జ్ఞాపకార్థ ఆచరణ గురించి ప్రకటించడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమం!
1 యెహోవా దేవుడు మానవజాతిపట్ల ప్రేమతో చేసిన అత్యంత గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగావున్న ఆయన ఆరాధకులు 2009 ఏప్రిల్ 9, గురువారంనాడు సమకూడతారు. (రోమా. 5:6-8) మనం యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా, ఈ కార్యక్రమానికి లక్షలాదిమంది ఆసక్తిగలవారు వస్తారని ఆశిస్తున్నాం. జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించిన ప్రత్యేక ఆహ్వానప్రతి మార్చి 21 నుండి భూవ్యాప్తంగా పంచిపెట్టబడుతుంది.
2 మనసులో ఉంచుకోవాల్సిన విషయాలు: వ్యతిరేకత ఎదురైన క్షేత్రాల్లో చాలా అప్రమత్తంగా ఉండి, వివేచనతో వ్యవహరించండి. ఆహ్వానప్రతిని విచక్షణారహితంగా పంచిపెట్టేబదులు సత్యం తెలుసుకోవాలని నిజంగా కోరుకుంటున్న గృహస్థులకు ఇవ్వండి. ఈ ఆహ్వానప్రతిపైవున్న చిత్రాలను, ప్రశ్నలను, ఉల్లేఖించబడిన లేఖనాన్ని చూపించండి. ఉదాహరణకు, ముందుభాగంలోవున్న చిత్రాన్ని చూపించి ఇలా చెప్పవచ్చు: “యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి 2009 ఏప్రిల్ 9 గురువారంనాడు జరిగే ఆచరణకు మీరు తప్పకుండా రావాలని కోరుతున్నాను.” ఆ తర్వాత ఆహ్వానప్రతి శీర్షికను, దాని క్రిందవున్న ప్రశ్నలను చూపించండి. గృహస్థుడు తన కుటుంబీకులను లేదా మరెవరినైనా ఆ కూటానికి తీసుకురావచ్చని ఆయనకు చెప్పడం మర్చిపోకండి.
3 వారాంతాల్లో ఆహ్వానప్రతులతో పాటు పత్రికలను కూడా అందజేయండి. మీరు పునర్దర్శనం చేస్తున్నవారిని, మీ బైబిలు విద్యార్థులను, బంధువులను, తోటి విద్యార్థులను, సహోద్యోగులను, పొరుగువారిని, ఇతర పరిచయస్థులను ఆహ్వానించాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి. గత సంవత్సరం ఒక సహోదరి తన బంధువుల్లో 30 మందిని ఆహ్వానించి, ఈ సందర్భం ఎంత ప్రాముఖ్యమైనదో వారికి అప్పుడప్పుడూ గుర్తుచేసింది. ఇరవై ఐదుమంది హాజరై, వారిలో నలుగురు ఆ తర్వాత బైబిలు అధ్యయనం చేయడానికి అంగీకరించినప్పుడు ఆమె ఎంత సంతోషించిందో!
4 ఇప్పుడే ప్రణాళిక వేసుకోండి: మార్చి, ఏప్రిల్ నెలల్లో చాలామంది ప్రచారకులు పరిచర్యలో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉండవచ్చు. మీ పిల్లలుగానీ, బైబిలు విద్యార్థులుగానీ మంచి ప్రగతి సాధిస్తుంటే వాళ్ళు బాప్తిస్మం తీసుకోని ప్రచారకులయ్యేందుకు ఇది మంచి అవకాశం. యెహోవా, యేసుక్రీస్తు చూపించిన గొప్ప ప్రేమను జ్ఞాపకం చేసుకోవడం గురించి ప్రకటించే ఈ ప్రచార కార్యక్రమంలో పూర్తిగా భాగం వహించడానికి ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టవలసిన సమయం ఇదే!—యోహా. 3:16; 15:13.
[Study Questions]
1. ప్రపంచవ్యాప్తంగావున్న రాజ్య ప్రచారకులు 2009, మార్చి 21 నుండి ఏమి చేస్తారు, ఎందుకు?
2. ఎవరికైనా ఆహ్వానప్రతిని ఇస్తున్నప్పుడు మీరు ఏ విషయాలు మనసులో ఉంచుకోవాలి?
3. ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో ఎవరినైనా ఆహ్వానించిన తర్వాత మీరు ఇంకా ఏమి చేయవచ్చు?
4. ఇప్పటినుండే మనం ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి, ఎందుకు?