అపార్ట్మెంట్లలో ప్రకటిస్తూ సమగ్రంగా సాక్ష్యమివ్వండి
1. సమగ్రంగా సాక్ష్యమివ్వాలంటే ఏమి చేయాలి?
1 అపొస్తలుడైన పౌలులాగే మనం కూడా “సమగ్రంగా సాక్ష్యమివ్వాలని” కోరుకుంటాం. (అపొ. 20:24, NW) అందుకే, మన క్షేత్రంలో వీలైనంత ఎక్కువమందికి రాజ్యసందేశం ప్రకటించడానికి కృషిచేస్తాం. దానిలో భాగంగా, అపార్ట్మెంట్లలో నివసించే చాలామందిని కూడా కలుస్తాం. కొన్నిసార్లు, అపార్ట్మెంట్లలోకి వెళ్లి ప్రకటించడం అంత సులభం కాకపోవచ్చు. అయినా, వాటిలో చాలామంది ఉంటారు కాబట్టి, సువార్త ప్రకటించేందుకు మనకు ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి.
2. అపార్ట్మెంట్లలో సాక్ష్యమిస్తున్నప్పుడు ఎందుకు వివేచనతో నడుచుకోవాలి?
2 పెరుగుతున్న నేరాలు, దౌర్జన్యం కారణంగా చాలావరకు అపార్ట్మెంట్లలో గేట్లకు తాళాలు వేస్తున్నారు, వాచ్మెన్లనూ సీ.సీ. కెమెరాలనూ పెడుతున్నారు. (2 తిమో. 3:1, 2) కొన్ని అపార్ట్‌మెంట్లలోనైతే, అనుమతి లేకుండా ఇతరులు లోపలికి వెళ్లకూడదు. కొన్నిసార్లు, వాచ్మెన్ తనంతట తానుగా లేదా అపార్ట్మెంట్లో ఉండేవాళ్లు చెప్పినందువల్ల, మనల్ని అక్కడినుండి వెళ్లిపొమ్మని అనవచ్చు. కాబట్టి, ఎంతో వివేచనతో నడుచుకోవడం ప్రాముఖ్యం.
3. అపార్ట్మెంట్లలో ఎప్పుడు ప్రకటిస్తే మంచిది? ఎందుకు?
3 ఎప్పుడు ప్రకటించాలి? ఇంటింటి పరిచర్యలో లాగే, అపార్ట్మెంట్లలో కూడా ప్రజలు ఇళ్లలో ఉన్నప్పుడే ప్రకటించడం మంచిది. చాలామంది ఇంటిదగ్గర ఉండని సమయంలో వెళ్తే చూసేవారికి అనుమానం రావచ్చు. మామూలుగా సాయంకాలం పూట, అలాగే వారాంతాల్లో ప్రజలు ఇంటిపట్టునే ఉంటారని చాలామంది ప్రచారకులు గమనించారు. మనం మరీ ఉదయాన్నే ప్రకటించడానికి వెళ్తే వాళ్లకు ఇబ్బందిగా ఉండవచ్చు.
4, 5. గేటుకు తాళం వేసివున్న అపార్ట్మెంట్లలో ఎలా మాట్లాడవచ్చు?
4 లోపలికి వెళ్లడం: మీరు పరిచర్య చేయడానికి ముందు అపార్ట్మెంట్ యజమానిని గానీ వాచ్‌మెన్‌ని గానీ కలవకండి. ఒకవేళ అపార్ట్మెంట్ గేటుకు తాళం వేసివుంటే, లోపలవున్న వాళ్లలో ఎవరితోనైనా మాట్లాడేందుకు వీలౌతుందేమో తెలుసుకోవడానికి వాచ్మెన్ దగ్గరున్న ఫోన్ ఉపయోగించవచ్చు. ఎవరైనా అనుమతిస్తే, అపార్ట్మెంట్ పరిస్థితినిబట్టి వాళ్ల పొరుగువాళ్లతో కూడా మాట్లాడవచ్చు. కానీ కొన్నిసార్లు, అలా వేరేవాళ్లతో మాట్లాడే ముందు బయటికి వచ్చి మళ్లీ ఫోన్ చేయడం మంచిది. అలా ఒక్కో సందర్భంలో ఎంతమందితో మాట్లాడాలో జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయించుకోవాలి.
