ఎలా జవాబివ్వాలో తెలుసుకోండి
కొన్ని ప్రశ్నలు మంచుబండల్లాంటివి. ఒక మంచుబండలో ఎక్కువ భాగం నీటి అడుగున దాగి ఉంటుంది. అలాగే ప్రశ్నకన్నా, ప్రశ్న వెనుక దాగివున్న అసలు వివాదమే ఎక్కువ ప్రాముఖ్యమైనది.
ప్రశ్న వేసిన వ్యక్తి జవాబు కోసం ఆతురతతో చూస్తున్నప్పుడు కూడా, ఎలా జవాబివ్వాలో తెలిసి ఉండడంలో, ఎంత వరకు చెప్పాలి, విషయాన్ని ఏ కోణంలో చర్చించాలి అన్నవి వివేచించడం ఉండవచ్చు. (యోహా. 16:12) యేసు తన అపొస్తలులకు సూచించినట్లు, కొన్ని సందర్భాల్లో, ఒక వ్యక్తి తాను తెలుసుకునే హక్కు లేని సమాచారాన్ని లేదా తనకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేని సమాచారాన్ని అడగవచ్చు.—అపొ. 1:6,7.
“ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి” అని లేఖనాలు మనకు ఉపదేశిస్తున్నాయి. (కొలొ. 4:6) కాబట్టి, మనం జవాబిచ్చే ముందు, ఏమి చెప్పబోతున్నాం అన్నది మాత్రమే కాక ఎలా చెప్పబోతున్నాం అన్నది కూడా పరిగణలోకి తీసుకోవాలి.
ప్రశ్నించిన వ్యక్తి దృక్కోణాన్ని గ్రహించండి
అనేకసార్లు పెళ్ళి చేసుకున్న స్త్రీ పునరుత్థానాన్ని గురించిన ప్రశ్నతో యేసును చిక్కులో పెట్టాలని సద్దూకయ్యులు ప్రయత్నించారు. అయితే, నిజానికి పునరుత్థానముందని వారు విశ్వసించడం లేదని యేసుకు తెలుసు. కాబట్టి ఆయన, వారి ప్రశ్న వెనుక దాగివున్న అసలు కారణమైన తప్పుడు దృక్కోణాన్ని సరిదిద్దే విధంగా జవాబిచ్చాడు. ప్రజ్ఞతో కూడిన తర్కాన్ని, వారికి తెలిసిన లేఖనాధార వృత్తాంతాన్ని ఉపయోగిస్తూ వారు ముందెన్నడూ పరిగణలోకి తీసుకోని విషయాన్ని, అంటే దేవుడు నిజంగానే మృతులను పునరుత్థానం చేయబోతున్నాడనే దానికి స్పష్టమైన రుజువును ఆయన చూపించాడు. ఆయన జవాబుకు ఆయన వ్యతిరేకులు ఎంతగా ఆశ్చర్యచకితులయ్యారంటే, ఆ తర్వాత వారు ఆయనను ఇంకేమైనా ప్రశ్నించడానికి భయపడ్డారు.—లూకా 20:27-40.
మీరెలా జవాబివ్వాలో తెలుసుకోవడానికి, మిమ్మల్ని ప్రశ్నించే వారి దృక్కోణాలు ఏమిటో వారిని కలతపెట్టే విషయాలు ఏమిటో కూడా మీరు గ్రహించాలి. ఉదాహరణకు, మీ తోటి విద్యార్థి గానీ ఉద్యోగి గానీ మీరు క్రిస్మస్ ఎందుకు చేసుకోరని మిమ్మల్ని అడగవచ్చు. ఆయన ఎందుకు అలా అడుగుతున్నాడు? ఆయన నిజంగా దానికి కారణం తెలుసుకోవాలనుకుంటున్నాడా? లేక, మీరు సరదాగా సమయం గడిపేందుకు మీకు అనుమతి ఉందో లేదో అని ఆలోచిస్తున్నాడా? మీరు అది తెలుసుకోవడానికి, ఆయనలా అడగడానికి కారణమేమిటో ఆయనను అడగవలసిన అవసరం ఉండవచ్చు. ఆయన చెప్పిన కారణాన్ని బట్టి జవాబివ్వండి. మనం బైబిలు నిర్దేశాన్ని అనుసరించడం వల్ల, ఆ పండుగలోని వివిధ ఆచారాల మూలంగా చివరికి ఏర్పడే నిస్పృహ, ప్రజలపై వచ్చిపడే భారాలు వంటివాటి నుండి ఎలా స్వేచ్ఛ లభిస్తుందో వివరించేందుకు ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు.
