పూర్తికాల సేవలో ఉన్న ఆనందం
1 యువతీయువకులుగా మీరు భవిష్యత్తు గురించి తప్పకుండా ఆలోచించుకుని ఉంటారు. సామెతలు 21:5 మనకు ఇలా చెబుతోంది: “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు.” జీవితంలో మీ లక్ష్యాల గురించి బాగా ఆలోచించుకుంటే మీకే ఎంతో ప్రయోజనం ఉంటుంది. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటుండగా పూర్తికాల సేవ చేపట్టడం గురించి ఆలోచించండి. ఎందుకు అలా ఆలోచించాలి?
2 చిన్న వయసులో పయినీరు సేవ చేసిన కొంతమంది పెద్దవాళ్లను వాళ్లు చేసిన పూర్తికాల సేవ గురించి అడిగి చూడండి, వాళ్లు తడుముకోకుండా, “అవి నా జీవితంలో శ్రేష్ఠమైన రోజులు!” అంటారు. చిన్న వయసులోనే పూర్తికాల సేవను చేపట్టి ఆనందాన్ని సొంతం చేసుకున్న ఒక సహోదరుడు మలి వయసులో ఇలా అన్నాడు: “ఆ రోజులు గుర్తు చేసుకుని, ‘బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో’ అనే తెలివైన ఉపదేశాన్ని పాటించానని చెప్పగలుగుతున్నందుకు నాకెంతో సంతృప్తిగా ఉంది.” (ప్రసం. 12:1, 2) అలాంటి ఆనందం మీ సొంతమవ్వాలంటే దాని కోసం మీరు, మీ తల్లిదండ్రులు ఇప్పుడే మంచి ప్రణాళిక వేసుకోవాలి.
3 తల్లిదండ్రులారా, పూర్తికాల సేవను ప్రోత్సహించండి: శ్రద్ధ తీసుకునే తండ్రిలా యెహోవా మీరు వెళ్లాల్సిన మార్గాన్ని మీకు చూపిస్తాడు. (యెష. 30:21) అలాంటి ప్రేమగల నిర్దేశం ఇచ్చే విషయంలో క్రైస్తవ తల్లిదండ్రులైన మీరు ఆయనను ఆదర్శంగా తీసుకోవచ్చు. సరైన దారిని ఎంచుకునే అవకాశం మీ పిల్లలకే వదిలేయకుండా, యెహోవా ఆశీర్వాదాలు పొందగలిగే దారిలో వాళ్లు వెళ్లేలా మీరే వాళ్లకు మంచి తర్ఫీదునివ్వండి. వాళ్లు పెద్దవాళ్లయ్యాక, మీరు ఇచ్చిన శిక్షణతో ‘మేలు, కీడులను వివేచించగలుగుతారు.’ (హెబ్రీ. 5:14) సొంతగా నిర్ణయాలు తీసుకోలేమని పెద్దవాళ్లకు అనుభవంతో తెలుసు; సరైన మార్గంలో వెళ్లాలంటే వాళ్లు యెహోవా మీద ఆధారపడాలి. (సామె. 3:5, 6) అనుభవం లేని యువతీయువకులు యెహోవా మీద ఇంకా ఎక్కువ ఆధారపడాలి.
4 తల్లిదండ్రులారా, మీ పిల్లలు యుక్తవయసుకు వస్తుండగా లేదా అంతకన్నా చిన్న వయసులో ఉన్నప్పుడే, తాము చేరుకోగల లక్ష్యాల గురించి వాళ్లతో మాట్లాడండి. పాఠశాల సలహాదార్లు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు పెద్దపెద్ద చదువులు, డబ్బు సంపాదన వంటి లక్ష్యాలు పెట్టుకోమని వాళ్ల మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. మీ పిల్లలు రాజ్య సంబంధ విషయాలను నిర్లక్ష్యం చేయకుండా, తమ కాళ్లమీద తాము నిలబడడానికి తోడ్పడేలాంటి శిక్షణనిచ్చే పాఠశాల కోర్సులను ఎంచుకునేలా మీ పిల్లలకు సహాయం చేయండి. (1 తిమో. 6:6-11) చాలా సందర్భాల్లో, క్రమ పయినీరు సేవ చేస్తూ తమ అవసరాలు తీర్చుకోవడానికి కావాల్సినంత సంపాదించుకోగలిగేలా ఉన్నత పాఠశాల విద్యతో పాటు వృత్తి సంబంధిత శిక్షణ మరియు/లేదా వేతనం ఇస్తూ అందించే శిక్షణ తీసుకోవడం సరిపోతుంది.