5 కొంతమంది మనం ఫోన్ చేసినప్పుడే, తమను ఎందుకు కలవాలని అనుకుంటున్నామో కూడా చెప్పమంటారు. అలాంటి సందర్భాల్లో మిమ్మల్ని మీరు స్నేహపూర్వకంగా పరిచయం చేసుకోండి. ఒకవేళ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ల పేర్ల లిస్ట్ ఫోన్ పక్కనే ఉంటే, పేరుతో సంబోధిస్తూ మాట్లాడండి. మీరు దేనిగురించి మాట్లాడాలని అనుకుంటున్నారో ఒక్కముక్కలో చెప్పండి.
6. వాచ్మెన్ ఉన్న అపార్ట్మెంట్లలో ఏమి చేయవచ్చు?
6 ఒకవేళ వాచ్మెన్ మనల్ని అపార్ట్మెంట్లోకి రానివ్వకపోతే, ముందు ఆయనకే సాక్ష్యమివ్వడానికి చూడండి. చాలామంది వాచ్మెన్లు, మన సాహిత్యం చదవడానికి ఇష్టపడతారు. వీలైతే, మనం వాచ్‌మెన్‌తో బైబిల్ అధ్యయనం కూడా ప్రారంభించవచ్చు. మన సందేశం పట్ల ఆసక్తి చూపించిన ఒక కుటుంబాన్ని మాత్రమే కలిసేందుకు వాచ్మెన్ అనుమతిస్తే, అదే అదునుగా తీసుకొని అక్కడున్న వాళ్లందరితో మాట్లాడకండి.
7. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్‌ను గానీ సెక్రెటరీని గానీ కలిసినప్పుడు ఏమి చెప్పవచ్చు?
7 కొన్నిసార్లు, అపార్ట్మెంట్లో ప్రకటించడానికి యాజమాన్యం అనుమతి తీసుకోమని వాచ్మెన్ చెబుతాడు. అలాంటప్పుడు మీరు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్‌ను గానీ సెక్రెటరీని గానీ కలిసి ఇలా అనవచ్చు: “నా పేరు ____________________________. మేము యెహోవాసాక్షులం. కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అంటే, కుటుంబ సంతోషం, పిల్లల్ని బాధ్యతగల వారిగా తీర్చిదిద్దడం, జీవిత సమస్యలను తాళుకోవడం, భవిష్యత్తు గురించి సానుకూలంగా ఆలోచించడం వంటి విషయాల గురించి చక్కని సమాచారాన్ని మేము పంచుకుంటున్నాం. [వాటికి సంబంధించిన పత్రికలు గానీ పుస్తకాలు గానీ చూపించండి.] మీరు ఒప్పుకుంటే, అపార్ట్మెంట్లో ఉన్నవాళ్లతో కాసేపు మాట్లాడి, వాళ్లకు ఆసక్తి ఉంటే కొన్ని పత్రికలను ఉచితంగా ఇస్తాం. ఒకవేళ ఎవరైనా బిజీగా ఉంటే లేదా మాట్లాడడానికి ఇష్టపడకపోతే వాళ్లను బలవంతం చేయం.” ముగింపులో ఇలా కూడా అనవచ్చు: “ఇంటివాళ్లను కలసి ఈ సమాచారం పంచుకోవడానికి మీరు అనుమతిస్తే చాలా సంతోషిస్తాం. వాళ్లకు ఆసక్తివుంటే ఈ పత్రికల్ని ఉచితంగా ఇస్తాం.”
8. మన పరిచర్య బ్యాగు ఎలా ఉండాలి?
8 పరిచర్య బ్యాగు, మర్యాదలు: మనం పెద్దపెద్ద బ్యాగులు తీసుకెళ్తే, ఇట్టే ఇతరుల కళ్లల్లో పడతాం. కాబట్టి, చిన్నచిన్న బ్యాగులను తీసుకెళ్లడం లేదా అసలు తీసుకెళ్లకపోవడం మంచిది. కొంతమంది ప్రచారకులు పత్రికలను ఒక ఫైల్లో పెట్టుకొని, బైబిలును జేబులో పెట్టుకుంటారు.
9. మనం ఎలాంటి మర్యాదలు పాటించాలి? అది ఎందుకు ముఖ్యం?
9 అపార్ట్మెంట్లోకి వెళ్తున్నప్పుడు మీ చెప్పులు దులుపుకోండి, గేటును సరిగ్గా మూయండి. అలాంటి మర్యాదలు పాటిస్తే ఇంటివాళ్లు ఇబ్బంది పడకుండా ఉంటారు. అపార్ట్మెంట్లోకి వెళ్లాక అటూఇటూ దిక్కులు చూడకుండా, నేరుగా లిఫ్ట్ దగ్గరికి గానీ మీరు పరిచర్య చేయాలనుకుంటున్న ఫ్లోర్‌కి గానీ వెళ్లండి. అప్పుడు, చూసేవారికి అనుమానం రాదు.
