ప్రకటనాపని మనల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది
1. ప్రకటనాపని చేయడం వల్ల మనమెలాంటి ప్రయోజనాలు పొందుతాం?
1 ప్రకటనాపని చేస్తూవుంటే మనం ఆధ్యాత్మికంగా బలపడడమే కాక ఎంతో ఆనందంగా ఉంటాం. ముఖ్యంగా మనం యెహోవాను సంతోషపెట్టడానికే ప్రకటనాపనిలో పాల్గొంటామనేది నిజమే. అయితే “వాక్యమును ప్రకటించుము” అనే ఆజ్ఞకు లోబడడం వల్ల మనం యెహోవా ఆశీర్వాదాలనేకాదు ఇతర ప్రయోజనాలను కూడా పొందుతాం. (2 తిమో. 4:2; యెష. 48:17, 18) మరి ప్రకటనాపని చేయడం వల్ల మనమెలా బలపడతాం, ఎలా ఆనందంగా ఉంటాం?
2. పరిచర్య చేయడం వల్ల మనమెలా బలపడతాం?
2 మనం ఎలా బలపడతాం, ఎలా ఆశీర్వదించబడతాం? ప్రకటనా పని చేస్తూవుంటే ఇప్పుడు మనకున్న కష్టాల గురించి కాక రాజ్య ఆశీర్వాదాల గురించి ఎక్కువగా ఆలోచించేందుకు ప్రయత్నిస్తాం. (2 కొరిం. 4:18) బైబిలు బోధల గురించి ఇతరులకు వివరించినప్పుడు, యెహోవా వాగ్దానాల్లో మనకున్న విశ్వాసం బలపడి, సత్యం పట్ల కృతజ్ఞత ఎక్కువవుతుంది. (యెష. 65:13, 14) “లోకసంబంధులు” కాకుండా ఉండేలా ఆధ్యాత్మికంగా బలపడడానికి ఇతరులకు మనం సహాయం చేస్తుండగా, లోకానికి వేరుగా ఉండాలన్న మన నిర్ణయం బలపడుతుంది.—యోహా. 17:14, 16; రోమా. 12:2.
3. క్రైస్తవ లక్షణాలను అలవర్చుకునేందుకు పరిచర్య ఎలా సహాయపడుతుంది?
3 పరిచర్యలో పాల్గొంటే క్రైస్తవ లక్షణాలు అలవర్చుకోగలుగుతాం. ఉదాహరణకు, “అందరికి అన్నివిధముల” వాళ్ళమై ఉండడానికి ప్రయత్నిస్తే మరింత వినయంగా ఉండగలుగుతాం. (1 కొరిం. 9:19-23) “కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్న” ప్రజలతో మాట్లాడుతుండగా, మనం సానుభూతి చూపించడాన్ని, ఇతరుల బాధను మన బాధగా చూడడాన్ని నేర్చుకుంటాం. (మత్త. 9:36) ఉదాసీనత, వ్యతిరేకత ఉన్నప్పటికీ పట్టుదలతో పరిచర్యలో పాల్గొంటే మనం సహనాన్ని నేర్చుకుంటాం. మన జీవితాలను ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగిస్తే ఎంతో ఆనందాన్ని పొందుతాం.—అపొ. 20:35.
4. పరిచర్య గురించి మీరెలా భావిస్తున్నారు?
4 మన ఆరాధనకు పాత్రుడైన ఏకైక వ్యక్తిని మనం పరిచర్య ద్వారా స్తుతించగలగడం ఎంతటి ఆశీర్వాదమో కదా! పరిచర్య మనల్ని బలపరుస్తుంది. అంతేకాదు, ‘సువార్త గురించి సాక్ష్యమివ్వడంలో’ భాగం వహిస్తున్న వారందరికీ ఎన్నో ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి.—అపొ. 20:24.