మీరు “మాసిదోనియకు” వెళ్లగలరా?
1. పౌలు, ఆయన సహచరులు మాసిదోనియకు ఎందుకు వెళ్లారు?
1 అపొస్తలుడైన పౌలు దాదాపు సా.శ. 49లో తన రెండవ మిషనరీ యాత్ర కోసం సిరియలోని అంతియొకయ నుండి బయలుదేరాడు. ఎఫెసును, ఆసియా మైనరులోని ఇతర నగరాలను సందర్శించాలన్నదే ఆయన లక్ష్యం. కానీ, పరిశుద్ధాత్మ వల్ల కలిగిన ఒక దర్శనంలో ‘మాసిదోనియకు రమ్ము’ అనే ఆహ్వానం అందుకున్నాడు. ఆయన, ఆయన సహచరులు ఆ ఆహ్వానాన్ని సంతోషంగా స్వీకరించారు, దాంతో ఆ ప్రాంతంలో మొదటి సంఘాన్ని స్థాపించే గొప్ప అవకాశం వారికి దొరికింది. (అపొ. 16:9, 10; 17:1, 2, 4) నేడు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కోత పనివారి అవసరం చాలావుంది. (మత్త. 9:37, 38) కాబట్టి మీరు సహాయం చేయగలరా?
2. కొందరు వేరే ప్రాంతానికి వెళ్లి సేవచేయడం గురించి ఎందుకు ఆలోచించి ఉండకపోవచ్చు?
2 పౌలులా మీరు కూడా మిషనరీ అవ్వాలని అనుకుంటుండవచ్చు కానీ, వేరే ప్రాంతానికి వెళ్లడం గురించి గంభీరంగా ఆలోచించి ఉండకపోవచ్చు. మీ వయస్సు వల్ల గానీ మీరు ఒంటరి సహోదరి అవడం వల్ల గానీ బహుశా పిల్లలు ఉండడం వల్ల గానీ గిలియడ్ పాఠశాలలో శిక్షణ లేదా ఇతర ప్రత్యేక శిక్షణలు పొందడం మీకు సాధ్యం కాకపోతుండవచ్చు. లేదా మరో భాష నేర్చుకోగలరనే నమ్మకం లేనందువల్ల వేరే ప్రాంతానికి వెళ్లడం గురించి మీరు ఆలోచించి ఉండకపోవచ్చు. లేదా ఆర్థిక కారణాల వల్ల మీరు వలసవచ్చివుంటారు కాబట్టి మళ్లీ వేరే ప్రాంతానికి వెళ్లాలంటే సంకోచిస్తుండవచ్చు. అయితే, ఈ విషయం గురించి బాగా ఆలోచించి, ప్రార్థిస్తే అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లగలరని మీకు అనిపించవచ్చు.
3. వేరే ప్రాంతంలో చక్కగా ప్రకటించాలంటే ప్రత్యేక శిక్షణ ఎందుకు తప్పనిసరి కాదు?
3 తప్పనిసరిగా ప్రత్యేక శిక్షణ పొందాలా? పౌలు, అతని సహచరులు ఎలా సఫలులయ్యారు? యెహోవా మీద, ఆయన పరిశుద్ధాత్మ మీద వారు ఆధారపడ్డారు. (2 కొరిం. 3:1-5) కాబట్టి, పరిస్థితుల వల్ల మీరు ప్రత్యేక శిక్షణ పొందలేకపోయినా వేరే ప్రాంతంలో చక్కగా పరిచర్య చేయవచ్చు. మీరు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, సేవాకూటంలో క్రమంగా శిక్షణ పొందుతున్నారని కూడా గుర్తుంచుకోండి. ఏదైనా ప్రత్యేక పాఠశాలకు హాజరవ్వాలనే లక్ష్యం మీకుంటే, వేరే ప్రాంతానికి వెళ్లి సేవచేసి గడించే విలువైన అనుభవం అదనపు శిక్షణ పొందడానికి మీకు ఆహ్వానం దొరికితే ఉపయోగపడుతుంది.
4. వేరే ప్రాంతంలో సేవ చేయడం తమవల్ల కాదని పెద్దవయసు వాళ్లు ఎందుకు అనుకోకూడదు?
4 పెద్దవయసు వాళ్లు: ఆధ్యాత్మిక పరిణతి, ఓ మోస్తరు ఆరోగ్యం ఉన్న పెద్దవయసు వాళ్లు అవసరం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఎంతో సేవ చేయగలరు. మీరు ఉద్యోగ విరమణ పొందారా? కొన్ని ప్రాంతాల్లో మంచి వైద్యానికి, ఇతర అవసరాలకు మీ ప్రాంతంలో అయ్యేంత ఖర్చు కాదు. అలాంటి ప్రాంతాల్లో కొందరు తక్కువ పింఛనుతో కూడా చక్కగా జీవించగలుగుతున్నారు.
