బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఉపయోగిస్తున్నప్పుడు గొప్ప బోధకుణ్ణి అనుకరించండి
1. యేసు ఎలా బోధించేవాడు?
1 గొప్ప బోధకుడైన యేసు విషయాలను ఎల్లప్పుడూ సరళంగా, స్పష్టంగా వివరించేవాడు. తను చెబుతున్నది వినేవారిని ఆలోచింపజేసేందుకు కొన్నిసార్లు ఆయన ముందుగా వారి అభిప్రాయాన్ని అడిగేవాడు. (మత్త. 17:24-27) ఆయన దేవుని వాక్యంవైపు అవధానాన్ని మళ్ళించేవాడు. (మత్త. 26:31; మార్కు 7:6) తన శిష్యులు భవిష్యత్తులో కూడా నేర్చుకుంటూనేవుంటారని యేసుకు తెలుసు కాబట్టి వారికి ఒకేసారి మరీ ఎక్కువ సమాచారం అందించకుండా శ్రద్ధ తీసుకున్నాడు. (యోహా. 16:12) యేసు తాను బోధించిన వాటిని తన శిష్యులు నమ్మారా, అర్థం చేసుకున్నారా అనే విషయాల్లో కూడా ఆసక్తి చూపించాడు. (మత్త. 13:51) బైబిలు బోధిస్తోంది పుస్తకం యేసు బోధించినట్లుగానే బోధించడానికి మనకు సహాయపడేందుకు రూపొందించబడింది.
2. ప్రతీ అధ్యాయంలోని ఉపోద్ఘాత ప్రశ్నలను మనం ఏయే విధాలుగా ఉపయోగించవచ్చు?
2 ఉపోద్ఘాత ప్రశ్నలు: మీరు ఒక అధ్యాయాన్ని ప్రారంభించినప్పుడు, శీర్షిక క్రిందవున్న ఉపోద్ఘాత ప్రశ్నలవైపుకు అవధానాన్ని మళ్ళించడం మంచిది. విద్యార్థిలో ఆసక్తి రేకెత్తించడానికి వారిని ఆలోచింపజేసేలా ప్రశ్నలు అడగవచ్చు. ఆ ప్రశ్నలకు క్లుప్తంగా జవాబులివ్వమని ఆయనను అడగవచ్చు. ఆయన చెప్పిన జవాబులను అంతగా చర్చించాల్సిన అవసరం లేదు లేదా ఆయన చెప్పిన ప్రతీ తప్పు వాక్యాన్ని సరిదిద్దవలసిన అవసరం లేదు. ఆయన తన అభిప్రాయాన్ని చెప్పినందుకు మీరు కృతజ్ఞతలు తెల్పి, సమాచారాన్ని పరిశీలించడం ప్రారంభించవచ్చు. ఉపోద్ఘాత ప్రశ్నలకు ఆయనిచ్చిన సమాధానాలు, అధ్యాయంలోని ఫలానా భాగానికి మీరు కాస్త ఎక్కువ అవధానం ఇవ్వాలో వద్దో తెలుసుకోవడానికి సహాయం చేస్తాయి.
3. విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా మనం అధ్యయనాన్ని ఎలా నిర్వహించవచ్చు?
3 లేఖనాలు: అధ్యయనం లేఖనాలమీద ఆధారపడివుండాలి. (హెబ్రీ. 4:12) అయితే ఉదాహరించబడిన లేఖనాలన్నీ చదవాల్సిన అవసరం లేదు. మన నమ్మకాలకు ఆధారాన్నిచ్చే లేఖనాలను నొక్కిచెప్పండి. నేపథ్య సమాచారాన్నిచ్చే లేఖనాలను చదవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. బైబిలు బోధిస్తోంది పుస్తకంలో సత్యం స్పష్టంగా, సరళంగా వివరించబడింది. అధ్యయనాన్ని విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా నిర్వహించండి. వివరాల గురించి ఎక్కువ మాట్లాడకుండా, చర్చకు అనవసరమైన సమాచారాన్ని ప్రస్తావించకుండా జాగ్రత్త వహించి, ముఖ్యాంశాలపై దృష్టి కేంద్రీకరించండి.
4. అనుబంధంలోని సమాచారాన్ని అధ్యయనమప్పుడు పరిశీలించాలో వద్దో ఎలా నిర్ణయించుకోవచ్చు?
4 అనుబంధం: అధ్యాయాల్లోని విషయాలకు అదనంగా 14 అంశాలు అనుబంధంలో ఇవ్వబడ్డాయి. ఈ అంశాలను అధ్యయనంలో చర్చిస్తామా లేదా అనేది ఐచ్ఛికం. కొన్ని విషయాలకు అదనంగా ఇవ్వబడిన సమాచారాన్ని వారినే చదువుకోమని, ముఖ్యంగా విద్యార్థికి అధ్యాయంలోని విషయం అర్థమై, దాన్ని అంగీకరిస్తున్నప్పుడు తననే స్వంతగా చదువుకోమని ప్రోత్సహించడానికి మీరు ఇష్టపడవచ్చు. ఉదాహరణకు, యేసే మెస్సీయ అని విద్యార్థి ఇప్పటికే నమ్ముతుంటే, “యేసుక్రీస్తు ఎవరు?” అనే 4వ అధ్యాయాన్ని చర్చిస్తున్నప్పుడు, “యేసుక్రీస్తు—వాగ్దానం చేయబడిన మెస్సీయ” అనే అంశం చర్చించవలసిన అవసరం ఉండకపోవచ్చు. వేరే సందర్భాల్లో, అధ్యయనం చేస్తున్నప్పుడే అనుబంధంలోని సమాచారాన్ని లేదా అందులో కొంతభాగాన్ని చర్చించడానికి సమయం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉండవచ్చు.
5. అనుబంధంలోని సమాచారాన్ని పరిశీలించాలని నిర్ణయించుకుంటే దానిని మనమెలా చేయవచ్చు?
5 అనుబంధంలోని సమాచారాన్ని చర్చించాలని నిర్ణయించుకుంటే, మీరు ముందుగానే ప్రశ్నలను తయారుచేసుకుని, అధ్యాయాన్ని చర్చిస్తున్నప్పుడు పేరాలను ఎలా చర్చిస్తారో అలాగే విద్యార్థితో చర్చించవచ్చు. లేదా, విద్యార్థి అవసరాలను బట్టి, అధ్యయనమప్పుడు ఆ సమాచారాన్ని పునఃపరిశీలన చేయడానికి కొన్ని నిమిషాలు వెచ్చించాలని నిర్ణయించుకోవచ్చు. అలా చేయడం విద్యార్థి సొంతగా చదివిన సమాచారాన్ని అర్థం చేసుకునేలా తోడ్పడడానికి మీకు సహాయం చేస్తుంది.
6. అధ్యయనం ముగింపులో పునఃపరిశీలన బాక్సును ఎలా ఉపయోగించవచ్చు?
6 పునఃపరిశీలన బాక్సు: ప్రతీ అధ్యాయం చివరనవున్న బాక్సులో, సాధారణంగా ఉపోద్ఘాత ప్రశ్నలకు జవాబులిచ్చే వ్యాఖ్యానాలు ఉంటాయి. అధ్యాయంలోని ముఖ్య విషయాలను పునఃపరిశీలన చేయడానికి మీరు ఈ వ్యాఖ్యానాలను ఉపయోగించవచ్చు. కొంతమంది ప్రచారకులు ప్రతీ వ్యాఖ్యానాన్ని, బహుశా దాని ప్రక్కన ఇవ్వబడిన లేఖనాలను విద్యార్థితో కలిసి చదవడం సహాయకరంగా ఉన్నట్లు కనుగొన్నారు. ఆ తర్వాత, ఆ లేఖనాలు వ్యాఖ్యానాన్ని ఎలా రుజువు చేస్తున్నాయో క్లుప్తంగా వివరించమని వారు విద్యార్థిని అడుగుతారు. అలా చేయడం, విద్యార్థి అధ్యాయంలోని ముఖ్య విషయాల్ని, బైబిలు వాటినెలా సమర్థిస్తుందో స్పష్టంగా అర్థం చేసుకున్నాడా లేదా, అతడు దానితో అంగీకరిస్తున్నాడా లేదా అనేది తెలుసుకోవడానికి అధ్యయన నిర్వాహకునికి దోహదపడుతుంది. అంతేకాక, అది ఇతరులకు సత్యాన్ని వివరించడానికి బైబిలును ఉపయోగించడంలో విద్యార్థికి శిక్షణనిస్తుంది.
7. మనకివ్వబడిన నియామకాన్ని నెరవేర్చడానికి బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని మనమెలా ఉపయోగించవచ్చు?
7 ప్రజలకు బోధించి, శిష్యులను చేయమని మనకివ్వబడిన నియామకాన్ని నెరవేర్చడానికి యేసు బోధనా పద్ధతులను అనుసరించడమే అత్యంత సమర్థవంతమైన విధానం. (మత్త. 28:19, 20) అలా చేయడానికి బైబిలు బోధిస్తోంది పుస్తకం మనకు సహాయం చేస్తుంది. ఇతరులకు సత్యాన్ని స్పష్టంగా, సరళంగా, ఆసక్తికరమైన రీతిలో బోధించడానికి దానిని చక్కగా ఉపయోగించండి.