ఒక గుంపు విద్యార్థుల ఎదుట యెహోవాసాక్షుల గురించి మాట్లాడడానికి మీరు ఆహ్వానించబడ్డారనుకోండి. మీరు మాట్లాడిన తర్వాత, వాళ్ళు ప్రశ్నలు అడగవచ్చు. ప్రశ్నలు హృదయపూర్వకమైనవిగాను సూటిగాను అనిపిస్తే, సరళమైన సూటైన జవాబులను ఇవ్వడమే మేలు. అయితే, సమాజానికున్న అకారణ దురభిప్రాయాలు ఆ ప్రశ్నల్లో వ్యక్తం చేయబడితే, మొదట, సాధారణంగా అలాంటి వివాదాంశాల గురించి ప్రజలకు అలాంటి అభిప్రాయాలు కలగడానికి కారణమేమిటో క్లుప్తంగా వ్యాఖ్యానించి, యెహోవాసాక్షులు తమకు ప్రమాణాన్ని నిర్ణయించడానికి బైబిలును అనుమతించాలని ఎందుకు ఎంపిక చేసుకుంటారో చెప్పి, ఆ తర్వాత వారి ప్రశ్నకు జవాబివ్వడం మంచిది. అలాంటి ప్రశ్నలను సవాళ్ళుగా దృష్టించక వాళ్ళను కలతపెడుతున్న విషయాలుగా దృష్టిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. వాళ్ళు నిజంగా సవాలు చేస్తున్నట్లుగానే అడిగినప్పటికీ అలా దృష్టించడమే ప్రయోజనకరం. అప్పుడు మీ జవాబు, మీ శ్రోతల దృక్కోణాన్ని విశాలపరచడానికీ వారికి సరైన సమాచారాన్ని తెలియజేయడానికీ మన విశ్వాసాలకు గల లేఖనాధారాన్ని వివరించడానికీ మీకు అవకాశాన్నిస్తుంది.
మీరు మన సమావేశానికి హాజరయ్యేందుకు సెలవివ్వడానికి మీ పై అధికారి అంగీకరించకపోతే మీరెలా ప్రతిస్పందిస్తారు? మొదట, ఆయన దృక్కోణంలో ఆలోచించండి. మీరు మరొక సమయంలో ఓవర్ టైమ్ చేస్తానని చెబితే ప్రయోజనం ఉంటుందా? మన సమావేశాల్లో ఇవ్వబడే ఉపదేశం మనం నిజాయితీగా నమ్మదగిన పనివాళ్ళుగా ఉండేందుకు సహాయపడుతుందని వివరించడం వల్ల ఆయన దృక్పథంలో మార్పేమైనా వస్తుందా? మీరు ఆయనకు ఆసక్తికరమైన విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నారని చూపించినప్పుడు, బహుశా, ఆయన కూడా మీ జీవితంలో ప్రాముఖ్యమైనదని తాను గ్రహించిన దాని గురించి అనుకూలమైన విధంగా ఆలోచించవచ్చు. అయితే, ఏదైనా మోసం చేయమని ఆయన మిమ్మల్ని కోరితే అప్పుడేమిటి? లేఖనాల్లోని ఒక ఆలోచనను పేర్కొంటూ, మీరు దానికి అంగీకరించలేకపోతున్నారని స్పష్టంగా చెప్పడం మీ దృఢ నిర్ణయాన్ని తెలియజేస్తుంది. మొదట మీరు ఆయనతో, మీ కోసం అబద్ధం చెప్పడానికిగానీ దొంగతనం చేయడానికిగానీ సిద్ధపడే వ్యక్తి, మీకు కూడా అబద్ధం చెప్పవచ్చు, లేదా మీది కూడా దొంగిలించవచ్చు కదా అని తర్కించడం వల్ల ఎక్కువ ఫలితం ఉండవచ్చేమో ఆలోచించండి.