5. ఉద్యోగ విరమణ తర్వాత, అవసరం ఎక్కువ ఉన్న చోట సేవ చేయడానికి తరలి వెళ్లిన ఒక సహోదరుని అనుభవం చెప్పండి.
5 ఆంగ్ల భాష మాట్లాడే ఒక దేశంలో పెద్దగా, పయినీరుగా సేవచేస్తున్న ఉద్యోగ విరమణ పొందిన ఒక సహోదరుడు, తొమ్మిదిమంది ప్రచారకులున్న ఒక ఆంగ్ల భాషా గుంపుకు సహాయం చేయడానికి ఆగ్నేయాసియాలోని సుప్రసిద్ధ టూరిస్టు ప్రాంతానికి తరలి వెళ్లాడు. ఆ గుంపు అక్కడున్న 30,000 మంది విదేశీయులకు ప్రకటించింది. రెండేళ్లలోనే 50 మంది కూటాలకు హాజరవడం మొదలుపెట్టారు. ఆ సహోదరుడు ఇలా అన్నాడు: “ఇక్కడకు రావడంవల్ల నేను గొప్ప ఆశీర్వాదాలు పొందాను. వాటిలో మచ్చుకు కొన్ని చెప్పాలన్నా సమయం సరిపోదు!”
6. అవసరం ఎక్కువున్న దేశంలో సేవ చేయడానికి వెళ్లిన ఒంటరి సహోదరి అనుభవం చెప్పండి.
6 ఒంటరి సహోదరీలు: అవసరం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి సహోదరీలను యెహోవా ఎంతో గొప్ప రీతిలో ఉపయోగించుకున్నాడు. (కీర్త. 68:11) ఒక ఒంటరి యౌవన సహోదరికి వేరే దేశంలో పరిచర్య చేయాలనే లక్ష్యం ఉండేది, కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం ఆమె క్షేమం గురించి ఆలోచించారు. కాబట్టి రాజకీయపరంగా, ఆర్థికపరంగా స్థిరంగా ఉన్న దేశాన్ని ఎంచుకొని బ్రాంచి కార్యాలయానికి ఉత్తరం రాసింది. వారు సహాయకరమైన నిర్దిష్ట సమాచారాన్ని ఇచ్చారు. ఆమె కొత్త దేశంలోవున్న ఆరు సంవత్సరాల్లో ఎన్నో ఆశీర్వాదాలు పొందింది. ఆమె ఇలా అంది: “ముందు నేనున్న ప్రాంతంలో కొన్ని బైబిలు అధ్యయనాలు మాత్రమే చేసే అవకాశం ఉండేది. కానీ అవసరం ఎక్కువున్న దేశంలో సేవ చేయడంతో నేను ఎన్నో బైబిలు అధ్యయనాలు చేయగలుగుతున్నాను, నా బోధనా కళకు పదునుపెట్టగలుగుతున్నాను.”
7. ఒక కుటుంబం వేరే ప్రాంతానికి తరలి వెళ్లిన అనుభవం చెప్పండి.
7 కుటుంబాలు: మీకు పిల్లలుంటే, సువార్త ప్రకటించేందుకు వేరే ప్రాంతానికి తరలి వెళ్లడం సాధ్యంకాదని అనుకోవాలా? ఎనిమిది, పది సంవత్సరాల వయసుగల ఇద్దరు పిల్లలున్న ఒక కుటుంబం అలా వెళ్లి చూడాలని అనుకుంది. వాళ్ల అనుభవం గురించి తల్లి ఇలా రాసింది: “మా పిల్లల్ని ఇక్కడ పెంచగలిగినందుకు మేము ఎంతో కృతజ్ఞులం, ఎందుకంటే ఇక్కడ వాళ్లు ప్రత్యేక పయినీర్లతో, మిషనరీలతో సహవసించారు. అవసరం ఎక్కువున్న చోట సేవచేయడం వల్ల మేమెన్నో ఆశీర్వాదాలు పొందాం.”
8. మరో భాష నేర్చుకోకుండా వేరే ప్రాంతంలో సేవ చేయడం సాధ్యమేనా? వివరించండి.
