గౌరవాన్ని ప్రదర్శించడం ద్వారా క్రీస్తును అనుసరించండి
1. ఈ సంవత్సరపు జిల్లా సమావేశ అంశానికి, గౌరవం ప్రదర్శించడానికి ఎలాంటి సంబంధం ఉంది?
1 విశ్వసర్వాధిపతియైన యెహోవా మహాత్మ్యము కలవాడని బైబిలు వర్ణిస్తోంది. (కీర్త. 104:1) యేసు ఎల్లప్పుడూ తన తండ్రిని, తన తండ్రి చేసిన ఏర్పాట్లను ఘనపర్చే విధంగా మాట్లాడాడు, ప్రవర్తించాడు. (యోహా. 17:4) “క్రీస్తును అనుసరించండి!” అనే రాబోయే జిల్లా సమావేశాల్లో యేసును అనుసరించి యెహోవాను మహిమపర్చడానికి మనందరికీ అవకాశాలు దొరకుతాయి.
2. మనం ప్రతీ కార్యక్రమానికి హాజరవడానికి ఏర్పాట్లు చేసుకోవడం యెహోవాను ఎలా ఘనపరుస్తుంది?
2 గౌరవపూర్వకమైన ఆరాధన: యెహోవా మనకోసం సిద్ధం చేసిన ఆధ్యాత్మిక విందుకు హాజరవడానికి ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా మనం ఆయనను ఘనపరచవచ్చు. శుక్రవారంతో సహా, సమావేశపు అన్నిరోజులు హాజరవడానికి మీ యజమానితో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేసుకున్నారా? సీట్లను వెతుక్కోవడానికి, ప్రారంభపు పాటలో, ప్రార్థనలో భాగం వహించేందుకు తగినంత సమయం ఉండేలా ముందుగానే సమావేశ స్థలానికి రావడానికి మీరు ప్రణాళిక వేసుకున్నారా? మధ్యాహ్నం సహోదరులతో కలిసి సమావేశ స్థలం దగ్గర భోజనం చేయడానికి ఏమి తెచ్చుకోవాలో నిర్ణయించుకున్నారా? ప్రతీ కార్యక్రమం ప్రారంభమయ్యే ముందు, సంగీతం ప్రారంభమవడానికి ముందే సీట్లలో కూర్చోమని ఛైర్మన్ మనకు చెప్పినప్పుడు, వెంటనే మన సంభాషణను ఆపి కార్యక్రమం ఆరంభమవడానికి ఎదురుచూస్తూ సీట్లలో కూర్చోవాలి.
3. కార్యక్రమాన్ని శ్రద్ధగా వినడం మన ఆరాధనను ఎలా గౌరవపూర్వకమైనదిగా చేస్తుంది?
3 కార్యక్రమాన్ని శ్రద్ధగా వినడం కూడా మన పరలోక తండ్రిని ఘనపరుస్తుంది. “ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉందని చూపిస్తూ, చెబుతున్న దానిపై గౌరవంతో నిశ్శబ్దంగా వినే ప్రేక్షకుల మాదిరికరమైన ప్రవర్తనను” గమనించేవారు ముగ్ధులవుతారని స్థానిక జిల్లా సమావేశాన్ని గమనించిన ఒక విలేఖరి వ్రాశాడు. ఆయనింకా ఇలా అన్నాడు: “చాలామంది పిల్లలు . . . ఆశ్చర్యకరంగా చక్కగా ప్రవర్తించారు లేదా పరిశుద్ధ బైబిల్లోని లేఖనాలను చూడడంలో నిమగ్నమైపోయారు.” కార్యక్రమం జరుగుతున్నప్పుడు, అనవసరంగా మాట్లాడడం, ఎస్ఎమ్ఎస్లు పంపించడం, తినడం లేదా వసారాల్లో అటు ఇటు తిరగడం వంటివి చేయకూడదు. పిల్లలు కార్యక్రమం నుండి ప్రయోజనం పొందడానికి తల్లిదండ్రులు సహాయం చేయగలిగేలా, వారు తమ తల్లిదండ్రులతో కూర్చోవాలి. (ద్వితీ. 31:12; సామె. 29:15) అలాంటి ప్రయత్నాలు, మనకు ఇతరులపట్ల గౌరవం ఉందని, అందించబడే ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక ఆహారంపట్ల కృతజ్ఞత ఉందని చూపిస్తాయి.
