ఇతరులతో పంచుకోవడానికి మన దగ్గర విలువైన సంపదలున్నాయి
1 మనం గొప్ప సంపదలా చూసుకునే విలువైన బోధలు దేవుని వాక్యంలో చాలా ఉన్నాయి. (కీర్త. 12:6; 119:11, 14) ఒక సందర్భంలో యేసు, రాజ్యానికి సంబంధించిన వేరువేరు విషయాలను ఉపమానాలతో వివరించిన తర్వాత, “వీటినన్నిటిని మీరు గ్రహించితిరా?” అని తన శిష్యులను అడిగాడు. వాళ్ళు గ్రహించామని చెప్పినప్పుడు ఆయన వాళ్ళతో ఇలా అన్నాడు, “అందువలన పరలోకరాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలోనుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు.”—మత్త. 13:1-52.
2 మనం అధ్యయనం మొదలుపెట్టిన కొత్తలో నేర్చుకున్న బైబిలు సత్యాలను పాత ధననిధి అనుకోవచ్చు. మనం దేవుని వాక్యంలోని ప్రాముఖ్యమైన విషయాల గురించి వ్యక్తిగత అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు మనం ఇతర బైబిలు సత్యాలను తెలుసుకుంటాం, అవి మనకు కొత్తగా కనుగొన్న ధననిధుల్లాంటివి. (1 కొరిం. 2:7) మనం కొత్తగా కనుగొన్న ధననిధుల్లాంటి ఆ బోధలను “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” సహాయంతో అర్థంచేసుకుంటాం.—మత్త. 24:45.
3 మొదట్లో నేర్చుకున్న బోధలకూ, కొత్తగా నేర్చుకున్న వాటికీ మనమెంతో విలువిస్తాం. అలా విలువివ్వడం, మనం నేర్చుకున్న విలువైన సత్యాలను ఇతరులతో పంచుకోవడానికి కృషి చేసేలా మనల్ని ప్రోత్సహిస్తుంది. అప్పుడు, దేవుని వాక్యాన్ని బోధించేవారిగా తర్ఫీదు పొంది, అనుభవం సంపాదించుకుంటాం.
4 యేసు మాదిరిని చూసి నేర్చుకోండి: యేసు ఈ సంపదలకు ఎంత విలువిస్తున్నాడో చూపిస్తూ వాటిని ఇతరులతో పంచుకోవడానికి ఎంత కష్టపడడానికైనా వెనుకాడలేదు. చివరికి ఆయన అలసిపోయి ఉన్నప్పుడు కూడా తన “ధననిధిలో” నుండి సంపదలను బయటకు తీసుకురావడం ఆపలేదు.—యోహా. 4:6-14.
5 ఆధ్యాత్మికంగా మంచిస్థితిలో లేనివారిపట్ల యేసుకున్న ప్రేమ, జీవాన్నిచ్చే దేవుని సత్యాల సంపదలను వాళ్ళతో పంచుకునేలా ఆయనను ప్రోత్సహించింది. (కీర్త. 72:13) దేవుని గురించి, ఆయన సంకల్పాల గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నవారిని చూసి జాలిపడి, ‘వారికి అనేక సంగతులను బోధించడానికి’ కదిలించబడ్డాడు.—మార్కు 6:34.
6 యేసు చేసినట్లే చేయండి: మనం మన దగ్గరున్న సంపదలకు విలువిచ్చినప్పుడు, యేసులాగే మనం కూడా, ప్రజలకు నేరుగా బైబిలు నుండే ఆధ్యాత్మిక రత్నాలను చూపించాలనే ఉత్సాహంతో ఉంటాం. (సామె. 2:1-5) కొన్నిసార్లు మనం అలసిపోయినప్పటికీ లేఖనాల్లోని సత్యాల గురించి ఎంతో ఉత్సాహంగా మాట్లాడతాం. (మార్కు 6:31-34) మన దగ్గరున్న సంపదలకు ఎంతో విలువివ్వడం, పరిచర్యలో ఎల్లప్పుడూ పూర్తిగా పాలుపంచుకోవడానికి ప్రయత్నిస్తూ మనం చేయగలిగినదంతా చేయడానికి మనల్ని కదిలిస్తుంది.