ప్రార్థనాపూర్వకంగా ధ్యానించడం—ఉత్సాహవంతులైన ప్రచారకులకు అవసరం
1. యేసు తన ముఖ్యమైన పనికి ఎలా ప్రాధాన్యత ఇవ్వగలిగాడు?
1 యేసు ఆ సాయంత్రాన ప్రజలను స్వస్థపర్చాడు, దయ్యాలను వెళ్లగొట్టాడు. మరుసటి రోజు ఆయన శిష్యులు ఆయన కనిపించినప్పుడు, “అందరు నిన్ను వెదకుచున్నారు” అని చెప్పి ఇంకా అద్భుతాలు చేయమని అడిగారు. కానీ యేసు మాత్రం అలా చేయలేదు, ఎందుకంటే సువార్త ప్రకటించడమే ఆయన ముఖ్యమైన పని. ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి; యిందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితిని.” యేసు సువార్త పనికి ఎలా ప్రాధాన్యత ఇవ్వగలిగాడు? ఆయన ప్రార్థన చేసుకోవడానికి, ధ్యానించడానికి పెందలాడే లేచేవాడు. (మార్కు 1:32-39) ఉత్సాహవంతులైన ప్రచారకులుగా ఉండడానికి ప్రార్థన, ధ్యానించడం మనకు కూడా ఎలా సహాయం చేస్తాయి?
2. ఉత్సాహంగా పరిచర్య చేయడానికి మనం ఏ విషయాల గురించి ధ్యానించాలి?
2 ఏ విషయాల గురించి ధ్యానించాలి? ప్రజలు “కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నారు” అని యేసు గమనించాడు. (మత్త. 9:36) అలాగే మనం కూడా ప్రజలు సువార్త తెలుసుకోవడం ఎంత అవసరమనే దాని గురించి ధ్యానించాలి. అంతేకాదు, ఈ విధానానికి ఇంకెంతో కాలం లేదనే దాని గురించి కూడా ఆలోచించవచ్చు. (1 కొరిం. 7:29) యెహోవా పనులు, ఆయన లక్షణాలు, ఆయనకు సాక్షులుగా ఉండడంలోని గొప్పతనం గురించి ధ్యానించవచ్చు. అంతేకాదు, మన క్షేత్రంలోవున్న ప్రజలకు ఇప్పటికీ తెలియని దేవుని వాక్యం నుండి మనం తెలుసుకున్న అమూల్యమైన ఆధ్యాత్మిక సంపదల గురించి కూడా ధ్యానించవచ్చు.—కీర్త. 77:11-13; యెష. 43:10-12; మత్త. 13:52.
3. మనం ఎప్పుడు ధ్యానించవచ్చు?
3 ఎప్పుడు ధ్యానించాలి? దాని కోసం కొంతమంది యేసు చేసినట్టు పెందలాడే లేస్తారు. ఇంకొంతమంది పడుకునే ముందు ధ్యానించడానికి ఇష్టపడతారు. (ఆది. 24:63) మనమెంత బిజీగా ఉన్నా ధ్యానించవచ్చు. కొంతమంది బస్సుల్లో, రైళ్లల్లో ప్రయాణం చేసేటప్పుడు ధ్యానిస్తారు. ఉద్యోగం చేసేవాళ్లు మధ్యాహ్న భోజన సమయంలో ప్రశాంతంగా ధ్యానిస్తారు. పరిచర్యకు బయలుదేరే ముందు కొన్ని నిమిషాలపాటు ధ్యానించినా పరిచర్యను ఉత్సాహంగా, ధైర్యంగా చేయగలుగుతున్నట్టు చాలామందికి అనిపించింది.
4. మనం ఎందుకు ధ్యానించాలి?
4 ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తే యెహోవాకు సేవ చేయాలనే మన కోరిక ఇంకా పెరుగుతుంది, మన జీవితంలో ఆరాధనకు ప్రాముఖ్యతనిస్తాం, పరిచర్యను క్రమంగా చేయాలనే పట్టుదల పెరుగుతుంది. దేవుని ముఖ్య సేవకుడైన యేసు ధ్యానించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందినట్టే మనం కూడా పొందుతాం.