10. అపార్ట్మెంట్లలో ప్రకటిస్తున్నప్పుడు వాళ్లకు అనవసర ఇబ్బంది కలగకుండా ఏమి చేయవచ్చు?
10 చాలా అపార్ట్మెంట్లలో, ఎవరైనా మాట్లాడితే అది ఆ ఫ్లోర్ అంతా వినబడుతుంది. కాబట్టి, అవసరానికి మించి గట్టిగా మాట్లాడకండి. మీతో వచ్చిన ప్రచారకులతో మాట్లాడుతున్నప్పుడు మెల్లగా మాట్లాడండి. అలాగని చూసేవాళ్లకు అనుమానం వచ్చేలా కాకుండా తగినంత స్వరంతో మాట్లాడుకోండి. ఒక ఫ్లోర్లో పరిచర్య చేస్తున్నప్పుడు, మీరు అటూఇటూ తిరగడం వల్ల అందులోవున్న వాళ్లకు అనవసరంగా ఇబ్బంది కలగకుండా చూసుకోండి. ఇంట్లోవున్న వాళ్లు బెదిరిపోయేలా తలుపు మరీ గట్టిగా తట్టకండి.
11. పీప్ హోల్ ఉన్న ఇళ్లలో ఎలా సాక్ష్యమివ్వవచ్చు?
11 కొన్ని ఇళ్లలో, తలుపుకు ఒక చిన్న రంధ్రం (పీప్ హోల్) ఉంటుంది. దానివల్ల, ఎవరైనా వస్తే ఇంటివాళ్లు లోపలి నుండే చూడగలుగుతారు. మీరు అలాంటి తలుపు ముందు నిలబడినప్పుడు దానివైపే చూడండి. అందులో నుండి ఎవరైనా మిమ్మల్ని చూస్తున్నట్లు అనిపిస్తే, వాళ్లను స్నేహపూర్వకంగా పలకరించి సాక్ష్యమివ్వడం మొదలుపెట్టండి. ఒకవేళ వాళ్లు, ‘ఎవరు మీరు?’ అని అడిగితే, మీ పేరూ మీతోపాటు ఉన్న ప్రచారకుని పేరూ చెప్పడం మంచిది. అప్పుడు, ఇంటివాళ్లు తలుపు తీయడానికి సంకోచించరు. ఒకవేళ వాళ్లు తలుపు తీయకపోయినా, మీరు అక్కడే ఉండి మాట్లాడవచ్చు.
12. తాళం వేసి ఉన్న ఇళ్లలో ప్రచురణలు పెడుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి?
12 ఇంటికి తాళం వేసివుంటే: మన సాహిత్యం కిందపడి, దారికి అడ్డంగా ఉంటోందని అపార్ట్మెంట్ నిర్వాహకులు ఎక్కువగా ఫిర్యాదు చేస్తుంటారు. సాహిత్యాన్ని గుమ్మం బయట పెడితే, గాలికి కొట్టుకొనిపోయి పేజీలు చెల్లాచెదురౌతాయి. కాబట్టి, ప్రచురణలను ఇతరులకు కనిపించకుండా కాస్త లోపలికి పెట్టాలి.
13. ఇంటివాళ్లు కోపంగా ఉంటే మనమేమి చేయాలి?
13 ఇంటివాళ్లు కోపంగా ఉంటే: మనం ప్రకటిస్తున్నప్పుడు ఇంటివాళ్లు కోపంతో మండిపడి వాచ్‌మెన్‌ని పిలవడానికి చూస్తుంటే, వెంటనే ఆ ఫ్లోర్ నుండి వెళ్లిపోవడం మంచిది. వీలైతే, ఇంకెప్పుడైనా ఆ ఫ్లోర్లో ప్రకటించవచ్చు. కొన్నిసార్లు యాజమాన్యంతో, వాచ్‌మెన్‌తో గొడవ జరగకముందే మొత్తం అపార్ట్‌మెంట్‌నే విడిచి వెళ్లిపోవడం తెలివైన పని. ఇంకోసారి తమ ఇంటికి రావద్దని వాళ్లు ప్రత్యేకంగా చెప్పకపోయినా, వేరేవాళ్లు వెళ్లి ఇబ్బంది పడకుండా ఆ ఫ్లాట్ నంబరును మీ టెరిటరీ కార్డ్‌లో మార్క్ చేసి పెట్టడం మంచిది. అయితే, వాళ్ల అభిప్రాయం ఏమైనా మారిందేమో తెలుసుకోవడానికి అప్పుడప్పుడు వాళ్లను తప్పకుండా కలవాలి.
