కొత్త శిష్యులను చేయడంలో అందరూ భాగం వహించవచ్చు
1 కొత్త శిష్యులు కేవలం ఒక వ్యక్తి కృషివల్లే తయారవరు. బైబిలు విద్యార్థులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించేలా సహాయం చేయడానికి యెహోవా తన ‘జత పనివారైన’ అందరినీ ఉపయోగించుకోవచ్చు. (1 కొరిం. 3:6-9) క్రైస్తవ కూటాల్లో మన హృదయపూర్వక వ్యాఖ్యానాల ద్వారానేకాక, దేవుని ఆత్మ మన జీవితాల్లో పనిచేస్తుందని గొప్పగా రుజువుచేసే మన మంచి ప్రవర్తనద్వారా కూడా వ్యక్తిగతంగా మనం కొత్తవారికి సహాయం చేస్తాం. (యోహా. 13:35; గల. 5:22; ఎఫె. 4:22, 23) కొత్తవారికి సహాయం చేయడానికి మనం ఇంకా ఏమి చేయవచ్చు?
2 సంఘంగా: కూటాలకు హాజరవడం ప్రారంభించినవారిని కూటానికి ముందు, తర్వాత ఆప్యాయంగా పలకరించడానికి, వారితో మాట్లాడడానికి చొరవ తీసుకోవడం ద్వారా మనందరం వారిపట్ల శ్రద్ధ కనబర్చవచ్చు. సంఘానికి మొదటిసారి హాజరైన రోజును గుర్తుచేసుకుంటూ ఒక వ్యక్తి ఇలా చెప్పాడు: “హృదయపూర్వకంగా ప్రేమించే ప్రజలను, పూర్తి అపరిచితులైన వారిని నేను ఒక్కరోజులోనే కలుసుకున్నాను, నేను చిన్నప్పటినుండి చర్చికి వెళుతున్నానుగానీ అలాంటి ప్రజలను ఎప్పుడూ కలుసుకోలేదు. నేను సత్యాన్ని కనుగొన్నానని నాకర్థమైంది.” ఆయన మొదటిసారిగా కూటానికి హాజరైన ఏడు నెలల తర్వాత బాప్తిస్మం తీసుకున్నాడు.
3 బైబిలు విద్యార్థి ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధిస్తుండగా మనస్ఫూర్తిగా మెచ్చుకోండి. ఆయన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడా? ఆయన క్రమంగా కూటాలకు హాజరవుతున్నాడా? ధైర్యం కూడగట్టుకొని వ్యాఖ్యానించాడా? దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో చేరాడా లేదా పరిచర్యలో భాగం వహించడం మొదలుపెట్టాడా? అయితే అలాంటి అభివృద్ధి సాధించినందుకు ఆయనను మెచ్చుకోండి. ఇలా చేయడం ఆయనకు ఉత్తేజాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది.—సామె. 25:11.
4 బైబిలు అధ్యయన నిర్వాహకులుగా: కొంతమంది ప్రచారకులు తమతోపాటు ఇతర ప్రచారకులను బైబిలు అధ్యయనానికి తీసుకువెళ్ళడం ద్వారా, బైబిలు విద్యార్థులు సంఘంలోని సభ్యులతో పరిచయం పెంచుకోవడానికి సహాయం చేయగలిగారు. వీలైనంత త్వరగా విద్యార్థిని సంఘ కూటాలకు ఆహ్వానించండి. ఆయన కూటాలకు హాజరవడం ప్రారంభించినప్పుడు, ఆయనను ఇతరులకు పరిచయం చేయండి. ఆయన పొగత్రాగడం వంటి ఏదైనా ఒక చెడు అలవాటును అధిగమించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడా? ఆయన ఇంట్లోవారెవరైనా ఆయన అధ్యయనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారా? ఆయన, అలాంటి సవాలునే ఎదుర్కొని, దానిని అధిగమించిన ప్రచారకునితో మాట్లాడడంద్వారా ప్రయోజనం పొందవచ్చు.—1 పేతు. 5:9.
5 కొత్తవారికి సంఘం నుండి ఆధ్యాత్మిక మద్దతు అవసరం. నిజమైన వ్యక్తిగత శ్రద్ధను చూపించడం ద్వారా వారు ప్రగతి సాధించడానికి అందరూ వారికి మద్దతునివ్వవచ్చు.