“సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే”
1 మనందరమూ అప్పుడప్పుడూ అలసిపోతుంటాం. మన ఉద్యోగస్థలంలోని పనివల్ల, ఇతర శారీరక పనులవల్ల మాత్రమేకాక, ఈ “అంత్యదినములలో” మనం ఎదుర్కొనే సమస్యలవల్ల కూడా మనం అలసిపోతుంటాం. (2 తిమో. 3:1) యెహోవా సేవకులుగా, మన పరిచర్యలో వెనుకబడకుండా ఉండడానికి అవసరమైన ఆధ్యాత్మిక బలాన్ని ఎలా పొందుతాం? మనం “బలాతిశయము” గలవాడైన యెహోవా మీద ఆధారపడడంద్వారా బలాన్ని పొందుతాం. (యెష. 40:26) మన అవసరాలేమిటో ఆయనకు తెలుసు, ఆయన మనకు సహాయం చేయాలని నిజంగా కోరుకుంటున్నాడు.—1 పేతు. 5:7.
2 యెహోవా చేసిన ఏర్పాట్లు: యెహోవా మనలను తన పరిశుద్ధాత్మద్వారా అంటే విశ్వాన్ని సృష్టించడానికి ఉపయోగించిన తిరుగులేని శక్తిద్వారా మనలను బలపరుస్తున్నాడు. మనం అలసిపోతే తిరిగి ‘బలాన్ని పొందడానికి’ దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తుంది. (యెష. 40:31) మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘నా క్రైస్తవ బాధ్యతలను నెరవేర్చేందుకు నన్ను బలపరచమని ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ కోసం చివరిసారి నేను ఎప్పుడు ప్రార్థించాను?’—లూకా 11:11-13.
3 ప్రతీరోజు దేవుని ప్రేరేపిత వాక్యాన్ని చదివి, ధ్యానించడంద్వారా, క్రమంగా క్రైస్తవ ప్రచురణలను అధ్యయనం చేయడంద్వారా ఆధ్యాత్మికంగా పోషించబడుతూ మనం “నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు” పచ్చని ‘చెట్టులా’ ఉంటాం.—కీర్త. 1:2, 3.
4 మనకు “బలపరిచే సహాయకం”గా ఉండగల తోటి క్రైస్తవులను కూడా యెహోవా ఉపయోగించుకుంటాడు. (కొలొ. 4:10, 11, NW) వారు సంఘ కూటాల్లో ప్రోత్సాహకరమైన రీతిలో సంభాషించడం ద్వారా, వ్యాఖ్యానించడం ద్వారా, ప్రసంగించడం ద్వారా మనల్ని బలపరుస్తారు. (అపొ. 15:32) ప్రాముఖ్యంగా క్రైస్తవ పెద్దలు ఆధ్యాత్మికంగా సహాయం చేస్తారు, మనల్ని ఉత్తేజపరిచేరీతిలో ప్రోత్సహిస్తారు.—యెష. 32:1, 2.
5 పరిచర్య: మీరు అలసిపోతున్నారని మీకనిపిస్తే, ప్రకటనా పనిని ఆపకండి! ఇతర కార్యకలాపాలకు భిన్నంగా, క్రమంగా పరిచర్యలో పాల్గొనడం నిజానికి మనకు ఉత్తేజాన్నిస్తుంది. (మత్త. 11:28-30) సువార్త ప్రకటించడం, దేవుని రాజ్యంపై మనసును కేంద్రీకరించడానికి, నిత్యజీవాన్ని, అది తెచ్చే భవిష్యత్ ఆశీర్వాదాలనూ దృష్టిలో ఉంచుకోవడానికి మనకు సహాయం చేస్తుంది.
6 ఈ దుష్టవిధానం నాశనమయ్యే ముందు చేయాల్సింది చాలా ఉంది. ‘దేవుడు అనుగ్రహించు సామర్థ్యంపై’ లేదా బలంపై ఆధారపడి మన సేవలో స్థిరంగా కొనసాగడానికి మనకు ప్రతీ కారణం ఉంది. (1 పేతు. 4:11) యెహోవా సహాయంతో మనం మన పనిని పూర్తిచేస్తాం, ఎందుకంటే ఆయన ‘సొమ్మసిల్లినవారికి బలాన్నిస్తున్నాడు.’—యెష. 40:29.