదు” (ప్రసం. 3:1): సెల్‌ఫోన్ వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇతరులతో మాట్లాడే లేక సందేశాలు పంపించే సౌలభ్యం ఉంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో ఫోన్ వల్ల తమ దృష్టి మళ్లకూడదని క్రైస్తవులు కోరుకుంటారు. ఉదాహరణకు, మన కూటాలు మనం యెహోవాను ఆరాధించడానికి, ఆధ్యాత్మిక ఉపదేశం వినడానికి, ఒకరినొకరం ప్రోత్సహించుకోవడానికి చక్కని సందర్భాలు. (ద్వితీ. 31:12; కీర్త. 22:22; రోమా. 1:11, 12) కాబట్టి కూటాలకు రాగానే ఫోన్‌ను స్విచ్‌ఆఫ్ చేసి తిరిగి వెళ్లిన తర్వాత ఆన్ చేసుకుని, వచ్చిన సందేశాల్ని చూసుకోవడం వీలవుతుందేమో ఆలోచించండి. ఒకవేళ ఏవైనా అత్యవసరమైన ఫోన్‌కాల్స్ వచ్చే పరిస్థితి ఉంటే, ఇతరులకు ఇబ్బంది కలగని విధంగా మీ ఫోన్‌ని సెట్ చేసుకోండి.
‘సువార్త కోసమే సమస్తం చేయండి.’ (1 కొరిం. 9:23): సెల్‌ఫోన్ ఒక్కోసారి పరిచర్యలో చక్కగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, గుంపును నడిపించే సహోదరుడు క్షేత్రంలో వేరేచోట ప్రకటిస్తున్న వాళ్లతో మాట్లాడడానికి దాన్ని ఉపయోగించవచ్చు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రకటిస్తున్నప్పుడు ఏదైనా గుంపు దాడి చేసే అవకాశం ఉందని గమనిస్తే ఆ విషయాన్ని ఇతర ప్రచారకులకు తెలియజేయడానికి లేదా దాడి జరిగినప్పుడుగానీ, పోలీసులు వచ్చి అడ్డుకున్నప్పుడుగానీ ఆ విషయాన్ని పెద్దలకు తెలియజేయడానికి సెల్‌ఫోన్లు ఉపయోగపడతాయి. కొన్నిసార్లు ప్రచారకులు ఆసక్తిగల వాళ్లను లేదా బైబిలు విద్యార్థులను కలవడానికి వెళ్లే ముందు ఫోన్ చేస్తారు, ముఖ్యంగా వాళ్ల ఇళ్లు దూరంగా ఉన్నప్పుడు అలా చేస్తారు. పరిచర్యలో గృహస్థునితో మాట్లాడేటప్పుడు ఫోన్ వల్ల మన సంభాషణకు ఆటంకం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. (2 కొరిం. 6:3) అలాగే తోటి సహోదరుడు మాట్లాడుతుంటే, మనం ఫోన్‌లో మాట్లాడుతూ లేక సందేశాలు పంపుతూ ఉండడం కన్నా పరిచర్యపై, మాట్లాడుతున్న సహోదరునిపై దృష్టి నిలపడం చాలా మంచిది.
ఇతరుల గురించి ఆలోచించండి. (1 కొరిం. 10:24; ఫిలి. 2:4): క్షేత్ర సేవా కూటానికి సమయానికి వెళ్లకపోయినా ఫర్లేదని, ఎవరో ఒకరికి ఫోన్‌చేసి లేదా మెసేజ్ పంపించి పరిచర్య ఎక్కడ చేస్తున్నారో కనుక్కోవచ్చులే అని మనమెప్పుడూ అనుకోకూడదు. మనం ఆలస్యంగా వెళ్తే గుంపులో మళ్లీ మార్పులుచేర్పులు చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి అనుకోని పరిస్థితుల వల్ల మనకు ఆలస్యం అవుతుందన్న మాట నిజమే. కానీ, సమయానికి వెళ్లడం అలవాటు చేసుకుంటే, యెహోవా చేసిన ఏర్పాట్లను, గుంపుని నడిపించే సహోదరుణ్ణి, తోటి ప్రచారకుల్ని గౌరవించిన వాళ్లమవుతాం.