మరొకవైపు, మీరు స్కూల్లో లేఖన విరుద్ధమైన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండాలనుకుంటున్న విద్యార్థి కావచ్చు. మీ ఉపాధ్యాయుడి దృక్పథాలు మీ దృక్పథాలకు భిన్నంగా ఉన్నాయనీ తరగతి గదిలో క్రమశిక్షణను కాపాడడం ఆయన బాధ్యత అనీ గుర్తుంచుకోండి. ఇప్పుడు మీ ఎదుట ఉన్న సవాళ్ళు: (1) ఆయనను కలతపెట్టే విషయాల గురించి మీరు ఆలోచిస్తున్నారని మీరు చూపించడం, (2) మీ దృఢ నిర్ణయాన్ని గౌరవప్రదంగా వివరించడం, (3) యెహోవాను ప్రీతిపరిచేదని మీకు తెలిసిన దాని కోసం స్థిరంగా నిలబడడం. మంచి ఫలితాలు పొందాలంటే, మీ విశ్వాసాల గురించి సరళంగా సూటిగా ప్రస్తావించడం మాత్రమే సరిపోక పోవచ్చు. (సామె. 15:28) మీరు చిన్నవాళ్ళయితే, ఏమి చెప్పాలో సిద్ధపడేందుకు మీ అమ్మ గానీ నాన్న గానీ సహాయపడతారనడంలో సందేహం లేదు.
కొన్నిసార్లు, అధికారంలో ఉన్న ఒకరు మీపై చేసిన ఆరోపణలు తప్పని నిరూపించవలసిన అవసరం ఉండవచ్చు. ఒకానొక చట్టానికి విధేయత చూపడం, క్రైస్తవ తటస్థతకు సంబంధించిన మీ నిర్ణయం, లేదా దేశభక్తి కార్యక్రమాల్లో పాల్గొనే విషయంలో మీ దృక్పథం వంటివాటిని గురించిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వమని ఒక పోలీస్ ఆఫీసరు గానీ ఒక ప్రభుత్వాధికారి గానీ ఒక జడ్జి గానీ మిమ్మల్ని అడగవచ్చు. మీరెలా జవాబివ్వాలి? “సాత్వికముతోను భయముతోను [“ప్రగాఢమైన గౌరవముతోను,” NW]” జవాబివ్వాలని బైబిలు ఉపదేశిస్తోంది. (1 పేతు. 3:15,16) ఆ వివాదాంశాలు వారిని ఎందుకు కలతపెడుతున్నాయని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, తర్వాత, వారు ఎందుకు కలతచెందుతున్నారో మీరు గ్రహిస్తున్నట్లు గౌరవపూర్వకంగా తెలియజేయండి. ఆ తర్వాత? అపొస్తలుడైన పౌలు, రోమా చట్టం ఇచ్చే హామీల గురించి మాట్లాడినట్లే, మీరు కూడా మీ కేసుకు వర్తించే చట్టబద్ధమైన హామీలను సూచించవచ్చు. (అపొ. 22:25-29) బహుశా, తొలి క్రైస్తవుల దృఢ నిర్ణయం గురించిన ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షులు తీసుకున్న దృఢ నిర్ణయం గురించిన వాస్తవాలు చెప్పడం అధికారుల దృక్కోణాన్ని విశాలపరచవచ్చు. లేదా దేవుని అధికారాన్ని గుర్తించడం, మానవుల సముచితమైన చట్టాలకు ఎల్లప్పుడు విధేయత చూపేలా నిజానికి ఎలా ప్రేరేపిస్తుందో పేర్కొనవచ్చు. (రోమా. 13:1-14) అటువంటి పరిస్థితిలో, మీ దృఢ నిర్ణయానికి లేఖనానుసారమైన కారణాలను చెబితే, అవి అంగీకరించబడవచ్చు.
ప్రశ్నించే వ్యక్తి లేఖనాలను ఎలా దృష్టిస్తాడు?
ఎలా జవాబివ్వాలన్నది నిర్ణయించుకునేటప్పుడు, మిమ్మల్ని ప్రశ్నించే వ్యక్తి పరిశుద్ధ లేఖనాలను ఎలా దృష్టిస్తాడన్నది పరిగణలోకి తీసుకోవలసిన అవసరం ఉండవచ్చు. పునరుత్థానం గురించి సద్దూకయ్యులు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చేటప్పుడు యేసు అదే చేశాడు. వాళ్ళు మోషే వ్రాసిన లేఖనాలను మాత్రమే అంగీకరిస్తారని తెలిసి, యేసు తన భావాన్ని వ్యక్తం చేసే ముందు, పెంటాటుక్‌లో (బైబిలులోని మొదటి ఐదు పుస్తకాలు) ఉన్న వృత్తాంతంపై తర్కిస్తూ, “మృతులు లేతురని మోషే సూచించెను” అని అన్నాడు. (లూకా 20:37, 38) అదేవిధంగా, మీరు కూడా మీ శ్రోత అంగీకరించేటటువంటి, ఆయనకు బాగా పరిచయమున్న బైబిలు భాగాలను ఉటంకించడం వల్ల ఫలితముంటుందని గ్రహించవచ్చు.
బైబిలు ఆధికారికమైనదని మీ శ్రోత దృష్టించకపోతే అప్పుడెలా? అపొస్తలుల కార్యములు 17:22-31 లో వ్రాయబడినట్లు, అరేయొపగు కొండ మీద అపొస్తలుడైన పౌలు తన ప్రసంగంలో ఏమి చేశాడో గమనించండి. ఆయన నేరుగా బైబిలు లేఖనాల నుండి ఉటంకించకుండానే లేఖనాల్లోవున్న సత్యాలను పంచుకున్నాడు. అవసరమైన చోట్ల మీరు కూడా అలాగే చేయవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మీరు ఒక వ్యక్తికి బైబిలు గురించి నేరుగా చెప్పే ముందు, అనేకసార్లు చర్చలు జరపవలసి రావచ్చు. మీరు బైబిలును పరిచయం చేసేటప్పుడు, అది దేవుని వాక్యమని నొక్కివక్కాణించి చెప్పేబదులు, అది పరిగణించదగినదనడానికి కొన్ని కారణాలు మొదట చెప్పడం జ్ఞానయుక్తంగా ఉండవచ్చు. అయితే, దేవుని సంకల్పం గురించి స్పష్టంగా సాక్ష్యమివ్వడం, బైబిలు ఏమి చెబుతోందో స్వయంగా మీ శ్రోతలే నెమ్మదిగా గ్రహించేలా చేయడం మీ లక్ష్యంగా ఉండాలి. మనం వ్యక్తిగతంగా చెప్పే మాటల కన్నా బైబిలే ఎక్కువ ఒప్పించేదిగా ఉంటుంది.—హెబ్రీ. 4:12.
“ఎల్లప్పుడు . . . కృపాసహితముగా”
యెహోవా కృపగలవాడు గనుక, ఆయన సేవకుల సంభాషణ కూడా “ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను” ఉండాలని వారికి చెప్పడం ఎంత సముచితం! (కొలొ. 4:6; నిర్గ. 34:6) ఎదుటి వాళ్ళు దానికి అర్హులు కారని అనిపించినప్పుడు కూడా మనం ఎల్లప్పుడూ దయతో మాట్లాడ బద్ధులమై ఉన్నామని దాని అర్థం. మన సంభాషణ ఎల్లప్పుడూ రుచికరమైనదిగా ఉండాలే గానీ కఠినంగా, ఔచిత్యం లేకుండా ఉండకూడదు.