5 కొంతకాలంపాటు పెళ్లి చేసుకోకుండా ఉండమని యువతీయువకులను ప్రోత్సహించండి. ఆ తర్వాత వాళ్లు పెళ్లి చేసుకోవాలనుకుంటే, దానితో వచ్చే పెద్దపెద్ద బాధ్యతలను స్వీకరించడానికి వాళ్లు సన్నద్ధంగా ఉంటారు. (జూన్ 2001, మన రాజ్య పరిచర్య లోపలి పేజీల్లో ఉన్న “మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకోగలరా?” అనే ఆర్టికల్‌లో 19వ పేరా చూడండి.) పయినీరు సేవ గురించి, అవసరం ఎక్కువగా ఉన్నచోట సేవ చేయడం గురించి, బెతెల్ సేవ గురించి సానుకూలంగా మాట్లాడండి. యెహోవాను సంతోషపెట్టేలా, ఇతరులకు ప్రయోజనం చేకూరేలా, తమకు ఆనందాన్ని తెచ్చిపెట్టేలా తమ జీవితాలను మలచుకోవాలనే కోరికను మీ పిల్లల మనసుల్లో లేత వయసు నుండే చిగురింపజేయండి.
6 యువతీయువకుల్లారా పూర్తికాల సేవకు ప్రాధాన్యతనివ్వండి: పయినీరు సేవ ఎలా ఉంటుందో అని భయపడకండి. విద్యా సంవత్సరమంతటిలో, సెలవుల్లో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు కొంతకాలంపాటు సహాయ పయినీరు సేవ చేస్తే ఆ సేవ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. అప్పుడు పయినీరు సేవ ఎంత సంతృప్తినిస్తుందో మీరే స్వయంగా చవిచూస్తారు!
7 దేవుని సంస్థలో మీరు ఒక యువ సహోదరుడైతే, పరిచర్య సేవకుడయ్యేందుకు తగిన అర్హతలు పొందడం గురించి కూడా బాగా ఆలోచించండి. (1 తిమో. 3:8-10, 12) బెతెల్ సేవకు దరఖాస్తు పెట్టుకునేందుకు లేదా ఒంటరి సహోదరుల కోసం బైబిలు పాఠశాలకు హాజరయ్యేందుకు తగిన వయసుకు చేరుకున్నాక వాటి గురించి ఆలోచించండి. పయినీరు సేవలో మీరు గడించిన అనుభవం సమయ పాలనతో ఎలా జీవించాలి, మీ వ్యక్తిగత పనుల్ని ఎలా క్రమబద్ధీకరించుకోవాలి, ఇతరులతో ఎలా మెలగాలి, బాధ్యతల్ని గంభీరంగా ఎలా తీసుకోవాలి వంటి విషయాల్లో ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఇవన్నీ ముందుముందు మీరు చేపట్టబోయే పెద్దపెద్ద సేవా నియామకాలకు మిమ్మల్ని సంసిద్ధం చేస్తాయి.
8 పూర్తికాల సేవలో రాణించాలంటే రాజ్య సంబంధమైన కార్యకలాపాల్లో బాగా కష్టపడే మనస్తత్వం ఉండాలి. అపొస్తలుడైన పౌలు అలాంటి స్ఫూర్తినే ప్రోత్సహించాడు, దానివల్ల వచ్చే ఆశీర్వాదాల గురించి ఆయన ఇలా ప్రస్తావించాడు: ‘యెహోవా వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదురని ఎరుగుదురు గనుక, మీరేమి చేసినను అది యెహోవా నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి.’ (కొలొ. 3:23, 24) పూర్తికాల సేవలో ఎంతో ఆనందం పొందేలా యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక!