కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/11 పేజీలు 3-6
  • కుటుంబాలకు సహాయం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కుటుంబాలకు సహాయం
  • మన రాజ్య పరిచర్య—2011
  • ఇలాంటి మరితర సమాచారం
  • కుటుంబ ఆరాధన మరింత ఆహ్లాదకరంగా చేసుకోగలరా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • క్రైస్తవ కుటుంబ సభ్యులారా, ‘సిద్ధంగా ఉండండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • కుటుంబమంతా కలిసి దేవుని వాక్యాన్ని క్రమంగా చదవండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • కుటుంబములారా, దేవుని సంఘంలో భాగంగా ఆయనను స్తుతించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2011
km 1/11 పేజీలు 3-6

కుటుంబాలకు సహాయం

1. ప్రతీవారం సబ్బాతు వల్ల ఇశ్రాయేలు కుటుంబాలు ఎలా ప్రయోజనం పొందేవి?

1 సబ్బాతు ఆచరణ యెహోవా ప్రేమతో చేసిన ఒక ఏర్పాటు, దానివల్ల కుటుంబాలు ఎంతో ప్రయోజనం పొందాయి. ఈ ఏర్పాటు వల్ల, ఇశ్రాయేలీయులు ఆ రోజున పనులన్నీ పక్కన పెట్టేవాళ్లు కాబట్టి యెహోవా మంచితనం గురించి, ఆయనతో వాళ్లకున్న సంబంధం గురించి ధ్యానించడానికి వాళ్లకు సమయం ఉండేది. తల్లిదండ్రులు ఈ ఏర్పాటును సద్వినియోగం చేసుకుంటూ తమ పిల్లలకు ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్లు. (ద్వితీ. 6:6, 7) ఈ సబ్బాతు వల్ల ప్రతీవారం యెహోవా ప్రజలకు తమ ఆధ్యాత్మికత గురించి ఆలోచించడానికి సమయం దొరికేది.

2. సబ్బాతు యెహోవా గురించి మనకు ఏమి బోధిస్తుంది?

2 నిజమే, కుటుంబాలు సబ్బాతును ఆచరించాలని యెహోవా ఇప్పుడిక కోరడం లేదు. అయితే, ఆ ధర్మశాస్త్రం మన దేవుని గురించి ఒక విషయం మనకు చెబుతోంది. ఆయనకు తన ప్రజల ఆధ్యాత్మిక సంక్షేమం పట్ల ఆసక్తి ఉంది. (యెష. 48:17, 18) ఈ రోజుల్లో, కుటుంబ ఆరాధన ఏర్పాటు చేయడం ద్వారా కూడా యెహోవా ఆ ప్రేమపూర్వకమైన ఆసక్తిని చూపిస్తున్నాడు.

3. కుటుంబ ఆరాధన ఎందుకు ఏర్పాటు చేయబడింది?

3 కుటుంబ ఆరాధన ఎందుకు ఏర్పాటు చేయబడింది? 2009 జనవరి నుండి దైవపరిపాలనా పరిచర్య పాఠశాల, సేవాకూటం జరిగే రోజునే సంఘ పుస్తక అధ్యయనం జరుపుకోవడం మొదలుపెట్టాం. ఈ మార్పు చేయడానికి ఒక కారణం, కుటుంబ ఆరాధన కోసం ప్రతీవారం ప్రత్యేకంగా ఒక రోజును పెట్టుకుని కుటుంబాలు తమ ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలన్నదే. వీలైతే, తమ కుటుంబ ఆరాధనను ఇంతకుముందు పుస్తక పఠనం జరిగే రోజునే పెట్టుకోవాలని, ఈ సమయాన్ని హడావిడి లేకుండా బైబిలు గురించి చర్చించుకోవడానికి ఉపయోగించుకోవాలని, తమ కుటుంబ అవసరాలకు తగిన విధంగా అధ్యయనాన్ని మలచుకోవాలని కుటుంబాలను ప్రోత్సహిస్తున్నాం.

4. కుటుంబ ఆరాధన ఒక గంటే చేయాలా? వివరించండి.

4 సంఘ పుస్తక అధ్యయనానికి హాజరవ్వాలంటే తయారవ్వడం, ప్రయాణించడం వంటి వాటికి మనకు సమయం అవసరమయ్యేది. మనలో చాలామందికి, ఒక్క గంట జరిగే ఈ కూటానికి హాజరవడానికి ఒక సాయంత్రమంతా గడిచిపోయేది. మన కూటాల్లో మార్పు చేయడం వల్ల ఈ సాయంత్రాన్ని కుటుంబంగా యెహోవాను ఆరాధించడానికి ఉపయోగించుకోగలుగుతున్నాం. కాబట్టి కుటుంబ ఆరాధన ఒక గంటే చేయాలనేమీ లేదు. అయితే, మన కుటుంబ అవసరాలను, పరిమితులను పరిగణలోకి తీసుకుని వాటి ప్రకారం, ఎంత సమయం వెచ్చించాలనేది నిర్ణయించుకోవాలి.

5. సమయమంతా చర్చించుకోవడానికే వెచ్చించాలా? వివరించండి.

5 సమయమంతా చర్చించుకోవడానికే వెచ్చించాలా? లేఖనాలకు సంబంధించిన అంశాలను కుటుంబ సభ్యులు కలిసి చర్చించుకున్నప్పుడు వాళ్లు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. (రోమా. 1:12) ఒకరికొకరు దగ్గరవుతారు. కాబట్టి, లేఖనాలకు సంబంధించిన విషయాలను చర్చించుకోవడం కుటుంబ ఆరాధనలో ముఖ్యాంశంగా ఉండాలి. అయితే, కుటుంబంలోని ప్రతీ ఒక్కరు వ్యక్తిగత అధ్యయనం చేయడానికి కూడా సమయాన్ని వెచ్చించవచ్చు. ఉదాహరణకు, అందరూ కలిసి చర్చించుకున్న తర్వాత, కుటుంబమంతా అక్కడే కూర్చుని ఎవరికి వాళ్లు తమ వ్యక్తిగత అధ్యయనాన్ని చేసుకోవచ్చు. అంటే బహుశా కూటాలకు సిద్ధపడవచ్చు లేదా పత్రికలను చదువుకోవచ్చు. కొన్ని కుటుంబాలు ఆ సాయంకాలమంతా టీవీ చూడకూడదని నిర్ణయించుకుంటాయి.

6. కుటుంబ ఆరాధనలో ఎలా చర్చించుకోవచ్చు?

6 కుటుంబ ఆరాధనలో ఎలా చర్చించుకోవచ్చు? కుటుంబ ఆరాధన ఎప్పుడూ ప్రశ్నాజవాబుల పద్ధతిలోనే చేసుకోవాల్సిన అవసరం లేదు. కుటుంబ ఆరాధన ఆహ్లాదకరంగా, ఆసక్తికరంగా చేసుకోవడానికి, చాలా కుటుంబాలు తమ కుటుంబ ఆరాధనను వారం మధ్యలో జరిగే కూటాల్లా జరుపుకుంటున్నాయి. వాళ్లు దానిని భాగాలుగా విభజించుకుని, వివిధ రకాలుగా చేసుకుంటారు. ఉదాహరణకు, వాళ్లు కలిసి బైబిలు చదువుతారు, కూటాల్లోని కొంత భాగాన్ని సిద్ధపడతారు, పరిచర్యలో ఎలా మాట్లాడాలనేది ప్రాక్టీసు చేస్తారు. 6వ పేజీలో కొన్ని సలహాలు ఉన్నాయి.

7. తల్లిదండ్రులు కుటుంబ ఆరాధనను ఎలా చేయడానికి కృషిచేయాలి?

7 తల్లిదండ్రులు కుటుంబ ఆరాధనను ఎలా చేయడానికి కృషిచేయాలి? హడావిడి లేకుండా మీరు ప్రేమతో అధ్యయనం చేస్తే మీ కుటుంబ సభ్యులు చక్కగా నేర్చుకుంటారు. వాతావరణం బాగుంటే కొన్నిసార్లు ఆరుబయట కుటుంబ ఆరాధన చేసుకోవచ్చు. కావాలనుకుంటే మధ్యలో కాసేపు విరామం తీసుకోవచ్చు. కొంతమంది కుటుంబ ఆరాధన అయిపోయిన తర్వాత ఏమైనా తింటారు. తల్లిదండ్రులు కుటుంబ ఆరాధన చేసేటప్పుడు పిల్లల్ని కొట్టడం, తిట్టడం లాంటివి చేయరు గానీ, పిల్లల ప్రవర్తన సరిగా లేకపోతే సరిదిద్దడానికి లేదా ఏదైనా సమస్య తలెత్తితే దానిని పరిష్కరించడానికి కొంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అయితే, పిల్లల్లో ఒకరికి ఏదైనా సున్నితమైన వ్యక్తిగత సమస్య ఎదురైతే మిగతా పిల్లల ముందు ఆ విషయం గురించి మాట్లాడడం వాళ్లకు అవమానకరంగా ఉంటుంది. అందుకే వారంలో మరో రోజు వాళ్లతో ఆ విషయం గురించి ఒంటరిగా మాట్లాడితే బాగుంటుంది. మనం ఆరాధించే దేవుడు సంతోషం గల దేవుడు కాబట్టి కుటుంబ ఆరాధన అందరికీ సంతోషం కలిగించేదిగా ఉండాలి. అంతేకాదు అది సరదాగా, ఆసక్తికరంగా సాగాలి.—1 తిమో. 1:8-11.

8, 9. కుటుంబ శిరస్సు ఎలా సిద్ధపడాలి?

8 కుటుంబ శిరస్సు ఎలా సిద్ధపడాలి? కుటుంబ శిరస్సు ప్రతీవారం ఏ విషయాలు చర్చించాలో, వాటిని ఎలా చర్చిస్తే బాగుంటుందో నిర్ణయించుకుని ముందుగా సిద్ధపడితే కుటుంబ సభ్యులందరూ ఎంతో ప్రయోజనం పొందుతారు. (సామె. 21:5) ఈ విషయంలో భర్త తన భార్యను సంప్రదించవచ్చు. (సామె. 15:22) అప్పుడప్పుడు మీ పిల్లల్ని కూడా వాళ్లు ఏ విషయాలు చర్చించడానికి ఇష్టపడుతున్నారో చెప్పమని అడగవచ్చు. మీరలా చేస్తే మీ పిల్లల ఇష్టాయిష్టాలేమిటో, సమస్యలేమిటో మీకు మరింత బాగా తెలుస్తాయి.

9 కుటుంబ శిరస్సు సిద్ధపడడానికి ప్రతీవారమూ ఎక్కువ సమయం వెచ్చించాల్సిన అవసరం లేదు. కుటుంబ ఆరాధనలో ఏదైనా ఒక దానిని క్రమంగా చదువుతుంటే, కుటుంబ శిరస్సు ప్రతీవారం పూర్తిగా కొత్త తరహాలో చేయడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ప్రతీవారం అధ్యయనం ముగిసిన తర్వాత కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక అవసరాలు మనసులో తాజాగా ఉంటాయి కాబట్టి, వెంటనే తర్వాతి వారానికి సిద్ధపడడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. కొంతమంది తర్వాతి వారంలో చర్చించబోయే విషయాలను ఒక చిన్న కాగితం మీద రాసి ఇంట్లో అందరికీ కనిపించే విధంగా ఫ్రిజ్‌ లాంటి వాటిమీద అతికిస్తారు. అలా చేస్తే అందరూ కుటుంబ ఆరాధన కోసం ఉత్సాహంగా, ఆసక్తిగా ఎదురు చూస్తారు. అవసరమైతే వాళ్లు కూడా సిద్ధపడడానికి సమయం దొరుకుతుంది.

10. ఒక్కరే ఉన్నవాళ్లు కుటుంబ ఆరాధనను ఎలా చేసుకోవచ్చు?

10 ఒక్కరే ఉన్నవాళ్లు కుటుంబ ఆరాధనను ఎలా చేసుకోవాలి? ఒక్కరే ఉన్నవాళ్లు కుటుంబ ఆరాధన సమయంలో వ్యక్తిగత అధ్యయనం చేసుకోవచ్చు. వ్యక్తిగత అధ్యయనంలో ముఖ్యంగా బైబిలు చదవాలి, కూటాలకు సిద్ధపడాలి, కావలికోట పత్రికలను పూర్తిచేయాలి. కొంతమంది ప్రచారకులు వీటితోపాటు ఏదైనా కొత్త ప్రచురణను చదువుతారు లేదా ఒక అంశాన్ని ఎంచుకుని దాని గురించి పరిశోధన చేస్తారు. అప్పుడప్పుడు, లేఖనాల గురించి ప్రోత్సాహకరంగా చర్చించుకోవడానికి ఇతర ప్రచారకులను లేదా ఒక కుటుంబాన్ని ఆహ్వానించాలనుకుంటారు.

11, 12. క్రమంగా కుటుంబ ఆరాధన చేసుకోవడం వల్ల వచ్చే కొన్ని ప్రయోజనాలు ఏమిటి?

11 క్రమంగా కుటుంబ ఆరాధన చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? సత్యారాధనలో మనస్ఫూర్తిగా పాల్గొనేవాళ్లు యెహోవాకు దగ్గరవుతారు. అంతేకాదు, కుటుంబమంతా కలిసి ఆరాధిస్తే ఒకరికొకరు కూడా దగ్గరవుతారు. ఒక జంట వాళ్లు పొందిన ఆశీర్వాదాల గురించి ఇలా రాశారు, “మేము పయినీరు సేవ చేస్తున్నాం. మాకు పిల్లలు లేరు. కుటుంబ ఆరాధన కోసం మేము ఎంతో ఎదురు చూస్తాం. దానివల్ల మేము ఒకరికొకరమే కాదు, మన పరలోక తండ్రికి కూడా దగ్గరవుతున్నామని అనిపిస్తుంది. ఇప్పుడు మేము కుటుంబ ఆరాధన ఉన్నరోజు ఉదయం లేవగానే ఎంతో సంతోషంగా, ‘ఈ రోజు కుటుంబ ఆరాధన కదా’ అని ఒకరికొకరం గుర్తుచేసుకుంటాం.”

12 కుటుంబ ఆరాధన ఏర్పాటు, బిజీగా ఉండే కుటుంబాలకు కూడా సహాయం చేస్తుంది. తన ఇద్దరు అబ్బాయిలను పెంచుతూ పయినీరు సేవ చేస్తున్న ఒక ఒంటరి తల్లి ఇలా రాసింది, “ఇంతకు ముందు మా కుటుంబ అధ్యయనం సరిగ్గా జరిగేది కాదు. నేను చాలా అలసిపోయేదాన్ని కాబట్టి అప్పుడప్పుడు మాత్రమే కుటుంబ అధ్యయనం చేసుకోగలిగేవాళ్లం. దానికి సమయం ఎలా కేటాయించాలో నాకు అర్థమయ్యేది కాదు. కాబట్టి కుటుంబ ఆరాధన అనే ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇప్పుడు మేము క్రమంగా కుటుంబ ఆరాధన చేసుకుంటూ ఎంతో ప్రయోజనం పొందుతున్నాం.”

13. కుటుంబ ఆరాధన ఏర్పాటు నుండి మనం ఎక్కువ ప్రయోజనం పొందాలంటే ఏమి చేయాలి?

13 సబ్బాతులాగే, కుటుంబ ఆరాధన కూడా మన పరలోక తండ్రి ఇచ్చిన ఓ బహుమానం, అది కుటుంబాలకు మేలు చేస్తుంది. (యాకో. 1:17) ఇశ్రాయేలు కుటుంబాలు సబ్బాతు రోజున తమ సమయాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటే ఆధ్యాత్మికంగా అంత ఎక్కువగా ప్రయోజనం పొందేవి. అలాగే, మనం కుటుంబ ఆరాధన సమయాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటే, అంత ఎక్కువగా ప్రయోజనం పొందుతాం. (2 కొరిం. 9:6; గల. 6:7, 8; కొలొ. 3:23, 24) ఈ ఏర్పాటును సరిగ్గా ఉపయోగించుకుంటే కీర్తనకర్త చెప్పిన ఈ మాటలనే మీ కుటుంబం కూడా చెప్పగలుగుతుంది, “నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.”—కీర్త. 73:28.

[5వ పేజీలోని బ్లర్బ్‌]

మనం ఆరాధించే దేవుడు సంతోషం గల దేవుడు కాబట్టి కుటుంబ ఆరాధన అందరికీ సంతోషం కలిగించేదిగా ఉండాలి. అంతేకాదు అది సరదాగా, ఆసక్తికరంగా సాగాలి

[6వ పేజీలోని బాక్సు]

భద్రపర్చుకోండి

కుటుంబ ఆరాధన కోసం కొన్ని సలహాలు

బైబిలు:

• వారపు బైబిలు పఠనంలోని కొంత భాగాన్ని కలిసి చదవండి. బైబిల్లోని కొన్ని వృత్తాంతాలను చదివేటప్పుడు ఒకరు కథనాన్ని చదవవచ్చు, మిగిలినవాళ్లు వివిధ పాత్రల మాటలను చదవవచ్చు.

• బైబిల్లోని కొన్ని సన్నివేశాల ఆధారంగా నాటకం వేయవచ్చు.

• ఆ వారపు బైబిలు పఠనంలోని అధ్యాయాలను ముందుగానే చదివి, వాటిలో తమకు వచ్చిన ఒకట్రెండు సందేహాలను రాసుకు రమ్మని కుటుంబంలోని సభ్యులందరికీ చెప్పండి. అలా ప్రతీ ఒక్కరూ రాసుకు వచ్చిన సందేహాలను కలిసి పరిశోధించండి.

