మీ కన్ను తేటగా ఉందా?
1. ‘కంటిని తేటగా’ ఉంచుకోవడం అంటే ఏమిటి?
1 మన కనుదృష్టి దేనిమీద ఉంటుందో అది మన పనులపై ప్రభావం చూపిస్తుంది. “నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగుమయమైయుండును” అని యేసు చెప్పిన మాటలు ఎంత సముచితమో కదా! (మత్త. 6:22) ఆయన చెప్పినట్లు మన కన్ను “తేటగా” ఉంటే, దేవుని చిత్తం చేయాలనే ఏకైక అంశంపై దృష్టినిలుపుతాం. అలా మనం రాజ్యానికి ప్రథమ స్థానమివ్వడమే గాక, అనవసరమైన వస్తు సంబంధ విషయాలు లేదా కార్యకలాపాలు మన పరిచర్యను ఆటంకపర్చకుండా కూడా చూసుకుంటాం.
2. ఏవి మన ఆలోచనను తప్పుదోవ పట్టించవచ్చు? కానీ మనకు ఏది సహాయం చేస్తుంది?
2 స్వయం పరిశీలన చేసుకోవాలి: మనకు అవసరమని వ్యాపార ప్రకటనలు చెప్పే వస్తువులు లేదా ఇతరుల దగ్గరున్న వస్తువులు మన ఆలోచనల్ని తప్పుదోవ పట్టించవచ్చు. సమయం, డబ్బు, శక్తిసామర్థ్యాలు ఎక్కువగా అవసరమయ్యే ఏ పనైనా చేయడానికి లేదా దేనినైనా కొనడానికి ముందు, ‘యెహోవాకు నేను చేసే సేవను ఇది మెరుగుపరుస్తుందా లేక ఆటంకపరుస్తుందా?’ అని ప్రశ్నించుకుంటూ ‘తగులుబడి లెక్క’ చూసుకోవాలి. (లూకా 14:28; ఫిలి. 1:9-11) అలాగే పరిచర్యలో మరింత ఎక్కువ సేవ చేయగలిగేలా మనం మరింత నిరాడంబరంగా జీవించే అవకాశముందా అని అప్పుడప్పుడు పరిశీలించుకోవడం మంచిది.—2 కొరిం. 13:5; ఎఫె. 5:10.
3. ఒక సహోదరి నిరాడంబరంగా జీవించడానికి చేసుకున్న సర్దుబాట్ల నుండి మనమేమి నేర్చుకుంటాం?
3 ఒక సహోదరికి పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసినా కూడా సరిపడేంత జీతం వస్తుంది, అయినా రోజంతా ఉద్యోగం చేస్తూనే క్రమ పయినీరు సేవ ప్రారంభించాలని ఆమె నిర్ణయించుకుంది. కానీ ఆమె, “ఎవరూ ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. నా అవసరాలు తీర్చుకోవడానికి నా కోరికలను త్యాగం చేయాల్సివచ్చింది. ఈ వస్తువులు కొంతకాలానికే పాతవైపోతాయి, వాటిపై మనకు మోజు కూడా తీరుపోతుంది, నేను కోరుకున్న వస్తువుల్ని సంపాదించుకునే ప్రయత్నంలో నాకు మిగిలేది అలసటే అని గ్రహించాను” అని చెప్పింది. పరిస్థితుల్లో వచ్చిన మార్పును బట్టి ఆమె నిరాడంబరంగా జీవించడానికి సర్దుబాట్లు చేసుకొని, వేరే ఉద్యోగం సంపాదించుకొని, పయినీరు సేవ కొనసాగించింది.
4. నేడు మనం కంటిని తేటగా ఉంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
4 ఇప్పటి కాలాన్ని బట్టి చూస్తే మనం మన కంటిని తేటగా ఉంచుకోవడం ఇంకెంతో ప్రాముఖ్యమని తెలుస్తుంది. గడుస్తున్న ప్రతీరోజు మనల్ని విధానాంతానికి, దేవుని రాజ్యానికి మరింత దగ్గర చేస్తుంది. (1 కొరిం. 7:29, 31) ప్రకటనా పనిపై దృష్టి పెడితే మనం రక్షించబడతాం, మన సందేశం వినేవారు కూడా రక్షించబడతారు.—1 తిమో. 4:16.