బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని మరింతగా ఉపయోగించండి
1 ‘శిష్యుల్ని చేయడానికి’ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రచారకార్యక్రమాన్ని నిర్దేశించే “సర్వాధికారము” యేసుక్రీస్తుకు ఇవ్వబడింది. (మత్త. 28:18, 19) ఆయన పరలోకానికి ఆరోహణమవడానికి కొంచెం ముందు తన శిష్యులకు ఈ అత్యవసర బాధ్యతను అప్పగించాడు. దైవికంగా ఇవ్వబడిన ఈ బాధ్యతను నెరవేర్చడానికి మనం మరింతగా కృషి చేయడం ఇప్పుడు ఇంకా అత్యవసరం.—యోహా. 4:35.
2 స్పష్టంగా సరళమైన భాషలో రాయబడిన 19 అధ్యాయాలు, వివరణాత్మక అనుబంధం ఉన్న బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకం పరిచర్యకు ఎంతో ఉపకరిస్తోంది. ఈ పుస్తకం, “గృహస్థులను తక్షణమే సంభాషణలోకి దించగల ప్రత్యేక ఆకర్షణగా” ఉందని ఒక ప్రాంతీయ పైవిచారణకర్త చెప్పాడు. ఆ పుస్తకాన్ని ఉపయోగించడం చాలా సులభమని చెబుతూ ఆయన, “అది చాలామంది రాజ్యప్రచారకుల్లో పరిచర్యపట్ల నమ్మకాన్ని, ఆనందాన్ని తిరిగి నింపింది” అని అన్నాడు.
3 బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ప్రభావవంతంగా ఉపయోగించడం: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకాన్ని అందించడానికి సరళమైన విధానం, (1) గృహస్థులు వింటారో వినరో తెలుసుకునేందుకు అభిప్రాయాన్ని రాబట్టే ప్రశ్న అడిగి, (2) వినడానికి సుముఖత చూపిస్తే సముచితమైన లేఖనాన్ని చదివి, (3) ఆ విషయాన్ని చర్చించే అధ్యాయంలోని శీర్షిక క్రింద ఉన్న ఉపోద్ఘాత ప్రశ్నలను చదవడం ద్వారా ఆ అధ్యాయం వైపు దృష్టిని మళ్ళించడం. గృహస్థులు ఆసక్తి చూపించినట్లయితే, మీరు ఆ అధ్యాయ ప్రారంభంలో ఉన్న పేరాలను ఉపయోగిస్తూ బైబిలు అధ్యయనాన్ని ప్రదర్శించవచ్చు. ఈ పద్ధతిని, మొదటి సందర్శనంలో లేక పునర్దర్శనం చేస్తున్నప్పుడు అధ్యయనం ప్రారంభించడానికి ఉపయోగించవచ్చు.
4 ప్రచారకులు ఆసక్తిగల వారికి బైబిలు బోధిస్తోంది అనే పుస్తకాన్ని ఇచ్చిన తర్వాత, యేసు ఆజ్ఞాపించిన ‘వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించడానికి’ వారి దగ్గరకు తిరిగి వెళ్ళడం ఎంతో అవసరం. (మత్త. 28:20) ప్రకటించడానికి, బోధించడానికి తేడా ఉంది, ఒక బోధకుడు కేవలం ప్రకటించడం కంటే ఎక్కువే చేస్తాడు; అతడు ఉపదేశిస్తాడు, వివరిస్తాడు, రుజువులు చూపిస్తాడు.
5 బైబిలు అధ్యయనానికి బాగా సిద్ధపడండి: ఈ పుస్తకాన్ని ఉపయోగిస్తూ సమర్థవంతమైన బోధకులుగా ఉండాలంటే, (1) అధ్యయనం కోసం ముందుగానే సిద్ధపడండి. ‘ఈ వ్యక్తికి యెహోవాతో ఉన్న సంబంధం పటిష్ఠమవ్వాలంటే ఏ యే అంశాలను ఆయన అన్వయించుకోవాలి’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. (2) అధ్యయనం చేసేటప్పుడు లేఖనాలకు ప్రాధాన్యత ఇవ్వండి. మన నమ్మకాలకున్న లేఖన ఆధారాన్ని సమర్థించే బైబిలు వచనాల్లో నుండి కీలకమైన పదాలను గుర్తించడానికి విద్యార్థికి సహాయం చేయండి. (హెబ్రీ. 4:12) (3) ఉపోద్ఘాత ప్రశ్నలను, అనుబంధాన్ని, పునఃసమీక్ష బాక్సును ఉపయోగించండి. (4) ముఖ్యాంశాలపై అవధానం నిలుపుతూ అధ్యయనం సరళంగా సాగేటట్టు చూడండి. మీరే ఎక్కువగా మాట్లాడకండి, అనవసరంగా అదనపు సమాచారాన్ని ఉపయోగించకండి.—యోహా. 16:12.
6 ఆ బాధ్యతను అప్పగిస్తూ చివరిగా, “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను” అని చెప్పిన యేసు మాటలు మనల్ని బలపరుస్తాయి. (మత్త. 28:20) ‘పరలోకంలో, భూమిమీద సర్వాధికారము’ ఉన్న మన నాయకుడైన యేసు మనకు మద్దతు ఇవ్వడానికి మనతో ఉన్నాడు. శిష్యులను చేయమని మనకివ్వబడిన దైవ ప్రేరిత బాధ్యతను నెరవేర్చడానికి కృషిచేస్తూ బైబిలు బోధిస్తోంది అనే పుస్తకాన్ని ఎంతో ఆసక్తితో మరింత ఎక్కువగా ఉపయోగిద్దాం.
[Study Questions]
1. యేసు తన శిష్యులకు ఏ బాధ్యత అప్పగించాడు?
2. బైబిలు బోధిస్తోంది పుస్తకం శక్తివంతమైన ఉపకరణమని మనం ఎందుకు చెబుతాము?
3. ఈ పుస్తకాన్ని మనం ప్రభావవంతంగా ఎలా అందించవచ్చు?
4. ప్రకటించడానికి, బోధించడానికి మధ్యవున్న తేడా ఏమిటి?
5. బైబిలు అధ్యయనానికి మనం మరింత ప్రభావవంతంగా ఎలా సిద్ధపడవచ్చు?
6. యేసు మాటల్లో బలపర్చే ఏ తలంపులు ఉన్నాయి?