4. సమావేశంలో మనం ఎందుకు హుందాగా కనబడాలి?
4 హుందాగా కనబడడం: వస్త్రధారణ, కనబడేతీరు విషయంలో దేవుని సేవకులు క్రైస్తవ గౌరవాన్ని కనబరచడానికి కృషిచేయాలని నొక్కిచెప్పిన గత సంవత్సరపు జిల్లా సమావేశంలోని “అన్ని సమయాల్లో క్రైస్తవ గౌరవాన్ని ప్రదర్శించండి” అనే ప్రసంగంలో ఇవ్వబడిన జ్ఞాపికలకు అనేకులు కృతజ్ఞతను వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం కూడా మనం ఆ విషయంలో ఎంతో శ్రద్ధ వహించాలి. మనం కనబడేతీరు యెహోవాపట్ల, ఆయనకు సాక్షులుగా ఉండే ఆధిక్యతపట్ల మనకున్న భావాలను ప్రతిబింబిస్తాయి. మన వస్త్రధారణ ఎల్లప్పుడూ మనం ‘దైవభక్తిగలవారమని చెప్పుకొనేలా’ ఉండాలి.—1 తిమో. 2:9, 10.
5. సమావేశం జరిగే నగరంలో, మనం కనబడేతీరును తీరిక సమయాల్లో ఎలా హుందాగా ఉంచుకోవచ్చు?
5 కార్యక్రమానికి హాజరవుతున్నప్పుడు మాత్రమే మనం హుందాగా కనబడాలా? సమావేశం జరిగే నగరంలో ఉన్నప్పుడు మనం సమావేశ బ్యాడ్జిలను పెట్టుకోవడాన్ని చాలామంది గమనిస్తారని గుర్తుంచుకోండి. మనం కనబడేతీరు సాధారణ ప్రజల నుండి వేరుగా ఉండాలి. కాబట్టి, తీరిక సమయంలోనైనా, అంటే కార్యక్రమం ముగిసిన తర్వాత తినడానికి బయటికి వెళుతున్నప్పుడు, క్రైస్తవ సమావేశానికి హాజరవాలనే ఉద్దేశంతో నగరానికి వచ్చిన పరిచారకుల్లా దుస్తులు ధరించాలి గానీ జీన్స్, షార్టులను లేదా టీషర్ట్వంటి వాటిని ధరించకూడదు. అలా చేయడం మన చుట్టూ ప్రజలకు ఎంత చక్కటి సాక్ష్యాన్నిస్తుందో కదా! పరిచారకులుగా మనకున్న పాత్రకు తగినట్లుగా మన కనబడే తీరు ఉన్నప్పుడు యెహోవా సంతోషిస్తాడు.
6. క్రైస్తవ గౌరవాన్ని ప్రదర్శిస్తే ఎలాంటి మంచి ఫలితాలుంటాయి?
6 సంతృప్తికరమైన ఫలితాలు: మన సమావేశాల్లో క్రైస్తవ గౌరవాన్ని ప్రదర్శించడం అనియతంగా సాక్ష్యమివ్వడానికి అవకాశాలనివ్వడమేకాక, చూసేవారికి మనమీద సదభిప్రాయం ఏర్పడేలా కూడా చేస్తుంది. ఒక సమావేశం ముగిసిన తర్వాత, ఒక అధికారి ఇలా వ్యాఖ్యానించాడు: “ఇంత చక్కగా ప్రవర్తించే ప్రజలను మేమెక్కడా చూడలేదు. దేవుడు మనల్ని కోరుతున్న విధంగా మీరు నడుచుకుంటున్నారు.” గౌరవాన్ని ప్రదర్శించడం ఒకరిపట్ల ఒకరికి గౌరవం, ప్రేమ ఉందనే విషయాన్ని చూపించడమేకాక, యెహోవాను మహిమపరుస్తుంది. (1 పేతు. 2:12) అది మనకు దైవభయం, తండ్రిచేత ఉపదేశించబడే ఆధిక్యతపట్ల కృతజ్ఞత ఉందని చూపిస్తుంది. (హెబ్రీ. 12:28) “క్రీస్తును అనుసరించండి!” అనే జిల్లా సమావేశం కోసం మనం ఎదురుచూస్తుండగా, గౌరవాన్ని ప్రదర్శించడానికి మనం కృషి చేద్దాం.
[5వ పేజీలోని బాక్సు]
జిల్లా సమావేశపు జ్ఞాపికలు
◼ కార్యక్రమ వేళలు: మూడు రోజులూ కార్యక్రమం ఉదయం 9:20 కి ప్రారంభమౌతుంది. ఉదయం 8 గంటలకు తలుపులు తెరుస్తారు. ప్రారంభ రాజ్య సంగీతం మొదలవగానే కార్యక్రమం గౌరవప్రదంగా ప్రారంభమయ్యేలా మనమందరం సీట్లలో కూర్చోవాలి. శుక్రవారం, శనివారం కార్యక్రమం సాయంత్రం 5:05కి ముగుస్తుంది, ఆదివారం సాయంత్రం 4:10 కి ముగుస్తుంది.
◼ పార్కింగ్: పార్కింగ్‌ను నియంత్రించే అవకాశం మనకు దొరికిన అన్ని సమావేశ స్థలాల్లో, ఎవరు ముందు వస్తే వారికే పార్కింగ్ స్థలం ఉచితంగానే ఇవ్వబడుతుంది. సమావేశ బ్యాడ్జి కార్డులు పార్కింగ్ చేయడానికి గుర్తింపుగా పనిచేస్తాయి. వికలాంగులకు కేటాయించబడిన స్థలంలో వారు మాత్రమే వాహనాలను పెట్టుకోవడానికి అనుమతించబడతారు. సాధారణంగా పార్కింగ్ స్థలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక కార్లో ఒకరిద్దరు మాత్రమే వచ్చే బదులు కారు ఉన్న ఇతరులను కూడా కలుపుకుని ఒకే కార్లో రావడానికి ప్రయత్నించాలి.
◼ సీట్లు నిలుపుకోవడం: మీతోపాటు ఒకే వాహనంలో ప్రయాణించేవారికి లేదా మీ ఇంటివారికి మాత్రమే సీట్లు నిలుపుకోవచ్చు.
◼ మధ్యాహ్న భోజనం: మధ్యాహ్నం విరామ సమయంలో భోజనం చేయడానికి సమావేశ స్థలాన్ని విడిచి వెళ్ళే బదులు దయచేసి మీ వెంట భోజనాన్ని తెచ్చుకోండి. మీ సీటు క్రింద పెట్టేందుకు వీలైన టిఫిన్ కారియర్లను తెచ్చుకోండి. సమావేశ స్థలంలోకి పెద్దపెద్ద క్యానులు, గాజు సామాను, మద్యపానీయాలు తీసుకురాకూడదు.
◼ విరాళాలు: ఒక జిల్లా సమావేశం ఏర్పాటు చేయడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. మన రాజ్య మందిరంలో లేక సమావేశంలో, ప్రపంచవ్యాప్త పని కోసం స్వచ్ఛంద విరాళాలు ఇవ్వడం ద్వారా మనం కృతజ్ఞతను చూపించవచ్చు. సమావేశంలో చెక్కు రూపంలో విరాళం ఇవ్వాలనుకున్నవారు “Watch Tower” పేరున వ్రాయాలి.
◼ ప్రమాదాలు, అత్యవసర పరిస్థితులు: చిన్నచిన్న విషయాల గురించి చాలా సెల్‌ఫోన్ కాల్స్ వస్తున్నాయని ప్రథమచికిత్సా విభాగం వారు ఫిర్యాదు చేశారు. సమావేశ స్థలంలో ఎవరికైనా అత్యవసరంగా వైద్య సహాయం అవసరమైతే దగ్గర్లో ఉన్న అటెండెంటును సంప్రదించండి, అర్హత పొందిన ప్రథమచికిత్సా సిబ్బంది పరిస్థితి గంభీరతను అంచనా వేసి సహాయపడేందుకు, ఆయన వెంటనే దానిని ప్రథమచికిత్స విభాగం దృష్టికి తీసుకువస్తాడు. అవసరమైతే, మన ప్రథమ చికిత్సా విభాగం 102 నెంబర్‌కు ఫోన్ చేస్తుంది.