8 భాషాపరమైన సమస్య: మరో భాష నేర్చుకోవాల్సి వస్తుందేమోనని మీరు వేరే ప్రాంతానికి వెళ్లడానికి సంకోచిస్తున్నారా? రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువున్న కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు మీ భాషే మాట్లాడుతుండవచ్చు. స్పానిష్ మాట్లాడే ఒక ప్రాంతంలో ఆంగ్ల భాష మాట్లాడే వలసదారులు ఎక్కువమంది ఉన్నారని, ఆంగ్ల భాష మాట్లాడే ఒక జంట అక్కడికి తరలి వెళ్లింది. వాళ్లు ఆ దేశంలో అవసరం ఎక్కువున్న ఆంగ్ల భాషా సంఘాల గురించిన సమాచారం బ్రాంచి కార్యాలయం నుండి పొందారు. తర్వాత, వాటిలో ఒక సంఘాన్ని ఎంచుకొని అక్కడకు రెండుసార్లు వెళ్లొచ్చారు. ఇంటికి వచ్చాక, నెలసరి ఖర్చులు తగ్గించుకొని సంవత్సరానికి సరిపోయే డబ్బు పొదుపు చేశారు. వాళ్లు బయల్దేరడానికి సిద్ధమైనప్పుడు, తక్కువ అద్దె ఇల్లు వెదకడానికి అక్కడి సహోదరులు సహాయం చేశారు.
9, 10. సొంత ఊరు వదిలి వచ్చినవాళ్లు దేని గురించి ఆలోచించవచ్చు? ఎందుకు?
9 వలసదారులు: బహుశా సత్యం తెలుసుకోవడానికి ముందు మీరు మీ స్వదేశం విడిచి వచ్చారా లేదా మీ దేశంలోనే మరో ప్రాంతానికి వచ్చారా? మీ సొంత ఊరిలోనే కోత పనివాళ్ల అవసరం ఎక్కువ ఉందేమో! సహాయం చేయడానికి మీరు తిరిగి వెళ్లగలరా? పరదేశులకన్నా మీకు అక్కడ ఉద్యోగం, వసతి సులువుగా దొరకవచ్చు. అక్కడి భాష కూడా మీకు వచ్చేవుంటుంది. అంతేకాదు, పరదేశులకన్నా మీరు రాజ్య సందేశాన్ని ప్రకటించినప్పుడు ప్రజలు చక్కగా వినే అవకాశం ఉంటుంది.
10 ఒక వ్యక్తి అల్బేనియా నుండి ఇటలీకి శరణార్థిగా వెళ్లి, ఉద్యోగం సంపాదించుకుని, అల్బేనియాలో ఉన్న తన కుటుంబానికి డబ్బు పంపించేవాడు. ఆయన సత్యంలోకి వచ్చాక, కొంతమంది ప్రత్యేక పయినీర్లకు అల్బేనియన్ భాష నేర్పించడం మొదలుపెట్టాడు, వాళ్లు అవసరం ఎక్కువున్న చోట సేవచేయడానికి ఇటలీ నుండి అల్బేనియాకు వచ్చారు. ఆ సహోదరుడు ఇలా అన్నాడు: “వాళ్లు నేను వదిలి వచ్చిన క్షేత్రానికి వెళ్తున్నారు. అక్కడి భాష రాకపోయినా ఎంతో సంతోషంగా వెళ్తున్నారు. మరి అల్బేనియా భాష, సంప్రదాయం తెలిసిన నేను ఇటలీలో ఏం చేస్తున్నాను?” ఆ సహోదరుడు, సువార్త వ్యాప్తి చేయడానికి అల్బేనియాకు తిరిగివెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “ఇటలీలో చేసే ఉద్యోగం, రాబడి విడిచిపెట్టినందుకు నేను ఏమైనా బాధపడుతున్నానా? అస్సలు లేదు. అల్బేనియాలో నాకు నిజమైన పని దొరికింది. నా అభిప్రాయం ప్రకారం, పూర్ణహృదయంతో యెహోవా సేవ చేయడమే నిజంగా ప్రాముఖ్యమైన పని, అదే శాశ్వత సంతోషాన్నిస్తుంది!”
11, 12. అవసరం ఎక్కువున్న చోట సేవ చేయాలనుకునే వాళ్లు ఏమి చేయాలి?
11 ఎలా చేయాలి? మాసిదోనియకు వెళ్లేముందు పౌలు, ఆయన సహచరులు పడమర వైపు వెళ్లాలనుకున్నారు. కానీ ‘పరిశుద్ధాత్మ వాళ్లను ఆటంకపరిచింది’ కాబట్టి వాళ్లు ఉత్తరం వైపు వెళ్లారు. వాళ్లు బితూనియ దగ్గరకు వచ్చినప్పుడు యేసు వాళ్లను వెళ్లనివ్వలేదు. (అపొ. 16:6, 7) ఇప్పుడు కూడా యెహోవా దేవుడు యేసు ద్వారా ప్రకటనా పనిని పర్యవేక్షిస్తున్నాడు. (మత్త. 28:20) కాబట్టి మీరు అవసరం ఎక్కువున్న చోట సేవ చేయాలని అనుకుంటుంటే యెహోవా నిర్దేశం కోసం ప్రార్థించండి.—లూకా 14:28-30; యాకో. 1:5; “మీరు వెళ్లాలనుకుంటున్న ప్రాంతంలో అవసరం ఎక్కువ ఉందో లేదో తెలుసుకోవడానికి . . . ” అనే బాక్సు చూడండి.
12 మీరు విదేశీ నియామకంలో బాగా రాణించగలరో లేదో చెప్పమని మీ సంఘ పెద్దలను, పరిణతి చెందిన ఇతర క్రైస్తవులను అడగండి. (సామె. 11:14; 15:22) అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవ చేయడం గురించి తెలియజేసే ప్రచురణలు చదవండి, మీరు వెళ్లాలనుకుంటున్న స్థలాల గురించి పరిశోధించండి. ఆ ప్రదేశాన్ని చూడడానికి వెళ్లినప్పుడు అక్కడ ఎక్కువ రోజులు ఉండగలరా? వేరే ప్రాంతానికి వెళ్లాలని నిజంగా అనుకుంటున్నట్లయితే ఎక్కువ సమాచారం కోసం బ్రాంచి కార్యాలయానికి ఉత్తరం రాయవచ్చు. అయితే, ఉత్తరాన్ని నేరుగా బ్రాంచి కార్యాలయానికి పంపించకుండా, మీ సంఘ పెద్దలకు ఇస్తే దానికి వాళ్ల వ్యాఖ్యానాలు కూడా చేర్చి పంపిస్తారు.—యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం పుస్తకంలోని 111-112 పేజీలు చూడండి.
13. బ్రాంచి కార్యాలయం మీకెలా సహాయం చేస్తుంది? కానీ మీ బాధ్యత ఏమిటి?
13 మీరు నిర్ణయాలు తీసుకోగలిగేలా బ్రాంచి కార్యాలయం అవసరమైన సమాచారాన్ని మీకు పంపిస్తుంది కానీ చట్టపరమైన ఫారాలను, పత్రాలను లేదా వసతిని ఏర్పాటు చేయలేదు. మీరు ఈ వ్యక్తిగత విషయాల గురించి అక్కడకు వెళ్లకముందే జాగ్రత్తగా పరిశోధించాలి. వేరే ప్రాంతానికి వెళ్లేవాళ్లు తమ అవసరాల విషయంలో శ్రద్ధ తీసుకోగలగాలి, చట్టం కోరేవాటిని పాటించగలగాలి.—గల. 6:5.
14. మన పని పరిమితం చేయబడిన దేశాలను చూసి రావడానికి వెళ్తున్నా లేదా అక్కడకు తరలి వెళ్తున్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
14 మన పని పరిమితం చేయబడిన దేశాలు: కొన్ని దేశాల్లో, మన సహోదరసహోదరీలు ఆరాధనా కార్యకలాపాల్లో పాల్గొంటున్నప్పుడు ఎంతో వివేచన చూపించాల్సివుంటుంది. (మత్త. 10:16) ఆ దేశాలను చూసి రావడానికి వెళ్లే లేదా అక్కడకు తరలి వెళ్లే ప్రచారకులు తమకు తెలియకుండానే అనవసరంగా మన పనివైపు ఇతరుల దృష్టిని ఆకర్షించి స్థానిక సహోదరులకు ప్రమాదాన్ని కొనితెచ్చే అవకాశముంది. మీరు అలాంటి దేశానికి తరలి వెళ్లాలని అనుకుంటున్నట్లయితే సంఘ పెద్దల ద్వారా ముందుగా మీ స్థానిక బ్రాంచి కార్యాలయానికి ఉత్తరం రాయండి.
15. వేరే ప్రాంతానికి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించని వాళ్లు తమ పరిచర్యను స్థానికంగా ఎలా విస్తృతం చేసుకోవచ్చు?
15 మీరు వేరే ప్రాంతానికి వెళ్లలేకపోతే: మీరు దూర ప్రాంతానికి తరలి వెళ్లలేకపోతే నిరుత్సాహపడకండి. బహుశా ‘ఫలవంతమైన కార్యాలు చేసే’ వేరే ‘గొప్ప అవకాశం’ మీకు ఉండవచ్చు. (1 కొరిం. 16:8, 9, NW) మీ ఇంటికి ఓ మోస్తరు దూరంలోని అవసరం ఎక్కువున్న ప్రాంతాల గురించి మీ ప్రాంతీయ పర్యవేక్షకునికి తెలిసివుండవచ్చు. బహుశా మీకు దగ్గర్లో ఉన్న సంఘానికి గానీ గుంపుకు గానీ మీరు సహాయం చేయగలరేమో చూడండి. లేదా మీరు సహవసిస్తున్న సంఘంలోనే ఇంకా ఎక్కువ పరిచర్య చేయవచ్చు. మీ పరిస్థితులు ఏవైనా మీరు పూర్ణాత్మతో ఆరాధించడమే ముఖ్యమైన విషయం.—కొలొ. 3:23.
16. అవసరం ఎక్కువున్న చోట సేవచేయడానికి వెళ్లాలని కోరుకునే వాళ్లతో మనం ఎలా వ్యవహరించాలి?
16 అవసరం ఎక్కువున్న చోట సేవచేయాలనే లక్ష్యమున్న ఆధ్యాత్మిక పరిణతి చెందిన క్రైస్తవులు ఎవరైనా మీకు తెలుసా? అలాగైతే వాళ్లకు మద్దతు, ప్రోత్సాహం ఇవ్వండి. పౌలు సిరియలోని అంతియొకయను వదిలి వెళ్లినప్పుడు అది రోమా సామ్రాజ్యంలోని మూడవ పెద్ద నగరం (రోము, అలెక్సంద్రియ తర్వాత). తమ క్షేత్రం అంత పెద్దదైనందుకు అంతియొకయ సంఘానికి పౌలు సహాయం అవసరమైవుంటుంది. పౌలు అక్కడినుండి వెళ్తే వాళ్లకు తీరని లోటు కలుగుతుంది. అయినా, వాళ్లు పౌలును వెళ్లకుండా ఆపారని బైబిలు చెప్పడం లేదు. వాళ్లు తమ ప్రాంతం గురించే ఆలోచించే బదులు ‘లోకమే పొలం’ అని గుర్తుపెట్టుకున్నారు.—మత్త. 13:38.
17. అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లడం గురించి ఎందుకు ఆలోచించాలి?
17 మాసిదోనియకు రమ్మనే ఆహ్వానానికి అనుకూలంగా స్పందించినందుకు పౌలు, ఆయన సహచరులు గొప్పగా ఆశీర్వదించబడ్డారు. వాళ్లు మాసిదోనియలోని ఫిలిప్పీ అనే నగరంలో ఉన్నప్పుడు లూదియ అనే స్త్రీని కలిశారు, “ప్రభువు [‘యెహోవా,’ NW] ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను.” (అపొ. 16:14) లూదియతోపాటు ఆమె ఇంటివాళ్లందరూ బాప్తిస్మం పొందినప్పుడు పౌలు, ఆయన మిషనరీ సహచరులు ఎంత సంతోషించివుంటారో ఒక్కసారి ఊహించండి! లూదియలా నీతిని ప్రేమిస్తూ ఇంకా రాజ్య సందేశం విననివాళ్లు ఎన్నో దేశాల్లో ఉన్నారు. పౌలు “మాసిదోనియకు” వెళ్లినట్లే మీరూ అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్తే అలాంటి వాళ్లను కలుసుకోగలుగుతారు, అలాగే వాళ్లకు సహాయం చేయడంవల్ల వచ్చే ఆనందం మీ సొంతమౌతుంది.
[5వ పేజీలోని బాక్సు]
మీరు వెళ్లాలనుకుంటున్న ప్రాంతంలో అవసరం ఎక్కువ ఉందో లేదో తెలుసుకోవడానికి . . .
• మీ సంఘ పెద్దలను, మీ ప్రాంతీయ పర్యవేక్షకుణ్ణి సంప్రదించండి.
• ఆ ప్రాంతానికి వెళ్లి వచ్చిన లేదా అక్కడ నివసించిన ప్రచారకులతో మాట్లాడండి.
• మీ మాతృభాషలో ప్రకటించగలిగే ప్రాంతానికి వెళ్లడం గురించి ఆలోచిస్తుంటే, అక్కడి ప్రజల్లో ఎంతమంది మీ భాష మాట్లాడతారో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ వంటి సమాచార మూలాల్లో వెదకండి.