దేవుని స్నేహితులు కావడానికి ఇతరులకు సహాయం చేయండి
1 నేడు, అన్ని జనాంగాలవారు యెహోవా మార్గాల గురించి బోధించబడుతున్నారు. (యెష. 2:2, 3) వారు ‘ఓపికతో ఫలించాలంటే’ యెహోవాను ప్రేమించాలి. (లూకా 8:15; మార్కు 12:30) అలా ప్రేమించకపోతే హానికరమైన ప్రభావాలను నిరోధించడానికి కావాల్సిన శక్తి లేదా సరైనది చేయడానికి కావాల్సిన ధైర్యం వారికి ఉండదు. ఇతరులు యెహోవాతో మంచి సంబంధాన్ని వృద్ధి చేసుకోవడానికి మనం సహాయం చేసే ఒక మార్గమేమిటంటే ఆయన లక్షణాలపట్ల వారిలో ప్రేమను పెంపొందించడం. యెహోవాకు సన్నిహితమవండి పుస్తకంలోని సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించమని వారిని ప్రోత్సహించండి.
2 మీ మాదిరి: మీరు చేసే పనులు బైబిలు విద్యార్థుల హృదయాలమీద బలమైన ప్రభావాన్ని చూపించగలవు. యెహోవాతో మీకున్న స్నేహాన్ని మీరు విలువైనదిగా ఎంచడాన్ని, అది మీ జీవితంమీద చూపించే ప్రభావాన్ని బైబిలు విద్యార్థులు చూసినప్పుడు వారు అలాంటి వ్యక్తిగత సంబంధాన్ని స్వయంగా పెంపొందించుకొనేలా పురికొల్పబడవచ్చు. (లూకా 6:40) నిజమే, మనం చెప్పేదానికన్నా మనముంచే మాదిరి తరచూ ఇతరులమీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.
3 పిల్లలు యెహోవాను ప్రేమించడాన్ని తల్లిదండ్రులు ఎక్కువగా తమ మాదిరి ద్వారానే నేర్పిస్తారు. (ద్వితీ. 6:4-9) తమ పిల్లల్ని సత్యంలో పెంచాలనుకుంటున్న ఒక జంట, పిల్లల్ని పెంచడంలో విజయం సాధించిన తల్లిదండ్రుల సలహా అడిగారు. “నేను మాట్లాడిన వారందరూ తల్లిదండ్రులు ఉంచే మాదిరి ప్రాముఖ్యమైనదని అన్నారు” అని ఆ భర్త తెలియజేశాడు. ఆ విధంగా తల్లిదండ్రులు ‘దేవుని స్నేహితులుగా’ ఉండడమంటే ఏమిటి అనే విషయంలో తమ పూర్తి జీవిత విధానం ద్వారా పిల్లలకు మాదిరులుగా ఉండగలరు.—యాకో. 2:23.
4 హృదయపూర్వక ప్రార్థన: హృదయపూర్వకంగా ప్రార్థించమని బోధించడం ద్వారా కూడా యెహోవాతో స్నేహాన్ని పెంపొందించుకోవడానికి ఇతరులకు మీరు సహాయం చేయవచ్చు. యేసు చేసిన మాదిరి ప్రార్థనను అలాగే బైబిల్లో నమోదు చేయబడిన అనేక హృదయపూర్వక ప్రార్థనలను వారికి చూపించవచ్చు. (మత్త. 6:9, 10) మీ సొంత ప్రార్థనల ద్వారా ప్రార్థించడమెలాగో మీ పిల్లలకు అలాగే బైబిలు విద్యార్థులకు నేర్పించవచ్చు. మీరు హృదయపూర్వకంగా వ్యక్తంచేసే భావాలను వారు విన్నప్పుడు యెహోవాపట్ల మీకున్న భావాలను గుర్తిస్తారు. శోధనలను ఎదుర్కొన్నప్పడు ‘ప్రార్థనయందు పట్టుదల కలిగివుండమని’ వారిని ప్రోత్సహించండి. (రోమా. 12:12) వారు కష్టకాలాల్లో యెహోవా సహాయాన్ని చవిచూసినప్పుడు ఆయనమీద నమ్మకముంచుతూ, ఆయనను నిజమైన స్నేహితునిగా ప్రేమించడం మొదలుపెడతారు.—కీర్త. 34:8; ఫిలి. 4:6, 7.