ఉత్తేజకరమైన మార్పులతో కావలికోట!
1 ఈ సంవత్సరపు ప్రారంభంలో, సంఘాలు ఉత్తేజపరిచే ప్రకటనను అందుకున్నాయి: 2008 జనవరి మొదలుకొని, కావలికోటలో రెండు వేర్వేరు ప్రతులుంటాయి, మొదటిది ప్రజల కోసం, రెండవది మన క్రైస్తవ సహోదరుల కోసం. మీరిలా అనుకొని ఉండవచ్చు: ‘ఈ రెండు పత్రికల మధ్య ఎలాంటి తేడాలు ఉంటాయి? వేర్వేరు ప్రతులు ఉండడంవల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి? కొత్త ప్రతుల్లో నూతన అంశాలేవైనా ఉంటాయా? ఇండియాలోవున్న విభిన్న భాషల్లో ఎలాంటి ప్రతులు ప్రచురించబడతాయి?’
2 వాటి మధ్యనున్న తేడాలు: ఆంగ్లంలో, నెలలో మొదటి తారీఖుతో వచ్చే సంచిక సార్వజనిక ప్రతి అని పిలవబడుతుంది. ఈ సంచికలో ఉండే ఆర్టికల్స్ అన్నీ ప్రజలను దృష్టిలో పెట్టుకొని తయారుచేయబడతాయి. నెలలో 15వ తారీఖుతో వచ్చే సంచిక అధ్యయన ప్రతి అని పిలవబడుతుంది, ఇది క్షేత్ర పరిచర్యలో అందించబడదు. దీనిలో నెలకు సరిపడా అధ్యయన శీర్షికలతోపాటు సమర్పిత క్రైస్తవులు ప్రత్యేకంగా ఇష్టపడే అదనపు శీర్షికలు కూడా ఉంటాయి. కావలికోట సార్వజనిక ప్రతి కేవలం సాక్షులనే కాక, ముఖ్యంగా బైబిలును గౌరవించే సాక్షులుకాని వారిని కూడా ఆకట్టుకుంటుంది. మరోవైపు, తేజరిల్లు! ఇప్పుడున్నట్టుగానే సంశయవాదులను, క్రైస్తవేతర మతస్థులమని చెప్పుకునే వారితోపాటు అనేకమంది పాఠకులను ఉద్దేశించి ప్రచురించబడుతుంది.
3 ప్రయోజనాలు: అధ్యయన ప్రతిలో, “పయినీరు” వంటి పదాలను సాక్షులు కానివారు అర్థం చేసుకునే విధంగా వివరించాల్సిన అవసరం ఇక ఉండదు. ఈ ప్రతిలో, యెహోవాసాక్షులకు, ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తున్న బైబిలు విద్యార్థులకు అన్వయించే, ప్రత్యేకంగా తయారుచేయబడిన సమాచారం కూడా ఉండవచ్చు. సార్వజనిక ప్రతి మాటేమిటి? దీనిలోని అంశాలు, రాయబడే శైలి ప్రజలనుద్దేశించి ఉంటుంది కాబట్టి, సాక్షులుకాని వారు పత్రికనంతా చదివేందుకు ఇష్టపడతారు. అంతేకాక, యెహోవాసాక్షుల్లోని ప్రతీ ఒక్కరూ ప్రతీ సంచికను చదివి ప్రయోజనం పొందుతారు.
4 కొత్త అంశాలు: కావలికోట సార్వజనిక ప్రతి కోసం ఉత్తేజకరమైన కొన్ని కొత్త అంశాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఒక అంశం, ప్రాథమిక లేఖనాల బోధలను చాలా సులువైన శైలిలో చర్చిస్తుంది. మరో అంశం, బైబిలు కుటుంబాలకు ఎలా సహాయపడగలదో చూపిస్తుంది. యౌవనుల కోసం బైబిలు అధ్యయన ప్రాజెక్టులు ఇవ్వబడతాయి. ప్రతీ సంచికలో యెహోవా లక్షణాల గురించి బోధించే నిర్దిష్ట బైబిలు భాగాలను చర్చిస్తున్న ఒక శీర్షిక ఉంటుంది.
5 భారతీయ భాషలు: కావలికోట అధ్యయన మాసప్రతి, సార్వజనిక త్రైమాసిక ప్రతి ఇక్కడివ్వబడిన భాషల్లో ప్రచురించబడతాయి: కన్నడ, తమిళం, తెలుగు, పంజాబీ, బెంగాలీ, మలయాళం, మరాఠీ, హిందీ. అయితే, గుజరాతీ, నేపాలీ, మిజో భాషల్లో సంయుక్త మాసప్రతి (Monthly Combination Edition) మాత్రమే ప్రచురించబడుతుంది. ఇది మొదటి తారీఖుతో వస్తుంది, దీనిలో సార్వజనిక ప్రతిలోని ఎంపిక చేయబడిన శీర్షికలతో పాటు అధ్యయన ప్రతిలోని అన్ని అధ్యయన శీర్షికలుంటాయి. డిసెంబరు 15, 2007, ఆంగ్ల సంచికలో వదిలిపెట్టబడిన అధ్యయన ఆర్టికల్‌లున్న బ్రోషుర్ ఆయా భాషల్లో ప్రచురించబడుతుంది.
6 కావలికోటలో చేయబడిన ఈ క్రొత్త ఏర్పాటును యెహోవా ఆశీర్వదించాలని మనం ప్రార్థిద్దాం. తేజరిల్లు!తోపాటు ఈ పత్రిక యోగ్యులైన అనేకమందిని సువార్తతో చేరుకోవచ్చు.—మత్త. 10:11.