◼ బధిరులు: బెంగుళూరులో జరగబోయే ఇంగ్లీషు సమావేశంలో మాత్రమే అమెరికన్ సంజ్ఞాభాషలో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేయబడతాయి.
◼ రికార్డింగ్: సమావేశ స్థలానికి సంబంధించిన విద్యుత్తు కనెక్షన్‌కు లేక సౌండ్ సిస్టమ్‌కు ఏ విధమైన రికార్డర్లనూ కనెక్ట్ చేయకూడదు, వాటిని ఇతరులకు ఆటంకం కలిగించకుండా ఉపయోగించాలి.
◼ సెంట్లు: కొన్ని సమావేశాలు కృత్రిమ వెంటిలేషన్ మాత్రమే ఉండే హాళ్లలో జరుగుతాయి. కాబట్టి శ్వాస సంబంధ సమస్యలు లేక తత్సంబంధిత సమస్యలు ఉన్నవారిపై ప్రతిచర్యచూపే ఘాటు సెంట్లను, అత్తర్లను పరిమితంగా వాడితే వారిపట్ల దయ చూపించినవారమవుతాం.—1 కొరిం. 10:24.
◼ ఫాలో అప్ ఫారమ్‌లు: సమావేశ సమయంలో మనం అనియత సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆసక్తి చూపించినవారి సమాచారం అందించడానికి ప్లీజ్ ఫాలో అప్ ఫారమ్ (S-43)ను ఉపయోగించాలి. ప్రచారకులు సమావేశానికి ఒకటి లేదా రెండు ఫాలో అప్ ఫారమ్‌లను తెచ్చుకోవాలి. ఆ ఫారమ్‌లు సమావేశ పుస్తక విభాగంలో కూడా లభిస్తాయి. పూర్తి చేయబడిన ఫారాలను పుస్తక విభాగానికి లేదా మీరు తిరిగివెళ్ళిన తర్వాత మీ సంఘ కార్యదర్శికి అందజేయండి.—మన రాజ్య పరిచర్య ఫిబ్రవరి 2005, 6వ పేజీ చూడండి.
◼ రెస్టారెంట్లు: చాలా ప్రాంతాల్లో లభ్యమవుతున్న సేవలనుబట్టి 10 నుండి 15 శాతం టిప్స్ ఇవ్వడం పరిపాటి.
◼ హోటళ్ళు: (1) అవసరమయ్యే దానికన్నా ఎక్కువ రూములు రిజర్వు చేసుకోకండి, మీ రూములో అనుమతించినవారికన్నా ఎక్కువమందిని ఉంచుకోకండి. (2) మీరు మీ రూమ్ రిజర్వేషన్‌ను రద్దు చేయాల్సివస్తే, దాని గురించి హోటల్ వారికి వెంటనే తెలియజేయండి. (3) మీరు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే లగేజి కార్ట్‌ను తీసుకోండి, ఇతరులు వాడేందుకు వీలుగా వెంటనే దానిని తిరిగి ఇచ్చేయండి. (4) వంట చేసేందుకు అనుమతిలేని రూములో వంట చేయకండి. (5) ప్రతీరోజు రూమ్ బాయ్స్‌కు టిప్స్ ఇవ్వండి. (6) అతిథులు హోటళ్ళో ఉన్నప్పుడు వారికి అందించే అల్పాహారం, కాఫీ లేక ఐస్‌లాంటి అదనపు ఏర్పాట్లను దుర్వినియోగం చేయకండి. (7) హోటల్ సిబ్బందితో వ్యవహరిస్తున్నప్పుడు అన్నిసమయాల్లో ఆత్మఫలాలను ప్రదర్శించండి. (8) టాక్స్ మినహాయించి రూమ్ అద్దె ఒక రోజుకు ఎంతవుతుందో సిఫారసు చేయబడిన హోటళ్ళ జాబితాలో ఇవ్వబడింది. మీరు కోరని లేదా ఉపయోగించని వాటి కోసం అదనంగా బిల్లు కట్టమని అడిగితే దానిని తిరస్కరించి, వీలైనంత త్వరగా రూమింగ్ విభాగానికి తెలియజేయండి. (9) మీ హోటల్ రూమ్‌కు సంబంధించి ఏదైనా సమస్య ఎదురైతే, సమావేశంవద్ద ఉన్నప్పుడే రూమింగ్ విభాగానికి తెలియజేయండి.