చాలామంది ప్రజలు చాలా ఒత్తిళ్ళకు గురవుతుంటారు, వారు ప్రతిరోజు సూటిపోటి మాటలకు గురవుతుంటారు. మనం అలాంటి వాళ్ళను సందర్శించినప్పుడు, వాళ్ళు మనతో కఠినంగా మాట్లాడుతుండవచ్చు. అప్పుడు, మనమెలా ప్రతిస్పందించాలి? “మృదువైన మాట క్రోధమును చల్లార్చును” అని బైబిలు చెబుతోంది. అలాంటి జవాబు వ్యతిరేక దృక్కోణంగలవారిని మెత్తబరచగలదు. (సామె. 15:1; 25:15) ప్రేమను వ్యక్తం చేసే ప్రవర్తనా స్వరమూ ప్రతిరోజు కఠినమైన వ్యవహారానికి గురయ్యేవారి మనస్సును ఎంతగానో ఆకట్టుకుంటాయి గనుక, వారు మనం అందించే సువార్తను వినవచ్చు.
సత్యానికి ఏ మాత్రం గౌరవం చూపించనివారితో వాదించాలన్న ఆసక్తి మనకు ఏ మాత్రం లేదు. లేఖనాల నుండి తర్కించడానికి అనుమతించేవారితో తర్కించాలన్నదే మన కోరిక. మనకు ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ, దయతోనూ దేవుని ప్రశస్త వాగ్దానాలు నమ్మదగినవన్న నిశ్చయతతోనూ జవాబివ్వాలన్న విషయాన్ని మనస్సులో పెట్టుకుందాం.—1 థెస్స. 1:4,5.
వ్యక్తిగత నిర్ణయాలూ మనస్సాక్షికి సంబంధించిన విషయాలూ
బైబిలు విద్యార్థి గానీ తోటి విశ్వాసి గానీ ఒక నిర్దిష్ట పరిస్థితిలో తాను ఏమి చేయాలని మిమ్మల్ని అడిగితే మీరెలా జవాబివ్వాలి? మీరైతే ఏమి చేస్తారన్నది మీకు తెలిసే ఉండవచ్చు. కానీ ప్రతి వ్యక్తీ తన జీవితంలో తీసుకునే నిర్ణయాలకు తానే బాధ్యత వహించాలి. (గల. 6:5) “విశ్వసించి విధేయత” చూపాలని తాను బోధించిన వ్యక్తులను ప్రోత్సహించానని పౌలు వివరించాడు. (రోమా. 16:26, ఈజీ-టు-రీడ్ వర్షన్) మనం అనుకరించడానికి అది చక్కని మాదిరి. ముఖ్యంగా తన బైబిలు బోధకుణ్ణో మరొకరినో ప్రీతిపరిచేందుకే నిర్ణయాలు తీసుకునే వ్యక్తి మనుష్యులకే సేవ చేస్తున్నాడు, ఆయన విశ్వాసముతో జీవించడం లేదు. (గల. 1:10) కాబట్టి సరళమైన సూటైన జవాబు ఇవ్వడం, పరిష్కార మార్గం అడుగుతున్న వ్యక్తికి మంచిది కాకపోవచ్చు.
అయితే, మీరు బైబిలు మార్గనిర్దేశాలకు పొందికగా ఎలా జవాబివ్వగలరు? సముచితమైన బైబిలు సూత్రాల గురించీ, బైబిలు వృత్తాంతంలో చేర్చబడిన ఉదాహరణల గురించీ మీరు ఆయనను ఆలోచింపజేయవచ్చు. ఆ సూత్రాలను ఉదాహరణలను తెలుసుకోవడానికి స్వయంగా పరిశోధించడమెలాగో మీరు ఆయనకు చూపించవచ్చు. మీరు ఆ సూత్రాలను, ఉదాహరణల విలువను ప్రస్తుత వాస్తవ పరిస్థితికి అన్వయించకుండానే చర్చించవచ్చు కూడా. జ్ఞానయుక్తమైన నిర్ణయం తీసుకునేందుకు తనకు సహాయపడేదేమైనా వాటిలో కనిపిస్తుందేమో ఆ వ్యక్తిని అడగండి. యెహోవాను ప్రీతిపరిచే మార్గమేమిటో ఆ సూత్రాల, ఉదాహరణల వెలుగులో ఆలోచించమని ఆయనను ప్రోత్సహించండి. ఆ విధంగా ‘తప్పొప్పులను గుర్తించేలా తన సొంత గ్రహణశక్తులకు శిక్షణ ఇచ్చుకోవడానికి’ మీరు ఆయనకు సహాయం చేస్తారు.—హెబ్రీ. 5:14, NW.
సంఘ కూటాల్లో వ్యాఖ్యానించడం
మనం మన విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించుకునే అవకాశాలను క్రైస్తవ సంఘ కూటాలు తరచూ ఇస్తాయి. మనమలా చేసే ఒక పద్ధతి, ప్రశ్నలకు ప్రతిస్పందిస్తూ వ్యాఖ్యానించడం. మనమెలా వ్యాఖ్యానించాలి? యెహోవాను స్తుతించాలి, ఆయనను ప్రశంసిస్తూ మాట్లాడాలి అన్న కోరికతో వ్యాఖ్యానించాలి. కీర్తనకర్త దావీదు, “సమాజములలో” ఉన్నప్పుడు అదే చేశాడు. (కీర్త. 26:12) అపొస్తలుడైన పౌలు ఉద్బోధించినట్లు, తోటి విశ్వాసులను ప్రోత్సహించేలా, “ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును” వారిని పురికొల్పేలా కూడా మనం వ్యాఖ్యానించాలి. (హెబ్రీ. 10:23-25) పాఠాలను ముందుగా అధ్యయనం చేయడం ఆ విధంగా చేయడానికి మనకు సహాయపడుతుంది.
మిమ్మల్ని వ్యాఖ్యానించమన్నప్పుడు సరళంగా స్పష్టంగా క్లుప్తంగా వ్యాఖ్యానించండి. పేరాలోని అంశాలన్నింటిపై వ్యాఖ్యానించకండి; కేవలం ఒక్క అంశమే చెప్పండి. మీరు జవాబులోని ఒక భాగం మాత్రమే ఇస్తే, అదనపు వ్యాఖ్యానాలను చేసే అవకాశం ఇతరులకు లభిస్తుంది. పేరాలో ఉదాహరించబడిన లేఖనాలను నొక్కి చెబితే ఇంకా ప్రయోజనం ఉంటుంది. అలా చేసేటప్పుడు, చర్చించబడుతున్న అంశాలకు వర్తించే లేఖన భాగంపై శ్రద్ధ మళ్ళించడానికి కృషి చేయండి. పేరాలో ఉన్నది ఉన్నట్లు చదివే బదులు, మీ సొంత మాటల్లో వ్యాఖ్యానించడం నేర్చుకోండి. మీరు చేసిన వ్యాఖ్యానం సరిగ్గా వ్యక్తం కాకపోతే కలత చెందకండి. వ్యాఖ్యానించే ప్రతి ఒక్కరికీ అప్పుడప్పుడు అలా జరుగుతూనే ఉంటుంది.
మనమెలా జవాబివ్వాలన్నది తెలిసికొని ఉండడానికి, కేవలం జవాబు తెలిసి ఉండడం మాత్రమే సరిపోదన్నది స్పష్టం. అందుకు వివేచన అవసరం. మీ హృదయంలో నుండి వచ్చి, ఇతరుల హృదయాలను స్పృశించే జవాబులను మీరు ఇచ్చినప్పుడు ఎంత సంతృప్తిగా ఉంటుంది!—సామె. 15:23.