మొదట్లో మీకున్న ప్రేమను కోల్పోకండి
1 మహిమాన్వితుడైన యేసు ఎఫెసులోవున్న మొదటి శతాబ్దపు సంఘానికి ఇలా ఉపదేశించాడు: “మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది.” (ప్రక. 2:4) అనేకులు యెహోవాపట్ల మొదట తమకున్న ప్రేమను కోల్పోయారని స్పష్టమవుతోంది. మనం సత్యం తెలుసుకుంటున్నప్పుడు, దేవునిపట్ల, పొరుగువారిపట్ల ప్రగాఢ ప్రేమను వృద్ధిచేసుకున్నాము, ఆ ప్రేమే మనం క్రొత్తగా కనుగొన్న నిరీక్షణను ఆసక్తితో ప్రకటించేలా మనలను పురికొల్పింది. మొదట మనకున్న ప్రేమను కోల్పోకుండా ఉండేందుకు, పరిచర్యలో ఆసక్తి సన్నగిల్లిపోకుండా కాపాడుకునేందుకు మనకేమి సహాయం చేస్తుంది?
2 వ్యక్తిగత అధ్యయనం, కూటాలకు హాజరవడం: మనం మొదటిసారిగా సత్యం తెలుసుకున్నప్పుడు దేవునిపట్ల, పొరుగువారిపట్ల ప్రేమను వృద్ధిచేసుకునేందుకు మనలను ఏది పురికొల్పింది? లేఖనాలను అధ్యయనం చేయడం ద్వారా యెహోవా గురించి మనం తెలుసుకున్న విషయాలే కాదా? (1 యోహా. 4:16, 19) కాబట్టి, మనప్రేమ ‘అంతకంతకు అభివృద్ధిచెందేలా,’ ‘దేవుని గురించిన లోతైన సంగతులను’ పరిశోధిస్తూ ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో కొనసాగాలి.—ఫిలి. 1:9-11; 1 కొరిం. 2:10, పవిత్రగ్రంథం వ్యాఖ్యాన సహితం.
3 ఎన్నో చింతలతో, అడ్డంకులతో నిండివున్న ఈ అంత్యదినాల్లో వ్యక్తిగత అధ్యయనాన్ని క్రమంగా కొనసాగించడం సవాలుగా ఉండగలదు. (2 తిమో. 3:1) మన పట్టికలో ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకోవడానికి సమయాన్ని కేటాయించాలి. క్రమంగా సంఘ కూటాలకు హాజరవడం కూడా ప్రాముఖ్యం, ప్రత్యేకంగా మనము “ఆ దినము సమీపించుట . . . చూచిన కొలది” అలా కూడుకోవడం మరింత ప్రాముఖ్యం.—హెబ్రీ. 10:24, 25.
4 పరిచర్య: పరిచర్యలో ఆసక్తిగా పాల్గొనడం దేవునిపట్ల మనకున్న మొదటి ప్రేమను కోల్పోకుండా ఉండడానికి సహాయం చేస్తుంది. మనం సువార్త ప్రకటిస్తుండగా, యెహోవాయొక్క ప్రేమపూర్వక వాగ్దానాలను మనకు మనమే గుర్తుచేసుకుంటాము, ఇది మన నిరీక్షణను ఉజ్జ్వలంగా ఉంచుకోవడానికి, మన ప్రేమను సజీవంగా కాపాడుకోవడానికి సహాయం చేస్తుంది. బైబిలు సత్యాలు బోధించాలంటే ముందు మనం వాటిని పరిశోధించి, స్పష్టంగా అర్థం చేసుకోవడం అవసరం, ఇలా చేయడం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది.—1 తిమో. 4:15, 16.
5 యెహోవా మన ప్రేమతో సహా సమస్తాన్ని పొందడానికి అర్హుడు. (ప్రక. 4:11) అందుకే మీ ప్రేమను తగ్గిపోయేందుకు అనుమతించకండి. వ్యక్తిగత బైబిలు అధ్యయనం ద్వారా, క్రమంగా కూటాలకు హాజరవడం ద్వారా, మీకు ఎంతో అమూల్యమైనదాన్ని ఆసక్తిగా ఇతరులకు ప్రకటించడం ద్వారా మీకున్న మొదటి ప్రేమను బలపరుచుకోండి.—రోమా. 10:10.