తర్కించుకునేందుకు గృహస్థునికి సహాయం చేయండి
1. పరిచర్యలో ఏ పద్ధతి అత్యంత సమర్థవంతమైంది?
1 పరిచర్యలో ఏ పద్ధతి సమర్థవంతమైంది? గృహస్థులతో మొండిగా వాదించడమా లేదా వాళ్లు తర్కించుకుని సరైన ముగింపుకు వచ్చేలా సహాయం చేయడమా? అపొస్తలుడైన పౌలు థెస్సలొనీకలోని యూదులతో మాట్లాడినప్పుడు రెండో పద్ధతినే ఉపయోగించాడు, దానివల్ల వాళ్లలో కొందరు విశ్వాసులయ్యారు. (అపొ. 17:2-4) ఇతరులతో తర్కించాలంటే ఏమి చేయాలి?
2. సువార్త ప్రకటించేటప్పుడు మనం పౌలు మాదిరిని ఎలా అనుకరించవచ్చు?
2 ఇతరుల భావాలు, నేపథ్యం గురించి ఆలోచించండి: తర్కించుకునేందుకు మీ ప్రాంతంలోని ప్రజలకు సహాయం చేయాలంటే మీరు వాళ్ల భావాలను పట్టించుకోవాలి. పౌలు అరేయొపగు దగ్గర అవిశ్వాసులైన గ్రీకులతో మాట్లాడేటప్పుడు వాళ్లకు దాదాపు తెలిసిన, వాళ్లు అంగీకరించిన వాటి గురించి ప్రస్తావిస్తూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. (అపొ. 17:22-31) కాబట్టి ప్రకటనా పనికోసం సిద్ధపడుతున్నప్పుడు, మీ ప్రాంతంలోని ప్రజల సాధారణ నమ్మకాలేమిటో, వాళ్లు వేటిని ఇష్టపడరో ఆలోచించండి. (1 కొరిం. 9:19-22) గృహస్థుడు ఏదైనా అభ్యంతరం లేవనెత్తితే, మీరిద్దరూ అంగీకరించే అంశమేదో గుర్తించి దాని ఆధారంగా మాట్లాడండి.
3. నేర్పుగా ప్రశ్నలు అడుగుతూ ఇతరులతో మరింత సమర్థవంతంగా ఎలా తర్కించవచ్చు?
3 నైపుణ్యంగా ప్రశ్నలు అడగండి: తన గమ్యస్థానం చేరుకునేందుకు ఒక ప్రయాణికునికి దారి చూపించాలంటే ఆయన ప్రస్తుతం ఎక్కడున్నాడో మనకు తెలిసుండాలి. అలాగే, ఫలానా విషయంలో సరైన ముగింపుకు వచ్చేలా గృహస్థునికి సహాయం చేయాలంటే దాని గురించి ఆయన ప్రస్తుతం ఏమనుకుంటున్నాడో మనకు తెలిసుండాలి. యేసు కూడా ఇతరులతో తర్కించడానికి ముందు తరచూ ప్రశ్నలు అడిగి, వాళ్లు ఏమనుకుంటున్నారో తెలుసుకునేవాడు. ఉదాహరణకు, “నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను?” అని ఒక వ్యక్తి యేసును అడిగినప్పుడు, అతని అభిప్రాయమేంటో తెలుసుకున్న తర్వాతే యేసు జవాబిచ్చాడు. (లూకా 10:25-28) మరో సందర్భంలో, పేతురు తప్పుగా సమాధానం చెప్పినప్పుడు యేసు నేర్పుగా ప్రశ్నలు అడిగి ఆయన ఆలోచనను సరిదిద్దాడు. (మత్త. 17:24-26) అలాగే గృహస్థుడు ఏదైనా ప్రశ్న అడిగితే లేదా తప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే, దాని గురించి తర్కించుకునేలా ఆయనకు సహాయం చేయడానికి మనం కూడా ప్రశ్నలు ఉపయోగించవచ్చు.
4. తర్కించుకునేందుకు గృహస్థులకు ఎందుకు సహాయం చేయాలి?
4 తర్కించుకునేలా గృహస్థులకు సహాయం చేసినప్పుడు మనం గొప్ప బోధకుడైన యేసును, మొదటి శతాబ్దంలో జీవించిన నైపుణ్యంగల సువార్తికులను అనుకరిస్తాం. అంతేకాక గృహస్థులకు గౌరవమర్యాదలు చూపిస్తాం. (1 పేతు. 3:15) దానివల్ల, వాళ్లు మనల్ని మరోసారి రానిచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.