‘మీరెలా ప్రత్యుత్తరమివ్వాలో తెలుసుకోండి’
అంత అనుకూలంగా లేని పరిస్థితుల్లో ప్రకటించడం నిజంగా ఒక సవాలేనని అపొస్తలుడైన పౌలుకు బాగా తెలుసు. దాదాపు సా.శ. 56లో ఆయన యెరూషలేములో ఎదుర్కొన్న పరిస్థితిని పరిశీలించండి. (అపొ. 21:27, 28, 30, 39, 40) అక్కడి ప్రజల్లోని దురభిమానాన్ని తొలగించడానికి, సువార్త పట్ల వారికున్న ప్రతికూలభావాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తన పదాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం చాలా అవసరమని ఆయన గ్రహించాడు. (అపొ. 22:1, 2) ఈ సందర్భంలో, పౌలు ఎంపిక చేసుకున్న పదాలవల్ల ప్రజలు చివరకు తమ మనోవైఖరినైతే మార్చుకోలేదు కానీ అవధానం నిలిపి ఆలకించారు. (అపొ. 22:22) ఆ అనుభవంతోనే పౌలు, బయటివారి పట్ల జ్ఞానంతో నడుచుకోమని, కృపాసహితంగా మాట్లాడమని, తమను సవాలు చేసేవారికి ‘ఎలా ప్రత్యుత్తరమివ్వాలో తెలుసుకోమని’ కొలస్సయిలోని సంఘాన్ని ప్రోత్సహించగలిగాడు. (కొలొ. 4:5, 6) మనం కూడా పరిచర్యలో ఉన్నప్పుడు అలాగే చేయాలి.
ప్రకటించే, బోధించే పనిని మనం శాంతియుతమైన పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా మనం చేస్తున్నది తప్పని నిందించే పరిస్థితులను మనం ఎదుర్కోవచ్చు. చట్టవిరుద్ధంగా ‘మతమార్పిడులు’ చేస్తున్నామనే అభియోగం కూడా మనపై మోపబడవచ్చు. ఈ పరిస్థితితో సరియైన విధంగా వ్యవహరించడానికి ముందుగానే ఆలోచించుకోవాలి. ఒక వ్యక్తికో లేదా గుంపుకో సమాధానం ఇస్తున్నప్పుడు, యెహోవా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించి మీకు తోడుగా ఉంటాడన్న హామీతో ప్రశాంతంగా ఉండండి. (మత్త. 10:19, 20) పదాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం ప్రాముఖ్యమని గుర్తుంచుకోండి. ఇతరులు అపార్థం చేసుకోగల లేదా వారిలో ప్రతికూల భావాలను కలిగించగల పదాలను ఉపయోగించకుండా జాగ్రత్తపడండి. ‘సువార్త ప్రకటించడానికి వచ్చాం’ వంటి పదాలను ఉపయోగించే బదులు దేవుని వాక్యంలోని మంచి విషయాలను ప్రజలందరికీ ‘తెలియజేయాలని వచ్చాం’ అనవచ్చు, మన ప్రచురణలను ఇతరులకు ఇస్తున్నప్పుడు ‘తప్పక చదవండి’ అని చెప్పేబదులు ‘మీకు ఇష్టమైతే దీనిని తీసుకొని చదవండి’ అనవచ్చు. క్రైస్తవులముగా మన బాధ్యతను నిర్వర్తించడానికి మనం సిగ్గుపడడంలేదు, అయితే యుక్తిగా ఆ పనిని నెరవేర్చవచ్చు.
ఎవరైనా, “మీరు మత ప్రచారం లేదా మతమార్పిడి చేయడానికే వచ్చారు” అని నిందిస్తే మీరేమి చెబుతారు? మీరిలా అనవచ్చు, “మతం మార్చుకోమని చెప్పడానికి మేము రాలేదు, మతం మార్చుకునేలా మిమ్మల్ని ప్రలోభపెట్టడానికి వచ్చామని మీరు అనుకోవద్దు.” కానీ, మీరూ వారిలాగే ఉద్యోగస్థులనో, గృహిణులనో, విద్యార్థులనో చెప్పవచ్చు. బహుశా మీరిలా అనవచ్చు, “మేము ఇక్కడికి దగ్గర్లోనే ఉంటున్నాం. ఓదార్పుని, నిరీక్షణనిచ్చే సమాచారాన్ని మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతోనే వచ్చాము. ఎవరైనా మేము చెప్పేది వినాలనుకుంటే వినవచ్చు వినకపోయినా ఫర్వాలేదు.” వీలైతే ఇలా కూడా చెప్పవచ్చు, “మేము పంచుకొనే సమాచారం రేడియోలో లేదా టీవీలో ఇవ్వబడే ప్రకటనలాంటిదే. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. అది వారి ఇష్టం. అయితే ఒకవేళ ఆ ప్రకటన జీవన్మరణానికి సంబంధించినదైతే అప్పుడేమిటి? మీరు దానిని వినాలనుకోరా? ప్రజలందరూ ఐక్యంగా కలిసి జీవించే శాంతియుతమైన ఒక కొత్త లోకం గురించి మేము మీతో పంచుకోవాలని వచ్చాము. ఒకవేళ మీకు వినడం ఇష్టంలేకపోతే నేను వెళ్ళిపోతాను.”
“మా విగ్రహాలను బయటపడేసి, మా దేవుళ్ళను ఆరాధించవద్దని చెబుతున్నారు” అనే నింద మీపై మోపబడవచ్చు. మొదటి శతాబ్దపు క్రైస్తవులపై కూడా అలాంటి నిందే మోపబడింది. (అపొ. 19:23-41) బహుశా మీరిలా చెప్పవచ్చు, “యెహోవాసాక్షులు ఇతరులను విమర్శించరు. ఫలానా విధంగా మాత్రమే ఆరాధించాలని చెప్పరు. అది ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయం, అది ఆ వ్యక్తికి, తన సృష్టికర్తకు మధ్య ఉండేది. కానీ ప్రజలందరికీ వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ప్రయోజనాన్ని చేకూర్చే దేవుని వాక్యంలోని కొన్ని అంశాలను మేము తెలియజేస్తున్నామంతే. వినమని మేము ఎవరినీ బలవంతపెట్టడంలేదు, మీకు ఇష్టం లేకపోతే మనం ఈ సంభాషణను ఇంతటితో ఆపేయవచ్చు.” అలా మనకివ్వబడిన బాధ్యతను నిర్వర్తించే విషయంలో రాజీపడకుండా, జాగ్రత్తగా ఎంపికచేసుకున్న పదాలతో ఉద్రిక్త పరిస్థితిని తగ్గించవచ్చు.
కొన్నిసార్లు ప్రజలు మనం చేసే పరిచర్యను అపార్థం చేసుకున్నా, మనకు వ్యతిరేకత ఎదురైనా, యెహోవా మనకు సహాయం చేస్తాడనే నమ్మకంతో మనం ఆనందంగా ఉండవచ్చు. (2 కొరిం. 2:15-17) మనకు ఎలాంటి వ్యతిరేకత ఎదురైనా మన ఆనందాన్ని పోగొట్టుకోకుండా ఉందాం. (నెహె. 8:10) మనం ఇతరులకు ఎలా ప్రత్యుత్తరమివ్వాలో ముందుగా ఆలోచిస్తుండగా, పరిచర్యలో శాంతంగా ఉండడం, కృపాసహితమైన పదాలను ఉపయోగించడం మన ముఖ్యోద్దేశంగా చేసుకుందుము గాక!