మీ బైబిలు విద్యార్థుల కోసం ‘ప్రాణం పెట్టండి’
1. బైబిలు విద్యార్థికి సహాయం చేయడానికి ఏమి చేయాలి?
1 సమర్పించుకునేలా బైబిలు విద్యార్థికి సహాయం చేయాలంటే ఆయనతో క్రమంగా బైబిలు అధ్యయనం చేయడంకన్నా ఎక్కువే చేయాలి. అపొస్తలుడైన పౌలు తన దగ్గర నేర్చుకున్నవారితో తనకున్న సంబంధాన్ని, కన్నతల్లికి ఆమె చంటిబిడ్డకు ఉండే అనుబంధంతో పోల్చాడు. మనం కూడా మన విద్యార్థులు ఆధ్యాత్మిక విషయాల్లో అభివృద్ధి సాధించేటట్లు వారికి సహాయం చేయడానికి వారికోసం ‘ప్రాణాలు పెట్టడానికి’ ఇష్టపడతాం.—1 థెస్స. 2:7-9.
2. ప్రతీ విద్యార్థి మీద ఎందుకు శ్రద్ధ చూపించాలి, ఎలా చూపించాలి?
2 ప్రతీ విద్యార్థి మీద శ్రద్ధ చూపించండి: బైబిలు విద్యార్థి తను నేర్చుకుంటున్నవాటిని ఆచరణలో పెట్టడం మొదలుపెట్టినప్పుడు, బైబిలు సూత్రాలకు తగ్గట్టు జీవించనివారితో స్నేహం కొనసాగించడానికి ఆయన మనస్సాక్షి ఒప్పుకోదు. (1 పేతు. 4:4) ఆయన కుటుంబం ఆయనను వేరుచేసి చూస్తుండవచ్చు. (మత్త. 10:34-36) అయితే మనకు వారి మీద శ్రద్ధవుందని చూపిస్తే తమకు ఎవరూ లేరనే బాధ నుండి వారు బయటపడవచ్చు. చాలాకాలం నుండి మిషనరీ సేవచేస్తున్న ఒక సహోదరుడు ఇలా అంటున్నాడు: “బైబిలు అధ్యయనం అయిపోయిన వెంటనే అక్కడ నుండి వచ్చేయకండి. వీలైతే కొంతసేపు ఉండి వాళ్లతో మాట్లాడండి.” మీ విద్యార్థి అవసరాలను గుర్తించి, చేయదగిన సహాయం చేయండి. ఉదాహరణకు, ఆయనకు ఒంట్లో బాగాలేనప్పుడు ఆయనకు ఫోన్ చేస్తే, లేదా ఆయనను కలిస్తే బావుంటుంది. సముచితమైతే, కూటాల్లో మీ బైబిలు విద్యార్థి పక్కన కూర్చొని వాళ్ల పిల్లలను చూసుకోవడం మంచిది.
3. మన విద్యార్థి సంఘ సభ్యుల నుండి ప్రోత్సాహం పొందేలా ఎలా చేయవచ్చు?
3 సంఘం ఎలా సహాయం చేయాలి? మన విద్యార్థి ఇంటి దగ్గర్లో మనం పరిచర్య చేస్తుంటే కొంత సమయం తీసుకుని, మనతో పని చేస్తున్న ప్రచారకులను వారికి పరిచయం చేయవచ్చు. పరిస్థితిని బట్టి, అప్పుడప్పుడు మనతోపాటు వేర్వేరు ప్రచారకులను, పెద్దలను బైబిలు అధ్యయనానికి తీసుకువెళ్లవచ్చు. అలాగే బైబిలు అధ్యయనం మొదలైన తర్వాత వీలైనంత త్వరగా, వారిని కూటాలకు రమ్మని పిలవాలి. ఎందుకంటే కూటాలకు వస్తే సంఘ సభ్యుల నుండి ప్రోత్సాహాన్ని పొందుతారు. భవిష్యత్తులో వారే అతని ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులవుతారు.—మార్కు 10:29, 30; హెబ్రీ. 10:24, 25.
4. మనం కష్టపడితే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?
4 దేవునితో మంచి సంబంధం ఏర్పర్చుకునేలా తమ పిల్లలకు సహాయం చేయడానికి అలుపులేకుండా శ్రమించే తల్లిదండ్రులు, తమ పిల్లలు యెహోవాను ఆరాధించాలనీ సత్యాన్ని అంగీకరించాలనీ నిర్ణయించుకున్నప్పుడు ఎంతో ఆనందిస్తారు. (3 యోహా. 4) మన బైబిలు విద్యార్థుల కోసం ప్రాణాలు పెట్టినప్పుడు మనం కూడా అలాంటి ఆనందాన్ని పొందవచ్చు.