‘ఈ సువార్త ప్రకటించబడుతుంది’!
1. ప్రకటనా పనిని ఆపడం ఎవరి తరమూ కాదని మనకెలా తెలుసు?
1 తన చిత్తం నెరవేర్చకుండా యెహోవాను ఎవరూ అడ్డుకోలేరు. (యెష. 14:24) న్యాయాధిపతియైన గిద్యోనుకు ఆయనతోవున్న 300 మంది పురుషులకు 1,35,000 మిద్యానీయుల సైన్యాన్ని ఓడించడం అసాధ్యమైనదిగా కనిపించినా యెహోవా ఆయనతో, “మిద్యానీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే” అని చెప్పాడు. (న్యాయా. 6:14) నేడు యెహోవా ఏ పనికి మద్దతు ఇస్తున్నాడు? యేసు ఇలా చెప్పాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును.” (మత్త. 24:14) ఈ పని నెరవేరకుండా ఆపడం ఎవరి తరమూ కాదు!
2. పరిచర్యలో యెహోవా వ్యక్తిగతంగా మనలో ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తాడని ఎందుకు నమ్మవచ్చు?
2 యెహోవా వ్యక్తిగతంగా మనలో ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తాడు: ఒక సమూహంగా యెహోవా తన సాక్షులకు విజయం అనుగ్రహిస్తాడని మనం నమ్ముతాం, అయితే ఆయన వ్యక్తిగతంగా మనలో ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తాడని నమ్మవచ్చా? అవసరమున్న సమయంలో యెహోవా తన కుమారుడైన యేసు ద్వారా తనకు సహాయం చేసినట్లు అపొస్తలుడైన పౌలుకు అనిపించింది. (2 తిమో. 4:17) అలాగే తన చిత్తం నెరవేర్చేందుకు మనం వ్యక్తిగతంగా చేసే ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదిస్తాడని నమ్మవచ్చు.—1 యోహా. 5:14.
3. ఏయే పరిస్థితుల్లో యెహోవా మనకు సహాయం చేస్తాడు?
3 దైనందిన జీవితంలో చింతలవల్ల, పరిచర్యకు వెళ్ళలేనంతగా మీరు నీరసపడిపోతున్నారా? “సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే.” (యెష. 40:29-31) మీరు హింసను గానీ, వ్యతిరేకతను గానీ ఎదుర్కొంటున్నారా? “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును.” (కీర్త. 55:22) కొన్నిసార్లు మాట్లాడడానికి మీకు భయమేస్తోందా? ‘వెళ్ళు, నేను నీ నోటికి తోడైయుంటాను’ అని ఆయన అంటున్నాడు. (నిర్గ. 4:11, 12) అనారోగ్యం వల్ల పరిచర్యలో మీరు చేయగలిగినంత చేయలేకపోతున్నారా? మీరు హృదయపూర్వకంగా చేసేది ఎంత కొంచెమైనా దానిని యెహోవా విలువైనదిగానే ఎంచుతాడు.—1 కొరిం. 3:6, 9.
4. యెహోవా పట్ల విశ్వాసముంటే, మనమేమి చేస్తాం?
4 చేయి ‘చాచినవాడు యెహోవాయే దాని త్రిప్పగలవాడెవడు?’ (యెష. 14:27) మన పరిచర్యపై యెహోవా ఆశీర్వాదం ఉంటుందనే విశ్వాసంతో, ‘ప్రభువును ఆనుకొని [“యెహోవా ఇచ్చిన అధికారంతో,” NW] ధైర్యంగా,’ నేర్పుతో ప్రకటనాపనిలో కొనసాగుదాం!—అపొ. 14:3.