ప్రకటనా పనిని అమూల్యంగా ఎంచండి
1. లోకంలో చాలామంది ప్రకటనా పని గురించి ఏమనుకుంటున్నారు?
1 సాతాను లోకంలో చాలామందికి మన ప్రకటనా పని ‘వెర్రితనంగా’ అనిపిస్తుంది. (1 కొరిం. 1:18-21) మనం జాగ్రత్తగా లేకపోతే అలాంటి తప్పుడు ఆలోచన వల్ల నిరుత్సాహపడే, మన ఆసక్తి సన్నగిల్లే ప్రమాదముంది. (సామె. 24:10; యెష. 5:20) యెహోవాసాక్షులుగా ఉండడమనే గొప్ప గౌరవాన్ని మనం ఎందుకు అమూల్యంగా ఎంచుతాం?—యెష. 43:10.
2. పరిచర్యను ‘పరిశుద్ధమైన పని’ అని ఎందుకు అనవచ్చు?
2 ‘పరిశుద్ధమైన పని’: అపొస్తలుడైన పౌలు పరిచర్యను, ‘పరిశుద్ధమైన పని’ అన్నాడు. (రోమా. 15:15, 16, NW) పరిచర్యను ‘పరిశుద్ధమైన పని’ అని ఎందుకు అనవచ్చు? ఎందుకంటే, దానిలో పాల్గొన్నప్పుడు, ‘పరిశుద్ధుడైన’ యెహోవాకు మనం ‘జతపనివాళ్లం’ అవుతాం, ఆయన పేరు పరిశుద్ధపర్చడానికి తోడ్పడతాం. (1 కొరిం. 3:9; 1 పేతు. 1:14-16) ప్రకటనా పనిని యెహోవా ‘స్తుతియాగంగా’ ఎంచుతాడు కాబట్టి అది మన ఆరాధనలో ఒక ముఖ్యమైన భాగం.—హెబ్రీ. 13:15.
3. సువార్త ప్రకటనా పని మనకు దొరికిన గొప్ప గౌరవం అని ఎందుకు చెప్పవచ్చు?
3 సువార్త ప్రకటించడమనే గొప్ప అవకాశాన్ని దేవుడు కొందరికే ఇచ్చాడు. దేవదూతలు అలాంటి పనిని సంతోషంగా, చాలా చక్కగా నెరవేరుస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. (1 పేతు. 1:12) అయితే, ‘మంటి ఘటములకు’ అంటే అపరిపూర్ణ మానవులమైన మనకు యెహోవా ఈ గొప్ప అవకాశమిచ్చాడు.—2 కొరిం. 4:7.
4. పరిచర్యను అమూల్యంగా ఎంచుతున్నామని మనమెలా చూపించవచ్చు?
4 ఎంతో ప్రాముఖ్యమైన పని: పరిచర్య చేయడమనే గొప్ప గౌరవాన్ని మనం అమూల్యంగా పరిగణిస్తాం, అందుకే దాన్ని మన జీవితంలోని ‘శ్రేష్ఠమైన కార్యాల్లో’ ఒకటిగా ఎంచుతాం. (ఫిలి. 1:9-11) ప్రతీవారం దానికోసం సమయాన్ని కేటాయిస్తాం. ఉదాహరణకు, ఒక సంగీతకారునికి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వాద్యబృందంలో వాయించే అవకాశం దొరకడం గొప్ప విషయం. ఆ అవకాశాన్ని అమూల్యంగా ఎంచే వ్యక్తి ప్రతీ ప్రదర్శనకు సిద్ధపడతాడు, తన నైపుణ్యాన్ని పెంచుకోవడానికి కృషిచేస్తాడు. అలాగే మనం కూడా పరిచర్యకు వెళ్లేముందు సిద్ధపడతాం, మన ‘బోధనా కళను’ వృద్ధిచేసుకోవడానికి ప్రయత్నిస్తాం. దానివల్ల ‘సత్య వాక్యాన్ని సరిగా ఉపదేశించగలుగుతాం.’—2 తిమో. 2:15; 4:2, NW.
5. మన పరిచర్యను ఎవరు విలువైనదిగా ఎంచుతారు?
5 పరిచర్యలో ఎక్కువమంది స్పందించే తీరును బట్టి నిరుత్సాహపడకండి. మన పనిని విలువైనదిగా ఎంచేవాళ్లు మన ప్రాంతంలో చాలామంది ఉన్నారని గుర్తుంచుకోండి. అయితే, మనం మనుషుల మెప్పు కోసం చూడం. కానీ యెహోవా మన పనిని ఎలా ఎంచుతాడనేదే మరింత ప్రాముఖ్యం. మనం శ్రద్ధగా చేసే ప్రయత్నాలను ఆయనెంతో విలువైనవిగా పరిగణిస్తాడు.—యెష. 52:7.