మంచి బోధకునికి ఉండాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన లక్షణం
1. మంచి బోధకునికి ఉండాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన లక్షణం ఏమిటి?
1 మంచి బోధకుడు కావాలంటే ఒక వ్యక్తికి ఏమి అవసరం? చదువా? అనుభవమా? సహజంగా ఉండే సామర్థ్యమా? నిజానికి అవసరమైంది ఒకటుంది; అది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేది, యేసు శిష్యులను గుర్తించేది, యెహోవాకున్న ముఖ్యమైన లక్షణాలన్నింటిలో ప్రధానమైనది, ఆకర్షణీయమైనది. (యోహా. 13:35; గల. 5:14; 1 యోహా. 4:8) అదే ప్రేమ. మంచి బోధకులు ప్రేమ చూపిస్తారు.
2. మనం ప్రజలను ఎందుకు ప్రేమించాలి?
2 ప్రజలను ప్రేమించండి: గొప్ప బోధకుడైన యేసు ప్రజలను ప్రేమించాడు, దానివల్ల వాళ్లు ఆయన బోధలు వినడానికి ఇష్టపడేవాళ్లు. (లూకా 5:12, 13; యోహా. 13:1; 15:13) మనకు ప్రజలమీద శ్రద్ధ ఉంటే, ఎప్పుడు అవకాశం దొరికినా సాక్ష్యం ఇవ్వడానికే చూస్తాం. హింసలు, ప్రజల్లో ఆసక్తి లేకపోవడం వంటి అడ్డంకులు మనల్ని ఆపలేవు. మనం సువార్త వినేవారి పట్ల నిజమైన వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తాం, వాళ్ల అవసరాలకు సరిపోయే విధంగా మనం సందేశాన్ని మలుస్తాం. మనం ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాదుగానీ, వాళ్లతో అధ్యయనం చేయడం కోసం సిద్ధపడే ప్రతీసారి సమయం కేటాయించడానికి ఇష్టపడతాం.
3. బైబిలు సత్యాలను ప్రేమించడం పరిచర్యలో మనకు ఎలా సహాయం చేస్తుంది?
3 బైబిలు సత్యాలను ప్రేమించండి: యేసు బైబిలు సత్యాలను కూడా ప్రేమించాడు, వాటిని అమూల్యమైన సంపదలుగా ఎంచాడు. (మత్త. 13:52) మనం సత్యాన్ని ప్రేమిస్తే ఉత్సాహంగా ప్రకటిస్తాం, అది వినేవాళ్లలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అలాంటి ప్రేమ ఉంటే మనం మన లోటుపాట్లపై కాకుండా, ప్రకటించే విలువైన సందేశం మీదే దృష్టి పెడతాం, అప్పుడు ఎక్కువగా కంగారుపడకుండా పరిచర్య చేయగలుగుతాం.
4. మనం ఎలా ప్రేమను వృద్ధిచేసుకోవచ్చు?
4 ప్రేమను వృద్ధిచేసుకోండి: మనం ప్రజల మీద ప్రేమను ఎలా వృద్ధిచేసుకోవచ్చు? యెహోవా, ఆయన కుమారుడు చూపిన ప్రేమ గురించి, మన ప్రాంతంలోని ప్రజల ఆధ్యాత్మిక దుస్థితి గురించి ఆలోచించాలి. (మార్కు 6:34; 1 యోహా. 4:10, 11) క్రమంగా బైబిలు అధ్యయనం చేస్తూ, ధ్యానిస్తూ మనం బైబిలు సత్యాల మీద ప్రేమను మరింతగా పెంచుకోవచ్చు. ప్రేమ పరిశుద్ధాత్మ ఫలంలోని ఒక అంశం. (గల. 5:22) కాబట్టి పరిశుద్ధాత్మ ఇమ్మని, మరింతగా ప్రేమించేలా సహాయం చేయమని మనం యెహోవాను వేడుకోవచ్చు. (లూకా 11:13; 1 యోహా. 5:14) మనకు చదువు, సత్యంలో అనుభవం, సహజ సామర్థ్యాలు ఉన్నా లేకపోయినా ప్రేమను చూపించడం ద్వారా సమర్థవంతమైన బోధకులముగా ఉండగలం.