ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలు నిర్వహించడం—విద్యార్థులను సంస్థ వైపుకు ఎలా నడిపించవచ్చు?
1 విద్యార్థులకు సిద్ధాంతపరమైన సమాచారం బోధించాలని మాత్రమే కాదు క్రైస్తవ సంఘంలో భాగమవడానికి వాళ్లకు సహాయం చేయాలనే లక్ష్యంతో బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తాం. (జెక. 8:23) యెహోవాసాక్షులు—వారు ఎవరు? వారి నమ్మకాలు ఏమిటి? అనే బ్రోషుర్ అందుకు సహాయం చేస్తుంది. కొత్త బైబిలు విద్యార్థులకు ఒక ప్రతి ఇచ్చి దాన్ని చదవమని ప్రోత్సహించండి. అంతేకాదు, ప్రతీవారం అధ్యయనం నిర్వహిస్తున్నప్పుడు కొన్ని నిమిషాలు యెహోవా సంస్థ గురించి ఒక అంశం బోధించండి.
2 సంఘ కూటాలు: బైబిలు విద్యార్థులు ముఖ్యంగా సంఘ కూటాల్లో మనతో సహవసిస్తే దేవుని సంస్థను అర్థం చేసుకోగలుగుతారు. (1 కొరిం. 14:24, 25) అందుకే మీరు వారంలో జరిగే ఐదు కూటాల గురించి అంటే ఒక్కోసారి ఒక్కో కూటం గురించి వివరిస్తూ కూటాలను పరిచయం చేయవచ్చు. ఆ వారంలో ఇవ్వబడే బహిరంగ ప్రసంగ ముఖ్యాంశాన్ని పేర్కొనండి. కావలికోట అధ్యయనంలో, సంఘ బైబిలు అధ్యయనంలో పరిశీలించబోయే సమాచారం చూపించండి. దైవపరిపాలనా పరిచర్య పాఠశాల గురించి, సేవాకూటం గురించి వివరించండి. మీకు పాఠశాలలో నియామకముంటే వాళ్లతో అభ్యాసం చేయవచ్చు. కూటాల్లో నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను వాళ్లతో పంచుకోండి. మన ప్రచురణల్లోని చిత్రాలు చూపిస్తూ కూటాలు ఎలా జరుగుతాయో వివరించండి. మొదటి అధ్యయనం నుండే వాళ్లను కూటాలకు ఆహ్వానించండి.
3 జ్ఞాపకార్థ ఆచరణ, సమావేశాలు లేదా ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనం దగ్గర పడుతున్నప్పుడు కొన్ని నిమిషాలు ఆ ఏర్పాట్ల గురించి వివరించండి, వాటిపట్ల వాళ్లలో ఉత్సాహం పెంచండి. మనల్ని యెహోవాసాక్షులని ఎందుకంటారు? కూటాలు జరిగే స్థలాలను రాజ్యమందిరాలని ఎందుకంటాం? పెద్దల, పరిచర్య సేవకుల బాధ్యతలేమిటి? ప్రకటనా పని, క్షేత్రం ఎలా వ్యవస్థీకరించబడతాయి? మన సాహిత్యం ఎలా తయారౌతుంది? సంస్థకు ఆర్థిక మద్దతు ఎలా లభిస్తుంది? పనిని పర్యవేక్షించే విషయంలో బ్రాంచి కార్యాలయం, పరిపాలక సభ ఏ పాత్ర పోషిస్తాయి? వంటి ప్రశ్నలకు క్రమంగా జవాబులివ్వండి.
4 ఉపదేశాత్మక వీడియోలు: బైబిలు విద్యార్థులు మన వీడియోలు చూసి కూడా యెహోవా అద్భుతమైన సంస్థ గురించి తెలుసుకోగలుగుతారు. భూదిగంతముల వరకు (ఆంగ్లం), విశ్వవ్యాప్తంగా ఉన్న మన సౌభ్రాతృత్వం (ఆంగ్లం), దైవిక బోధ ద్వారా ఐక్యమయ్యారు (ఆంగ్లం) వంటి వీడియోలు ఉపయోగించండి. ఐదు సంవత్సరాలుగా మన ప్రచురణలు తీసుకుంటున్న ఒక స్త్రీ, యెహోవాసాక్షులు—ఆ పేరు వెనుకనున్న సంస్థ (ఆంగ్లం) అనే వీడియో చూసి కంటతడి పెట్టుకుంది. తనను కలిసే సాక్షులను ఆమె నమ్మేది, అయితే వీడియో చూశాక వాళ్ల సంస్థను కూడా నమ్మవచ్చని ఆమెకు అనిపించింది. ఆమెతో బైబిలు అధ్యయనం మొదలైంది, తర్వాతి వారం రాజ్యమందిరంలో కూటాలకు హాజరైంది.
5 ప్రతీవారం మన బైబిలు విద్యార్థులతో కొన్ని నిమిషాలు వెచ్చిస్తూ, మనకు అందుబాటులోవున్న బైబిలు ఉపకరణాలు ఉపయోగిస్తూ నేడు యెహోవా ఉపయోగించుకుంటున్న ఏకైక సంస్థ వైపుకు నడిపించవచ్చు.
[అధ్యయన ప్రశ్నలు]
1. ప్రతీవారం బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నప్పుడు యెహోవా సంస్థ గురించి ఒక అంశం బోధించడం ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుంది?
2. సంఘ కూటాలకు హాజరవ్వమని బైబిలు విద్యార్థులను ఎలా ప్రోత్సహించవచ్చు?
3. సంస్థకు సంబంధించిన ఏ అంశాలను మనం చర్చించవచ్చు?
4, 5. మన వీడియోలు సంస్థ పట్ల అవగాహనను, కృతజ్ఞతను ఎలా పెంచుతాయి?