మీ మనస్సాక్షిని భద్రంగా కాపాడుకోండి
1. వచ్చే సేవా సంవత్సరంలో జరిగే ప్రత్యేక సమావేశ దిన ముఖ్యాంశం ఏమిటి, ఆ కార్యక్రమ ఉద్దేశం ఏమిటి?
1 మన మనస్సాక్షి అంగీకరించని వాటిని చేసేలా పురికొల్పే పరిస్థితులు మనకు ప్రతీరోజు ఎదురౌతుంటాయి. అందుకే 2012, సెప్టెంబరు 1తో మొదలయ్యే 2013 సేవా సంవత్సరంలో జరిగే ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం “మీ మనస్సాక్షిని భద్రంగా కాపాడుకోండి” అనే ముఖ్యాంశంతో తయారుచేయబడింది. (1 తిమో. 1:19) సమావేశ కార్యక్రమం, మన సృష్టికర్త ఇచ్చిన ఈ అసాధారణ బహుమానాన్ని మనమెలా ఉపయోగించుకుంటున్నామో పరిశీలించుకునేందుకు మనలో ప్రతీ ఒక్కరికీ సహాయం చేసే విధంగా ఉంటుంది.
2. ఆ సమావేశంలో, ప్రాముఖ్యమైన ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?
2 ఈ విషయాలు తెలుసుకుంటాం: ఆ సమావేశంలో, మనస్సాక్షికి సంబంధించిన ఈ ఏడు ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం:
• మనస్సాక్షికి హానికరమైనవి ఏవి?
• మన మనస్సాక్షికి ఎలా శిక్షణ ఇవ్వవచ్చు?
• ఎవరి నాశనం విషయంలోనూ దోషులం కాకుండా ఉండడం ఎలా సాధ్యం?
• మనం బైబిలు సూత్రాల ప్రకారం ఆలోచిస్తే, ప్రవర్తిస్తే మన గురించి ఏమి తెలుస్తుంది?
• మనస్సాక్షి విషయంలో ఎదుటివారిని నొప్పించకుండా ఎలా ఉండవచ్చు?
• యౌవనులారా, రాజీపడమని చేసే ఒత్తిడిని మీరెలా తట్టుకోవచ్చు?
• పరిశుద్ధాత్మ నడిపింపును పొందుతున్న తమ మనస్సాక్షి చెప్పేది వినేవాళ్లు ఏ ఆశీర్వాదాలు పొందుతారు?
3. కార్యక్రమం మనకు ఎలా ప్రయోజనకరంగా ఉంటుంది?
3 మన మనస్సాక్షిని కలుషితం చేయడానికి సాతాను చేసే ప్రయత్నాలను మనం యెహోవా సహాయంతో ఎదిరించవచ్చు. మన ప్రేమగల పరలోక తండ్రి మనకు తన వాక్యం ద్వారా, సంస్థ ద్వారా “ఇదే త్రోవ, దీనిలో నడువుడి” అని చెబుతున్నాడు. (యెష. 30:21) యెహోవా మనకు ఈ సమావేశం ద్వారా కూడా అలాంటి నిర్దేశాన్నే ఇస్తున్నాడు. కాబట్టి, మీరు ఆ కార్యక్రమమంతటికీ హాజరయ్యేలా ఏర్పాట్లు చేసుకోండి. శ్రద్ధగా వినండి, సమాచారాన్ని మీ జీవితంలో ఎలా అన్వయించుకోవాలో ఆలోచించండి. కుటుంబమంతా కలిసి కార్యక్రమం గురించి మాట్లాడుకోండి. మనం నేర్చుకున్నవాటిని ఆచరణలో పెడితే, ఎల్లప్పుడూ ‘నిర్మలమైన మనస్సాక్షిని’ కాపాడుకోగలుగుతాం, దేవుని మార్గం నుండి తొలగిపోయేలా చేసే సాతాను లోకంలోని తాత్కాలిక సుఖాల ప్రలోభానికి లొంగిపోకుండా ఉండగలుగుతాం.—1 పేతు. 3:15, 16.