వ్యతిరేకతను తాళుకోవడానికి కొత్తవారిని సిద్ధంచేయండి
1 ఎవరైనా బైబిలు అధ్యయనం మొదలుపెట్టి ‘సద్భక్తితో బ్రదుకనుద్దేశిస్తే,’ వారిని వ్యతిరేకించడానికి సాతాను తీవ్రంగా ప్రయత్నిస్తాడు. (2 తిమో. 3:12) తోటి పనివారి నుండి గానీ, తోటి విద్యార్థుల నుండి గానీ, పొరుగువారి నుండి గానీ వ్యతిరేకత రావచ్చు. ప్రత్యేకించి కొత్తవారికి, వారి మంచి కోరే బంధువులు వ్యతిరేకించినప్పుడు కష్టమనిపించవచ్చు.—మత్త. 10:21; మార్కు 3:21.
2 వ్యతిరేకత వస్తుందని ముందుగానే చెప్పబడింది: ఇతరులు తమను వ్యతిరేకిస్తారనీ, అలా వ్యతిరేకించడం తాము క్రీస్తుకు యథార్థమైన శిష్యులుగా తయారవుతున్నామనడానికి గుర్తనీ కొత్తవారు గ్రహించాలి. (యోహా. 15:20) ఇతరులు కొన్నిసార్లు యెహోవాసాక్షుల గురించి తమకున్న తప్పుడు అభిప్రాయాలను బట్టి వాళ్ళను వ్యతిరేకిస్తారు. యేసును అనుసరిస్తున్నందుకు, దేవునికి విధేయత చూపిస్తున్నందుకు అవమానాన్ని ఎదుర్కోవడం గొప్ప సంతోషాన్నిస్తుందని మనసులో ఉంచుకోండి. (అపొ. 5:27-29, 40, 41) యెహోవా ప్రేమపూర్వకంగా మద్దతునిస్తాడనే అభయాన్ని కొత్తవారికివ్వండి. (కీర్త. 27:10; మార్కు 10:29, 30) వాళ్ళు యథార్థంగా కొనసాగితే విశ్వ సర్వాధిపతి ఎవరనే వివాదాంశంలో యెహోవావైపు ఉంటారు.—సామె. 27:11.
3 ఖచ్చితమైన జ్ఞానం అవసరం: ఎన్ని కష్టాలొచ్చినా ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో కొనసాగడం ఎందుకు ప్రాముఖ్యమో మీ బైబిలు విద్యార్థులు గ్రహించేలా చేయండి. వాళ్ళు నేర్చుకుంటున్నది వాళ్ళ హృదయాల్లో నాటుకోకుండా అడ్డుకోవడానికి సాతాను వ్యతిరేకతను తీసుకువస్తాడు. (సామె. 4:23; లూకా 8:13) వాళ్ళు విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే దేవుని వాక్యంలోని ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటూనే ఉండాలి.—కీర్త. 1:2, 3; కొలొ. 2:6, 7.
4 సహనం అవసరం: ఎలాంటి కష్టాలొచ్చినా సహనం చూపించడం చాలా అవసరం, అలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. (లూకా 21:16-19) కొత్తవాళ్ళు వ్యతిరేకత వచ్చినా సహిస్తే వారికేకాక ఇతరులకూ ప్రయోజనం కలుగుతుంది. యథార్థంగా సహించేవారిని మెండుగా ఆశీర్వదించగల సామర్థ్యం యెహోవాకు ఉందని వాళ్ళు స్వయంగా చూస్తారు.—యాకో. 1:12.
5 థెస్సలొనీకలోని తన సహోదరులు క్రైస్తవులుగా ఎదుగుతుండడం చూసి అపొస్తలుడైన పౌలు ఎంతో సంతోషించాడు. ఆయన వాళ్ళ గురించి దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు, వాళ్ళల్లో ఎక్కువమంది సత్యం తెలుసుకోవడానికి ఆయనే సహాయం చేశాడు. (2 థెస్స. 1:3-5) వ్యతిరేకతను తాళుకొని సహనం చూపించేలా మన బైబిలు విద్యార్థులను సిద్ధం చేస్తే మనం కూడా అలాంటి సంతోషాన్ని, సంతృప్తిని పొందుతాం.