మన పరిచర్య—దేవుని మీద మనకు ప్రేమ ఉందని చూపిస్తుంది
1 యేసు పరిచర్య చేయడానికి ప్రేమే ఆయనను కదిలించింది. పరిచర్యలో ఆయన చేసిన ప్రతీది, యెహోవామీద ఆయనకు ప్రేమ ఉందని చూపించింది. యేసు ఇలా అన్నాడు: “నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలిసికొనునట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనీలాగు చేయుచున్నాను.” (యోహా. 14:31) యేసును అనుసరించేవారిగా, పరిచర్య చేయడంద్వారా దేవునిమీద ఎంతో ప్రేమ ఉందని చూపించే మంచి అవకాశం మనకు కూడా ఉంది.—మత్త. 22:37; ఎఫె. 5:1, 2.
2 ‘నీ నామం పరిశుద్ధపరచబడును గాక’: మనకు దొరికిన ప్రతీ అవకాశాన్ని ఉత్సాహంగా ఉపయోగించుకుని యెహోవా గురించి, ఆయన రాజ్యం గురించి ఇతరులతో మాట్లాడినప్పుడు, మనకు దేవుని మీద ప్రేమ ఉందని చూపిస్తాం. అలా చేయడంద్వారా యెహోవా నామాన్ని పరిశుద్ధపర్చడానికి మనవంతు మనం చేస్తాం. (కీర్త. 83:18; యెహె. 36:23; మత్త. 6:9) యెహోవా నామం పరిశుద్ధపర్చబడాలనే, యెహోవా ఇష్టం ఈ భూమ్మీద నెరవేరాలనే కోరికతోనే యేసు పరిచర్య చేశాడు. ఆ కోరికతోనే మనమూ పరిచర్య చేస్తాం.—మత్త. 26:39.
3 ప్రేమ ఉంటే అడ్డంకులను అధిగమించగలుగుతాం: యెహోవా మీద మనకు ప్రేమ ఉంటే అడ్డంకులన్నిటినీ అధిగమిస్తాం. (1 కొరిం. 13:4, 7) యేసు పరిచర్యను ఆటంకపర్చగల పరిస్థితులెన్నో ఆయన జీవితంలో ఎదురయ్యాయి. అలాంటి ఆటంకాలు ఎదురైనప్పుడు, యెహోవా మీద ఆయనకున్న ప్రేమ, యెహోవాకు ఇష్టమైనవి చేయాలనే కోరిక వల్లే ఆయన వాటిని అధిగమించగలిగాడు. (మార్కు 3:21; 1 పేతు. 2:18-23) మనకూ ఎన్నో కష్టాలు ఎదురవుతాయి కానీ, మనకు దేవుని మీద ప్రేమ ఉంటే మనం కూడా వాటిని అధిగమించగలుగుతాం. మనం క్రీస్తును ఆదర్శంగా తీసుకుంటే, మనలో ఆత్మవిశ్వాసం పెరిగి, నిరాటంకంగా పరిచర్య చేయగలుగుతాం. కుటుంబ సభ్యులు వ్యతిరేకించడం, అనారోగ్యం, వృద్ధాప్యం, పరిచర్యలో వ్యతిరేకత లేదా ప్రజలు సరిగ్గా స్పందించకపోవడం వంటివి మనల్ని నిరుత్సాహపర్చవచ్చు. అయినా, వీలైనంత చక్కగా మన పరిచర్యను చేయడం ద్వారా యెహోవా మీద మనకున్న ప్రేమను చూపించకుండా అవి మనల్ని ఆపలేవు.
4 ప్రేమ ఎంతో శక్తివంతమైనది. పరిచర్య చేయడంద్వారా, దేవుని మీద మనకున్న హృదయపూర్వక ప్రేమను చూపించే సామర్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. (1 కొరిం. 13:13) యెహోవా నామం పూర్తిగా పరిశుద్ధపర్చబడే రోజు వేగంగా సమీస్తుండగా, ‘మన ప్రేమ అంతకంతకు అభివృద్ధి పొందును గాక.’—ఫిలి. 1:9; మత్త. 22:36-38.
[అధ్యయన ప్రశ్నలు]
1. యేసుకు దేవుని మీద ఉన్న ప్రేమ ఏమి చేయడానికి ఆయనను కదిలించింది?
2. యెహోవా మీద మనకు ప్రేమ ఉంటే పరిచర్య ఎలా చేస్తాం?
3. యెహోవా మీద మనకు ప్రేమ ఉంటే అడ్డంకులను ఎలా అధిగమిస్తాం?
4. యెహోవా మీద ఉన్న ప్రేమను చూపించే ఏ సదవకాశం మనకుంది?