కాస్త ఆసక్తి చూపించిన వారందరినీ పునర్దర్శించండి
1 మనలో చాలామంది నేడు సత్యంలో ఉండడానికి కారణం ఎవరో ఒకరు రాజ్య సందేశంపట్ల మన అనుకూల ప్రతిస్పందనను గమనించి ఆ ఆసక్తిని వృద్ధిచేయడానికి ఓపికతో ఎన్నోసార్లు దర్శించారు. మనం కూడా, కాస్త ఆసక్తి చూపించిన వారందరినీ మనస్సాక్షిపూర్వకంగా పునర్దర్శించాలి. అవును, ‘శిష్యులను చేయమని’ మనకివ్వబడిన నియామకంలో పునర్దర్శనాలు చేయడం కూడా ఇమిడివుంది.—మత్త. 28:19, 20.
2 ఆసక్తిని గమనించండి: ఒక వ్యక్తి సాహిత్యాన్ని తీసుకోకపోయినా, అతని ముఖ భావాలు, స్వరం, ఉపయోగించిన పదాలు రాజ్యసందేశంపట్ల కొంత ఆసక్తి ఉందని వ్యక్తం చేయవచ్చు. దాని ఆధారంగా మనం పునర్దర్శించవచ్చు. ఒక సహోదరుడు ఒక వ్యక్తికి ఏ సాహిత్యాలూ ఇవ్వకుండా క్రమంగా ఐదు వారాలపాటు పునర్దర్శించాడు. ఆరవ వారం ఆ వ్యక్తి సాహిత్యాన్ని తీసుకున్నాడు, చివరకు బైబిలు అధ్యయనం ప్రారంభించబడింది.
3 ఆసక్తి ఉన్నట్లు మీకనిపిస్తే, బహుశా కొద్దిరోజుల తర్వాత, తప్పక దర్శించండి. ఆ వ్యక్తి మనసులో మీరు నాటిన విత్తనాన్ని “దుష్టుడు” ఎత్తుకొనిపోయే అవకాశాన్నివ్వకండి. (మత్త. 13:19) మీరు ఒక నిర్దిష్ట సమయానికి వస్తామని చెబితే మీ మాటకు కట్టుబడి ఉండండి.—మత్త. 5:37.
4 వీధిలో: వీధిలో లేదా అనియతంగా సాక్ష్యమిస్తున్నప్పుడు కనుగొన్న ఆసక్తిని వృద్ధి చేయడానికి మీరు ప్రయత్నిస్తారా? మీ సంభాషణ ముగింపులో మీరిలా అనవచ్చు: “మీతో మాట్లాడడం నాకు చాలా సంతోషం కలిగించింది. మళ్లీ మీతో మాట్లాడేందుకు నన్నెక్కడికి రమ్మంటారు?” పరిస్థితిని బట్టి కొంతమంది ప్రచారకులు ఆసక్తిగలవారికి తమ ఫోను నంబరు ఇవ్వాలనుకోవచ్చు, లేదా వారి ఫోను నంబరును అడిగి తీసుకోవాలనుకోవచ్చు. ప్రజలు మిమ్మల్ని అదే ప్రాంతంలో తరచూ వీధి సాక్ష్యమివ్వడాన్ని గమనిస్తే, వారు తమ ఫోను నంబరును, లేదా అడ్రస్‌ను ఇవ్వడానికి అభ్యంతరపడకపోవచ్చు. ఒకవేళ మీరు వారినెలా కలుసుకోవాలో చెప్పడానికి వారు ఇష్టపడకపోయినా, మరోసారి వారిని అదే వీధిలో కలిసినప్పుడు వారి ఆసక్తిని వృద్ధిచేయడానికి ప్రయత్నించవచ్చు.
5 మనం నీరు పోసి, పోషిస్తున్న మొక్కలు పెరగడాన్ని చూడడం మనకు ఆనందాన్నిస్తుంది. పునర్దర్శనాలు చేయడంద్వారా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించేలా ప్రజలకు సహాయం చేయడంద్వారా మనం కూడా అలాంటి ఆనందాన్నే పొందవచ్చు. (1 కొరిం. 3:6) కాస్త ఆసక్తి చూపించిన వారందరినీ పునర్దర్శించడాన్ని మీ లక్ష్యంగా పెట్టుకోండి.