ప్రకటించడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి
1. మొదటి శతాబ్దంలోని సువార్తికులు ప్రకటించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారని ఎలా చెప్పవచ్చు?
1 మొదటి శతాబ్దంలో, ఆసక్తిగల సువార్తికులు ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ “మానక” సువార్త ప్రకటించారు. (అపొ. 5:42) దీన్నిబట్టి, వాళ్లు ఇంటింటి పరిచర్యకు వెళ్తున్నప్పుడు దారిలో కనిపించిన వాళ్లకు కూడా తప్పకుండా సువార్తను ప్రకటించేవుంటారని తెలుస్తోంది. వాళ్లు పరిచర్య తర్వాత సంతవీధిలో ఏమైనా కొనుక్కోవడానికి ఆగినప్పుడు కూడా, ప్రకటించడానికి దొరికిన ఏ అవకాశాన్నీ పోనిచ్చేవారు కాదు. యేసులా, వాళ్లు కూడా ప్రకటించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు.—మార్కు 6:31-34.
2. మన పేరుకు తగ్గట్టు జీవించడమంటే ఏమిటి?
2 అన్నివేళలా సిద్ధంగా ఉండాలి: యెహోవాసాక్షులనే పేరు మనం ఏమి చేస్తామనేది మాత్రమే కాదు, మనం ఎవరనేది కూడా చూపిస్తుంది. (యెష. 43:10-12) అందుకే అన్నివేళలా అంటే ఇంటింటి పరిచర్య చేయనప్పుడు కూడా మన నిరీక్షణ గురించి ఇతరులతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాం. (1 పేతు. 3:15, 16) సాక్ష్యమిచ్చే ఎలాంటి సందర్భాలు మీకు ఎదురౌతాయో, అప్పుడు మీరేమి మాట్లాడాలో ముందే ఆలోచిస్తారా? ఆసక్తి ఉన్నవాళ్లకు ఇవ్వడానికి మీ దగ్గర ప్రచురణలు ఉంచుకుంటారా? (సామె. 21:5) మీరు ఒట్టి ఇంటింటి పరిచర్యే చేస్తారా? లేదా పరిస్థితులు బావుంటే వేరే స్థలాల్లో కూడా సువార్త ప్రకటిస్తారా?
3. వీధులు, బస్స్టాపులు, రైల్వేస్టేషన్లు, పార్కులు, వ్యాపార స్థలాల వంటివాటి దగ్గర సాక్ష్యమివ్వడాన్ని “ప్రత్యామ్నాయ పద్ధతులు” అనడం ఎందుకు సరికాదు?
3 “ప్రత్యామ్నాయ పద్ధతుల్లో” సాక్ష్యమివ్వడం కాదు: వీధులు, బస్స్టాపులు, రైల్వేస్టేషన్లు, పార్కులు, వ్యాపార స్థలాల వంటివాటి దగ్గర సాక్ష్యమివ్వడం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం కొన్నిసార్లు “ప్రత్యామ్నాయ పద్ధతులు” అనే పదబంధాన్ని ఉపయోగించాం. అయితే, “ప్రత్యామ్నాయం” అనే పదం ఉపయోగించినప్పుడు, అవి మామూలుగా అనుసరించే పద్ధతులు కావని, ఇష్టముంటేనే ఆ పద్ధతుల్లో సాక్ష్యం ఇవ్వవచ్చని ప్రచారకులు అనుకునే అవకాశముంది. అపొస్తలుడైన పౌలు తను ‘బహిరంగంగా,’ ఇంటింటా ప్రకటించానని అన్నాడు. (అపొ. 20:20, 21) కాబట్టి “ప్రత్యామ్నాయ పద్ధతుల్లో” సాక్ష్యమివ్వడం అనకుండా “బహిరంగంగా” సాక్ష్యమివ్వడం అనడమే ఎంతో సరైనది. ఎప్పటిలాగే, రాజ్య సందేశాన్ని ప్రజలకు చేరవేసే పద్ధతుల్లో ఇంటింటి పరిచర్య ముఖ్యమైనది, సమర్థవంతమైనది. అయితే, మొదటి శతాబ్దంలోని సువార్తికులు ఇళ్లమీద కాదుగానీ ప్రజలమీద దృష్టిపెట్టారు. బహిరంగంగా, ఇంటింటా, వేరే సమయాల్లో సత్యం గురించి మాట్లాడడానికి దొరికిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. వాళ్లలా మనం కూడా ప్రజలమీద దృష్టిపెడితే పరిచర్యను సంపూర్ణంగా చేయగలుగుతాం.—2 తిమో. 4:5.