అన్నిటికన్నా ప్రాముఖ్యమైన పని
1. పరిచర్యను మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఎలాంటి త్యాగాలు చేయడానికి ముందుకొస్తాం?
1 పరిచర్య కోసం సమయాన్ని, శక్తిని, వనరులను ఉపయోగించాలని మనమెందుకు మళ్లీ మళ్లీ ప్రోత్సహించబడుతున్నాం? ఎందుకంటే దానికన్నా ప్రాముఖ్యమైన పని మరొకటి లేదు! పరిచర్యవల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో ఆలోచిస్తే, భవిష్యత్తులో మళ్లీ ఎప్పుడూ జరిగే అవకాశంలేని ఈ పనిలో ఇంకా ఎక్కువగా పాల్గొనాలనుకుంటాం.—అపొ. 20:24.
2. యెహోవా గొప్ప నామాన్ని పరిశుద్ధపర్చడానికి మన ప్రకటనా పని ఎలా సహాయం చేస్తుంది?
2 యెహోవా నామాన్ని పరిశుద్ధపరుస్తుంది: క్రీస్తు యేసు రాజుగా పరిపాలించే యెహోవా రాజ్యం ఇప్పుడున్న మానవ ప్రభుత్వాలన్నిటినీ తీసివేసి, మన సమస్యలన్నిటినీ పరిష్కరిస్తుందనే సువార్తను మనం ముఖ్యంగా ప్రకటిస్తాం. (మత్త. 6:9, 10) యెహోవా మాత్రమే రోగాలను, మరణాన్ని తీసివేయగలడని చెప్తూ బైబిలు ఆయనను మహిమపరుస్తుంది. (యెష. 25:8; 33:24) మనం ఆయన పేరున్న ప్రజలం కాబట్టి, మన మంచి ప్రవర్తనను, మన ఆసక్తిని గమనించే ఇతరులు ఆయనను మహిమపర్చవచ్చు. (1 పేతు. 2:12) సర్వాధిపతియైన యెహోవా పేరును భూమి అంతటా తెలియజేయడం మనకెంతో సంతృప్తినిస్తుంది!—కీర్త. 83:18.
3. రాజ్య సందేశాన్ని విని, దానిప్రకారం నడుచుకునేవారు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతారు?
3 జీవితాలను కాపాడుతుంది: యెహోవా ‘ఎవరూ నశించాలని ఇష్టపడడు గానీ, అందరూ మారుమనస్సు పొందాలని కోరుకుంటున్నాడు.’ (2 పేతు. 3:9) యెహోవా దృష్టిలో ఏది సరైనదో, ఏది సరైనది కాదో బోధించనిదే ప్రజలకెలా తెలుస్తుంది? (యోనా 4:11; రోమా. 10:13-15) ప్రజలు సువార్త విని, చెడు అలవాట్లను మానుకున్నప్పుడు వారి జీవితాలు ఎంతో మెరుగుపడతాయి. (మీకా 4:1-4) అంతేకాదు, నిత్యజీవం పొందే సంతోషకరమైన నిరీక్షణ వాళ్లకు లభిస్తుంది. మనం సువార్తను చురుకుగా ప్రకటిస్తే మన ప్రాణాలతోపాటు మనం చెప్పేది వినేవారి ప్రాణాలుకూడా రక్షించబడతాయి. (1 తిమో. 4:16) అత్యంత ప్రాముఖ్యమైన ఈ పనిలో మనకెంతో ఉన్నతమైన బాధ్యత అప్పగించబడింది!
4. రాజ్య ప్రకటనా పనిని, శిష్యులను చేసే పనిని మనమెందుకు చురుకుగా చేయాలి?
4 త్వరలోనే మహాశ్రమలు ఈ అవినీతి లోకానికి అకస్మాత్తుగా అంతం తీసుకొస్తాయి. యెహోవాను ఆరాధించేవారు తప్పించుకుంటారు. కాబట్టి ప్రకటించే, శిష్యులను చేసే పని ఇప్పుడు జరుగుతున్న ఎంతో ప్రాముఖ్యమైన, ప్రయోజనకరమైన, అత్యవసరమైన పని. అందుకే మన జీవితాల్లో ఈ పనికి మొదటి స్థానమివ్వాలి!—మత్త. 6:33.