• ప్రతీవారం ఒక చిన్న అట్టముక్క మీద ఒక లేఖనాన్ని రాసుకుని, దాన్ని కంఠస్థం చేసి, వివరించడానికి ప్రయత్నించండి. అలా చాలా కార్డులను పోగుచేసుకుని వాటిలో మీకు ఎన్ని లేఖనాలు గుర్తున్నాయో ప్రతీవారం చూసుకోండి.

• బైబిలు ఆడియో రికార్డింగ్‌ వింటూ మీ బైబిల్లో చూసుకోండి.

కూటాలు:

• కూటాల్లోని కొంత భాగాన్ని కలిసి సిద్ధపడండి.

• తర్వాతి వారం కూటంలో పాడబోయే పాటలను ప్రాక్టీస్‌ చేయండి.

• ఎవరికైనా దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ప్రసంగం ఉంటే దాన్ని ఎలా ఇవ్వవచ్చో లేదా సేవాకూటంలో ప్రదర్శన ఉంటే దాన్ని ఎలా చేయవచ్చో చర్చించండి. కుటుంబ సభ్యుల ముందు దాన్ని ఒకసారి ఇవ్వండి లేదా చేసి చూపించండి.

కుటుంబ అవసరాలు:

• గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి పుస్తకంలో ఉన్న విషయాలను పరిశీలించండి.

• పాఠశాలలో ఎదురయ్యే అవకాశం ఉన్న ఏదైనా ఒక సమస్యను ఎలా పరిష్కరించాలో ముందుగానే చేసి చూసుకోండి.

• తల్లిదండ్రులు పిల్లల పాత్ర, పిల్లలు తల్లిదండ్రుల పాత్ర పోషిస్తూ పిల్లలు ఒక విషయం మీద పరిశోధన చేసి తల్లిదండ్రులకు వివరిస్తున్నట్టు ప్రాక్టీస్‌ చేయండి.

పరిచర్య:

• వారాంతాల్లో పరిచర్యలో ఎలా మాట్లాడాలో, ప్రచురణలను ఎలా అందించాలో ప్రాక్టీస్‌ చేయండి.

• జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో లేదా సెలవుల్లో ఎక్కువ సమయం పరిచర్యలో గడపడానికి తమకు సాధ్యమయ్యే ఏ లక్ష్యాలను పెట్టుకోవచ్చో చర్చించండి.

• పరిచర్యలో ప్రజలు అడిగే వివిధ రకాల ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలో పరిశోధన చేయడానికి ప్రతీ ఒక్కరికీ కొంత సమయం కేటాయించి, తర్వాత ప్రాక్టీస్‌ చేయండి.

అదనపు సలహాలు:

• ఇటీవల వచ్చిన పత్రికల్లోని ఒక ఆర్టికల్‌ను కలిసి చదవండి.

• ప్రతీ ఒక్కరినీ ఇటీవల వచ్చిన పత్రికల్లో వాళ్లకు ఆసక్తిగా అనిపించిన ఒక ఆర్టికల్‌ను చదివి, అందులో ఉన్న విషయాల గురించి చెప్పమనండి.

• అప్పుడప్పుడు మీ కుటుంబ ఆరాధనకు ఒక ప్రచారకుడిని/రాలిని లేదా ఒక జంటను ఆహ్వానించి వాళ్ల అనుభవాలను చెప్పమని అడగవచ్చు.

• మన వీడియోల్లో ఒకదాన్ని చూసి, ఆ తర్వాత దాని గురించి చర్చించండి.

• తేజరిల్లు! పత్రికల్లో వచ్చిన, “యువత ఇలా అడుగుతోంది” అనే భాగాన్ని కలిసి చర్చించండి.

• కావలికోటలో వస్తున్న “మీ పిల్లలకు నేర్పించండి” లేదా “మన యువతకు” అనే భాగాలను కలిసి చర్చించండి.

• గత జిల్లా సమావేశంలో విడుదలైన కొత్త ప్రచురణను లేదా మన పత్రికల్లో వచ్చే అనుభవాలను చదివి చర్చించండి.

• జిల్లా సమావేశానికి లేదా ప్రాంతీయ సమావేశానికి హాజరై వచ్చిన తర్వాత సమావేశాల్లోని ముఖ్యాంశాలను చర్చించండి.

• యెహోవా సృష్టించిన దేన్నైనా పరిశీలించి అది యెహోవా గురించి మనకేమి బోధిస్తుందో చర్చించండి.

• ఏదైనా ఒకదాని నమూనాను, ఒక పటాన్ని, లేదా చార్టును కలిసి తయారుచేయండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి