ఈ పనిలో మనకు యెహోవా తర్ఫీదు ఇస్తున్నాడు
1. యెహోవా మనుష్యులకు ఏదైనా పని అప్పగించినప్పుడు ఏమి చేస్తాడు?
1 యెహోవా మనుష్యులకు ఏదైనా పని అప్పగిస్తే దాన్ని పూర్తి చేయడానికి కావాల్సిన సహాయం కూడా అందిస్తాడు. ఉదాహరణకు, నోవహు ముందెప్పుడూ చేయని పని అంటే ఓడ కట్టే పని చేయమని యెహోవా చెప్పాడు. అయితే దాన్ని ఎలా చేయాలో కూడా చెప్పాడు. (ఆది. 6:14-16) ఇశ్రాయేలులోని పెద్దలనూ ఫరోనూ వెళ్లి కలవమని సాత్వికుడు, గొర్రెల కాపరి అయిన మోషేకు చెబుతూ యెహోవా ఇలా అభయమిచ్చాడు: “నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదను.” (నిర్గ. 4:12) యెహోవా మనకు సువార్త ప్రకటించమని చెప్పడమే కాదు దాన్ని ఎలా చేయాలనే విషయంలో నిర్దేశం కూడా ఇచ్చాడు. దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, సేవాకూటంలో ఈ పని కోసం కావాల్సిన తర్ఫీదు ఇస్తున్నాడు. దాన్నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?
2. దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?
2 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల: ప్రతీ కూటానికి వెళ్లేముందు ఆ వారం పట్టికలో ఇచ్చిన సమాచారం చదివి, అధ్యయనం చేయండి. విద్యార్థులు ఆ సమాచారాన్ని ఉపయోగించి తమ ప్రసంగాలు ఎలా ఇస్తున్నారో గమనిస్తే మీరు చక్కగా బోధించడం నేర్చుకుంటారు. (సామె. 27:17) మీ పరిచర్య పాఠశాల పుస్తకాన్ని కూటానికి తీసుకెళ్లి, దాన్ని వర్క్బుక్లా ఉపయోగించండి. ప్రతీ విద్యార్థి ప్రసంగం తర్వాత పాఠశాల పర్యవేక్షకుడు ఆ పుస్తకంలో నుండి మాట్లాడుతున్నప్పుడు, మీరు పాటించాలనుకుంటున్న విషయాల కింద గీత పెట్టుకోండి. పుస్తకంలోని ఖాళీ స్థలంలో నోట్సు రాసుకోండి. అయితే, పాఠశాలలో పాల్గొంటేనే దాన్నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతారు. మీరు ఆ పాఠశాలలో చేరారా? అలాగైతే మీరు ప్రసంగ నియామకం అందుకున్నప్పుడు బాగా సిద్ధపడండి, ఇచ్చిన సలహా పాటించండి. నేర్చుకున్న విషయాలు పరిచర్యలో ఉపయోగించండి.
3. సేవాకూటం నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?
3 సేవాకూటం: సమాచారాన్ని ముందుగా చదివి, జవాబులు చెప్పడానికి సిద్ధపడితే కూటంలో ఇచ్చిన సలహాలు బాగా గుర్తుంటాయి. మన వ్యాఖ్యానాలు చిన్నగా ఉంటే ఎక్కువమందికి వ్యాఖ్యానించే అవకాశం దొరుకుతుంది. ప్రదర్శనలను జాగ్రత్తగా గమనించి, పరిచర్యలో చక్కగా సహాయం చేస్తాయనుకున్న సలహాలు పాటించండి. మన రాజ్య పరిచర్యలో వచ్చిన ముఖ్య ఆర్టికల్స్‌ను ముందుముందు ఉపయోగించడం కోసం దాచిపెట్టుకోండి.
4. దేవుడిచ్చే తర్ఫీదును మనం ఎందుకు సద్వినియోగం చేసుకోవాలి?
4 దేవుడు నోవహుకు, మోషేకు ఇచ్చిన పనుల్లాగే లోకమంతటా సువార్త ప్రకటించడమనే మన పని కూడా అంత తేలికేమీ కాదు. (మత్త. 24:14) మన ‘మహోపదేశకుడైన’ యెహోవాపై ఆధారపడుతూ ఆయనిచ్చే తర్ఫీదును సద్వినియోగం చేసుకుంటే మన పరిచర్యను చక్కగా చేయగలుగుతాం.—యెష. 30:20, NW.