14, 15. అపార్ట్మెంట్ నిర్వాహకుడు వెళ్లిపొమ్మంటే మనమేమి చేయాలి?
14 మనల్ని వెళ్లిపొమ్మంటే: ఒకవేళ అపార్ట్మెంట్లో సాక్ష్యమిస్తున్నప్పుడు, దాని నిర్వాహకుడు గానీ వాచ్మెన్ గానీ మనల్ని వెళ్లిపొమ్మంటే వెంటనే అక్కడనుండి వెళ్లిపోవడం మంచిది. సాధ్యమైనంతవరకు, వాళ్లు పోలీసులను పిలిచి కేసు పెడతాం అనే పరిస్థితి రాకముందే అక్కడినుండి వచ్చేయాలి. ఎక్కువ సందర్భాల్లో, యెహోవాసాక్షుల మీద కోపంతో కాదుగానీ తమ బాధ్యతా నిర్వహణలో భాగంగానే వాళ్లు మనల్ని వెళ్లిపొమ్మంటారు.
15 కొన్నిసార్లు అపార్ట్మెంట్ నిర్వాహకుడు మిమ్మల్ని వెళ్లిపొమ్మంటే, మీరెందుకు వచ్చారో దయగా, జ్ఞానయుక్తంగా ఆయనకు చెప్పండి. (1 పేతు. 3:15) ఎందుకంటే, అపార్ట్‌మెంట్‌ను సురక్షితంగా ఉంచడం, అందులోని వాళ్లు సంతోషంగా ఉండేలా చూసుకోవడం ఆయన బాధ్యతని మనం గుర్తిస్తాం. మనమెందుకు వచ్చామో చెబితే, అక్కడ సాక్ష్యమివ్వడానికి ఆయన మనల్ని అనుమతించవచ్చు. ఒకవేళ అనుమతించకపోతే, గొడవపడకుండా వచ్చేయండి. పరిస్థితులు అనుకూలిస్తే, అపార్ట్మెంట్ పోస్ట్‌బాక్స్‌లో అప్పుడప్పుడూ మన పత్రికలు వేయవచ్చేమో అడగండి. (కొలొ. 4:6) అలాంటి సంఘటనల గురించి సేవా పర్యవేక్షకునికి ఎప్పటికప్పుడు తెలియజేయాలి.
16. ఎంత ప్రయత్నించినా సాక్ష్యమివ్వడానికి వీలుకాని అపార్ట్మెంట్లలో ఎలా ప్రకటించవచ్చు?
16 కొంతకాలం తర్వాత, ప్రచారకులు యుక్తిగా ఆ అపార్ట్మెంట్లో పరిచర్య చేయడానికి ప్రయత్నించవచ్చు. సాక్ష్యమివ్వడానికి అనుమతించని అపార్ట్మెంట్లలో, వేరే మార్గాల్లో అంటే ఫోన్ చేసి లేదా ఉత్తరాలు రాసి ప్రకటించడానికి ప్రచారకులు కృషిచేయవచ్చు. అపార్ట్మెంట్లో ఉంటున్నవాళ్ల పేర్లు, టెలిఫోన్ నంబర్లున్న లిస్టు వాచ్మెన్ దగ్గర ఉంటుంది. ఉత్తరాలు రాసి సాక్ష్యమిస్తున్నప్పుడు, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి అనే పుస్తకంలోని 71-73 పేజీల్లో ఉన్న సలహాలు పాటించండి. కొంతమంది ప్రచారకులు, ఉదయం అందరూ పనికి వెళ్లే సమయంలో లేదా సాయంకాలం ఇంటికి తిరిగొచ్చే సమయంలో అపార్ట్మెంట్ ఎదురుగా గానీ, దాని చుట్టుపక్కల గానీ వీధి సాక్ష్యం ఇస్తారు.
17. అపార్ట్మెంట్లలో సాక్ష్యమివ్వడం ఎందుకు ప్రాముఖ్యం?
17 ఈ దుష్టలోకం త్వరలోనే అంతమౌతుంది. అప్పుడు, యెహోవా పేరున ప్రార్థించేవాళ్లు మాత్రమే రక్షణ పొందుతారు. అయితే, “వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు?” (రోమా. 10:13, 14) ‘నిత్యజీవం’ పొందడానికి తగిన హృదయ స్థితి ఉన్న చాలామంది ప్రజలు అపార్ట్మెంట్లలో ఉన్నారు. (అపొ. 13:48) మనం వివేచనతో పనిచేస్తే, వాళ్లకు సువార్త తెలియజేయవచ్చు.