కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/08 పేజీ 6
  • పరిపాలక సభ నుండి ఉత్తరం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పరిపాలక సభ నుండి ఉత్తరం
  • మన రాజ్య పరిచర్య—2008
మన రాజ్య పరిచర్య—2008
km 3/08 పేజీ 6

పరిపాలక సభ నుండి ఉత్తరం

ప్రియమైన తోటి యెహోవాసాక్షులకు:

అపొస్తలుడైన పౌలు తోటి విశ్వాసులపట్ల తనకున్న ప్రేమను, కృతజ్ఞతను వ్యక్తంచేయడానికి ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. రోమాలోని క్రైస్తవులకు ఆయనిలా వ్రాశాడు: “మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటనుబట్టి, మొదట మీ యందరినిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.” (రోమా. 1:8) రోమా సామ్రాజ్యమంతటా మొదటి శతాబ్ద క్రైస్తవులు దృఢమైన విశ్వాసాన్ని చూపించేవారిగా, ఉత్సాహవంతంగా పరిచర్య చేసేవారిగా పేరుగాంచారు. (1 థెస్స. 1:8) అందుకే పౌలుకు తన సహోదరులపట్ల అంతటి ప్రగాఢమైన ప్రేమవుంది.

మేము మీ గురించి ఆలోచించిన ప్రతీసారీ పౌలులాగే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మాకు మీ పట్ల ఎంతో ప్రేమవుంది. యెహోవాకు కూడా మీలో ప్రతీ ఒక్కరిపట్ల ప్రేమవుంది. మీలో కొందరు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటూ కూడా ప్రకటనాపనిలో కొనసాగుతున్నారు. మీరు చూపించే ధైర్యసాహసాలు యెహోవా హృదయాన్ని ఎంతో సంతోషపరుస్తాయి.—సామె. 27:11.

ప్రభువైన యేసుక్రీస్తు “జయించుచు, జయించుటకు బయలు” వెళ్తుండడాన్ని గురించిన, క్రీస్తు అనుచరులకు వ్యతిరేకంగా రూపించబడిన ఎలాంటి ఆయుధమైనా వర్ధిల్లకపోవడాన్ని గురించిన ఎన్నో రుజువులు వార్షికపుస్తకము (ఆంగ్లం)లో ఉన్నాయి.—ప్రక. 6:2; యెష. 54:17.

ఫిలిప్పీలోని క్రైస్తవులకు పౌలు ఇలా వ్రాశాడు: “సువార్త విషయములో మీరు నాతో పాలివారై యుండుట చూచి . . . నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.” (ఫిలి. 1:3-6) పరిపాలక సభ సభ్యులైన మేము కూడా మీ విషయంలో పౌలులాగే భావిస్తున్నాం. 2007వ సేవా సంవత్సరంలో, ప్రపంచవ్యాప్తంగా 236 దేశాల్లో 66,91,790 మంది ప్రచారకులు 143,17,61,554 గంటలు సువార్త ప్రకటించారు. సువార్త వ్యాప్తిచేయడానికి మీరెంతో కృషిచేస్తున్నారు. మన సమిష్టి కృషి లక్షలాదిమంది జీవితాలను ప్రభావితం చేయడం గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇదంతా యెహోవా నామానికెంతో స్తుతిని తీసుకొస్తుంది.

మరో సందర్భంలో పౌలు తన సహోదరులపట్ల సహానుభూతిని కనబరిచాడు. ఆయన థెస్సలొనీకలో ఉన్నవారికి ఇలా వ్రాశాడు: “మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతోకూడిన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచున్నాము.” (1 థెస్స. 1:2, 3) జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదురౌతాయి. సమస్యలు తలెత్తుతాయి కానీ మనం వాటిని సహించడం ప్రాముఖ్యం. మీరు వ్యక్తిగతంగా ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నారు? అనారోగ్యం కారణంగా యెహోవా సేవను ఏ మాత్రం చేయలేకపోతున్నందుకు మీరు నిరుత్సాహపడుతున్నారా? మీతో జీవితం పంచుకున్న మీ ప్రియమైన భాగస్వామి మరణించారా? (సామె. 30:15, 16) ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకోవాలనే లేఖన సలహాకు కట్టుబడివుండాలన్న ఉద్దేశంతోవున్న మీకు, మీలాగే యెహోవాను ప్రేమించే వ్యక్తి దొరకడం లేదా? (1 కొరిం. 7:39) తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగా, మీ పిల్లలను పెంచడం మీకు కష్టంగా ఉంటోందా? మీ పరిస్థితి ఏదైనప్పటికీ మీరు రాజ్యానికి సంబంధించిన విషయాలను ముందుంచితే, “మీరు చేసిన కార్యమును, . . . తన నామమునుబట్టి చూపిన ప్రేమను” యెహోవా ‘మరచిపోడు.’ కాబట్టి సహోదర సహోదరీల్లారా, దయచేసి “మేలుచేయుట యందు విసుక” వద్దు!—హెబ్రీ. 6:10; గల. 6:9.

సహించడానికి మీకు ఏది సహాయం చేస్తుంది? “మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణ” థెస్సలొనీకయులకు సహాయపడినట్లే మనకూ సహాయపడుతుంది. నిరాశపర్చే ఆలోచనలు, తీరని సందేహాలతో కృంగిపోకుండా క్రైస్తవుణ్ణి కాపాడగల “రక్షణనిరీక్షణ[ను]” పౌలు సరైన కారణంతోనే ఆ తర్వాత దృఢమైన శిరస్త్రాణంతో పోల్చాడు.—1 థెస్స. 5:8.

మీరు ఆనందంగా సహిస్తే విశ్వ సర్వాధిపత్యపు గొప్ప వివాదాంశం విషయంలో సాతాను వేసిన నిందలకు జవాబిస్తారు. దేవుని సేవకులు సహజంగానే స్వార్థపరులనీ, వారు కొంతకాలంపాటు దేవుణ్ణి సేవించడానికి ఇష్టపడినా, శ్రమలు ఎక్కువైనప్పుడు లేదా వారనుకున్న దానికన్నా ఈ విధానం ఎక్కువకాలం కొనసాగినప్పుడు మాత్రం వారు తమ ఆరాధనలో వెనకబడతారనీ సాతాను ఆరోపిస్తున్నాడు. అపవాది ఎంతటి నీచమైన అబద్ధికుడో నిరూపించే విశిష్టమైన అవకాశం మీకుంది! రోజులు గడిచేకొద్దీ మీరు ఎదురుచూస్తున్న ఆశీర్వాదాలకు మీరు మరింత దగ్గరౌతున్నారు.

సహోదరుల దృఢమైన విశ్వాసాన్ని, ప్రకటనా పనిలో వారు చూపించిన ఉదారతను, వారి సహనాన్ని ప్రశంసించడానికి పౌలు తనకు లభించిన అవకాశాలను ఉపయోగించుకున్నట్లే, మేము కూడా మిమ్మల్ని ప్రశంసించడానికి, మీపై మాకున్న ప్రేమను తెలియజేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాము. మీ సత్కార్యాల్లో అలాగే ముందుకు సాగండి!

ఈ సంవత్సరమంతా దేవుని ఆశీర్వాదాలు మీతో ఉండును గాక. మీ శ్రేయస్సుకోరే

మీ సహోదరులు,

యెహోవాసాక్షుల పరిపాలక సభ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి