పరిచర్యలో ఉన్నప్పుడు వివేచనతో ప్రవర్తించడం
1 క్రీస్తుయేసు తన శిష్యులకు, పరిచర్యను కొనసాగించడానికి అవసరమైన జ్ఞానయుక్తమైన, ప్రయోజనకరమైన ఉపదేశాన్నిచ్చాడు. మారే పరిస్థితులనుబట్టి పరిచర్యలో వారు ఉపయోగించే పద్ధతుల్లో కూడా మార్పులు చేసుకోవాలని ఆయనకు తెలుసు. ఉదాహరణకు, మొదటిసారి తన 12 మంది శిష్యులను ప్రకటనా పనికి పంపిస్తున్నప్పుడు మత్తయి 10:9, 10 లో నివేదించబడిన సూచనలను ఇచ్చాడు. (లూకా 9:3) ఆ సమయంలో ఆయనిచ్చిన ఆ ఉపదేశం సముచితమైనదే. అయితే ఆ తర్వాత వారి ప్రకటనా పనికి సంబంధించిన పరిస్థితులు మారాయి. పరిచర్యలో ప్రజలు అంతకుముందులా సానుకూలంగా ప్రతిస్పందించలేదు, అందుకే లూకా 22:35-37లో నమోదు చేయబడినట్లుగా ఆయన తన ఉపదేశాన్ని మార్చి చెప్పడాన్ని మనం చూస్తాం. నేడు మనం కూడా పరిచర్య చేస్తున్నప్పుడు పరిస్థితులనుబట్టి మార్పులు చేసుకోవాలి.
2 దేవుని రాజ్య సువార్తను ప్రకటించి, యోగ్యులైనవారిని వెదకడమే మన లక్ష్యం. యెహోవా సేవకులు ఉత్సాహంతో చేసే కార్యకలాపాలపై ఆయన ఆశీర్వాదాలు ఉన్నాయనేది స్పష్టం. అలాగని అందరూ మన ఉద్దేశాలను సరిగా అర్థం చేసుకోరు లేదా శాంతి సందేశాన్ని వినడానికి ఇష్టపడరు. అపవాదియైన సాతానుకు సువార్త ప్రకటించబడడం ఇష్టం లేదు అందుకే వ్యతిరేకతను రేపుతాడని మనకు తెలుసు. (1 పేతు. 5:8; ప్రక. 12:12, 17) కాబట్టి మనం వివేచన కలిగివుంటూ, పరిస్థితులనుబట్టి జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి, ప్రాముఖ్యంగా ఇంటింటి ప్రకటనా పనిలో మనం వివేచనతో ప్రవర్తించాలి. (సామె. 3:21, 22) ప్రస్తుతం మీరు పనిచేస్తున్న ప్రాంతంలో వ్యతిరేకత లేకపోయినా, సమస్యలను నివారించడానికి అలా ప్రవర్తించడం జ్ఞానయుక్తం.—సామె. 22:3.
3 క్షేత్రసేవా కూటాలు: పుస్తక అధ్యయన ఏర్పాటును అనుసరిస్తే, క్షేత్రసేవకు వెళ్ళే గుంపులు చిన్నవిగా ఉంటాయి. అలాంటి చిన్న గుంపులు, మతోన్మాదం లేదా మతసంబంధంగా సమస్యలుండని ప్రాంతంలో లేదా అక్కడికి కొంచెం దూరంలో ఒక సహోదరి లేదా సహోదరుని ఇంటిలో కలుసుకోవచ్చు. అలా కలుసుకునేందుకు సరిపడేన్ని స్థలాలు లేకపోతే రాజ్యమందిరంలో సమావేశమవడం జ్ఞానయుక్తం, ఎందుకంటే మనం అక్కడికి వచ్చి, వెళ్తుంటామని అక్కడున్న ప్రజలకు తెలుసు. లేదా మనం క్షేత్రసేవ చేసే ప్రదేశానికి దగ్గర్లోవున్న సార్వజనిక ప్రదేశంలో అంటే ఏదైనా పార్క్, బస్టాండ్, రైల్వే స్టేషన్ వంటి స్థలాల్లో కలుసుకోవచ్చు. క్షేత్రసేవ చేసే ప్రదేశానికి వెళ్లకముందే సహోదరులకు అన్ని వివరాలు స్పష్టంగా చెబితే ఇద్దరిద్దరిగా వెళ్ళాల్సిన ప్రచారకులు జాగ్రత్తగా ఆ ప్రదేశానికి వెళ్ళి సేవచేయగలుగుతారు. క్షేత్రసేవ చేసే ప్రదేశంలో గుంపుగా కలుసుకోవడం, ఇతరులు మనల్ని గమనించే విధంగా గట్టిగా మాట్లాడడం లేదా అనవసరంగా ఇతరుల అవధానాన్ని చూరగొనేలాంటివేమైనా చేయడం సరైనది కాదు. మన వాహనాలను క్షేత్రసేవ చేసే ప్రదేశానికి కాస్త దూరంగా పెట్టవచ్చు, అలాచేస్తే అల్లరిమూకలు వాటిని పాడుచేసే అవకాశం ఉండదు.
4 మీ చుట్టుప్రక్కల జరుగుతున్నదాన్ని కనిపెట్టుకొనిఉండండి: ప్రచారకులపై తరచూ జరుగుతున్న అల్లరిమూకల దాడికి కారణం, మనం పరిచర్యలో ఉండగా కేవలం ఒక వ్యక్తి గమనించి గుంపును సమకూర్చడంతో ఆరంభమౌతున్నట్లు తెలుస్తోంది. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రకటిస్తున్నప్పుడు చుట్టుప్రక్కల జరిగేదాన్ని గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలి. ఒకరు గృహస్థునితో మాట్లాడుతున్నప్పుడు మరొకరు చుట్టుప్రక్కల ఏమి జరుగుతుందో గమనిస్తూవుండాలి, అయితే అలా గమనిస్తున్న ప్రచారకుడు, మన సందేశం వింటున్న గృహస్థుల అవధానానికి భంగం కలిగించకూడదు. (మత్త. 10:16) ఎవరైనా మిమ్మల్నే గమనిస్తూ, బహుశా మీ వైపు చూస్తూ మొబైల్ ఫోన్లో మాట్లాడుతుంటే, మీరు మాట్లాడడం అక్కడితో ముగించి, మెల్లగా ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి రావడం మంచిది. (సామె. 17:14) వేరే ఏ క్షేత్రంలో సేవ చేయవచ్చో ముందుగానే ఏర్పాటు చేసుకుంటే అక్కడికి వెళ్ళి పరిచర్యను కొనసాగించవచ్చు. ఇలా పని చేయడానికి పరిణతి, జ్ఞానము అవసరం కాబట్టి, కొత్త ప్రచారకులు ఎల్లప్పుడూ అనుభవజ్ఞులైన ప్రచారకులతో క్షేత్రసేవలో పాల్గొనడం మంచిది.
5 శుభ్రంగా ఉండాలి, కానీ ప్రత్యేకంగా కనిపించకూడదు: పరిచర్యకు వెళ్తున్నప్పుడు మనం వేసుకునే దుస్తుల విషయంలో కూడా వివేకవంతంగా ఉండాలి, అనవసరంగా ఇతరుల అవధానాన్ని ఆకర్షించకూడదు. మన వస్త్రధారణ, కనబడే తీరు ఎల్లప్పుడూ శుభ్రంగా, నిరాడంబరంగా ఉండాలి. మనం నివసిస్తున్న సమాజంలో ప్రజలు సాధారణంగా వేసుకునేలాంటి దుస్తులనే వేసుకోవడం లేఖనపరంగా తగినది. మనం ప్రత్యేకమైనవారిగా కనిపించాలని ప్రయత్నించం, అలా కనిపించడం వల్ల మన సందేశంపట్ల ప్రజలకు తప్పుడు అభిప్రాయమేర్పడే ప్రమాదముంది. ఉదాహరణకు, యేసు సాధారణ ప్రజలు వేసుకునేలాంటి దుస్తులే వేసుకునేవాడు కాబట్టి ఆయనెవరో చూపించడానికి యూదా ఆయనకు ముద్దుపెట్టాల్సివచ్చింది. యేసు వస్త్రధారణ భిన్నంగా ఉండేది కాదు. (మత్త. 26:48; మార్కు 14:44) కాబట్టి ఈ విషయం గురించి ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి. పై సూత్రాల, వ్యాఖ్యానాల ఆధారంగా మార్పులు చేసుకోవాలని ఎవరైనా నిర్ణయించుకుంటే, అలాంటి నిర్ణయాలను ఇతరులు గౌరవించాలి. పరిచర్యలో మనం ఏ విషయంలోనైనా ఇతరులకు అభ్యంతరం కలిగించకూడదు.—2 కొరిం. 6:3.
6 పరిచర్యలో ఉన్నప్పుడు వివేచనతో ప్రవర్తిస్తే, సమస్యలను తగ్గించుకోవచ్చు. మనం అపాయకరమైన అంత్యదినాల్లో జీవిస్తున్నప్పటికీ వివేచనతో ప్రవర్తిస్తే, యెహోవాను స్తుతించేలా, మహిమపర్చేలా ఆయన చిత్తం చేయడంలో కొనసాగగలుగుతాము.