మీరు దేవుని వాక్యాన్ని సమర్థిస్తారా?
1 బైబిలు ప్రామాణికతను తరచూ సంశయించే ఈ లోకంలో, నిజ క్రైస్తవులు ఉత్సాహంగా దేవుని వాక్యాన్ని సమర్థిస్తున్నారు. ‘లేఖనాలన్నీ దైవావేశమువలన కలిగినవి’ అనే నమ్మకం కుదిరిన మనం యేసుక్రీస్తుతో ఏకీభవిస్తాము, ఆయన యెహోవాకు చేసిన ప్రార్థనలో “నీ వాక్యమే సత్యము” అని ధృవీకరించాడు. (2 తిమో. 3:16, 17; యోహా. 17:17) మనం దేవుని వాక్యాన్ని విజయవంతంగా ఎలా సమర్థించవచ్చు?
2 లేఖనాలను శ్రద్ధగా అధ్యయనం చేయండి: యేసు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేశాడనడంలో సందేహం లేదు, దానివల్ల ఆయన తన పరిచర్య అంతటిలో లేఖనాల నుండి బోధించగలిగాడు. (లూకా 4:16-21; 24:44-46) సహాయకరమైన లేఖనాల భాండాగారాన్ని మనమెలా జ్ఞాపకముంచుకోవచ్చు? మనం ప్రతీరోజు బైబిలును చదివి, ఆ తర్వాత ప్రత్యేకంగా ప్రోత్సాహాన్నిచ్చేవని లేదా పరిచర్యకు సహాయపడేవని మనకు అనిపించిన ఒక లేఖనాన్ని ధ్యానించడంద్వారా జ్ఞాపకముంచుకోవచ్చు. కూటాలకు సిద్ధపడుతున్నప్పుడు ఉదాహరించబడిన లేఖనాలను తెరచిచూసి, నేరుగా బైబిలు నుండి చదివి, ఆ లేఖనాలమీద ఒక వ్యాఖ్యానాన్ని సిద్ధపడవచ్చు. కూటాలకు హాజరవుతున్నప్పుడు, ప్రసంగీకుడు లేఖనాలను చదువుతుండగా మనం బైబిలు తెరిచి చూడాలి. బైబిలు లేఖనాలను శ్రద్ధగా అధ్యయనం చేయడం ‘సత్యవాక్యమును సరిగా ఉపదేశించడానికి’ మనలను సంసిద్ధులను చేస్తుంది.—2 తిమో. 2:15.
3 బైబిలును ఉపయోగించండి: పరిచర్యలో ఉన్నప్పుడు మనం బైబిలును ఉపయోగించాలి. ఉదాహరణకు పరిస్థితులు అనుకూలించినప్పుడు, ఒక లేఖనాన్ని చదివి, దానిని గృహస్థునితో చర్చించడానికి ప్రయత్నించాలి. గృహస్థుడు ఏదైనా ప్రశ్న అడిగినా లేదా అభ్యంతరం చెప్పినా సమాధానమివ్వడానికి బైబిలు ఉపయోగించడం మంచిది. గృహస్థుడు పని తొందరలో ఉన్నప్పుడు “నేను వెళ్ళేముందు, ఈ లేఖనాన్ని చదవనివ్వండి” అని చెప్పడంద్వారా కూడా మనం బైబిలుకు సంబంధించిన ఒక విషయాన్ని చూపించవచ్చు. సాధ్యమైనప్పుడల్లా, నేరుగా బైబిలు నుండి చదవండి, మీరు చదువుతున్న లేఖనాన్ని వినేవారికి చూపించండి. కానీ కొన్నిసార్లు, అననుకూల పరిస్థితుల్లో మన బ్యాగుల్లో నుండి బైబిలు తీసి చదివే బదులు మనకు జ్ఞాపకమున్న ఒక లేఖనాన్ని చెప్పడం మంచిది.
4 ఒక గృహస్థుడికి త్రిత్వం తప్పని నిరూపించే లేఖనాలను చూపించినప్పుడు, ఆశ్చర్యంతో ఆయన ఇలా అన్నాడు: “నేను చిన్నప్పటి నుండి చర్చికి వెళ్తున్నాను. త్రిత్వం గురించి బైబిలు ఇలా చెబుతుందని నాకు నిజంగా తెలియదు!” ఆయన వెంటనే బైబిలు అధ్యయనానికి అంగీకరించాడు. గొర్రెలు తన స్వరాన్ని వింటాయని యేసు చెప్పాడు. (యోహా. 10:16, 27) యథార్థహృదయులు సత్యాన్ని గుర్తించే శ్రేష్ఠమైన మార్గం లేఖనాల నుండి దానిని నేరుగా చూడడమే. కాబట్టి మనం దేవుని సత్య వాక్యాన్ని సమర్థించేవారిగా ఉందాం!