మీరు దేనికి ప్రథమస్థానం ఇస్తున్నారు?
1 ఆ ప్రశ్నకు మీరెలా జవాబిస్తారు? నిజానికి మనందరం రాజ్య సంబంధ విషయాలను మొదట ఉంచాలని కోరుకుంటాం. (మత్త. 6:33) ‘నేను తీసుకునే నిర్ణయాలు రాజ్య సంబంధ విషయాలకు ప్రథమస్థానం ఇస్తున్నానని చూపిస్తున్నాయా?’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు. “మిమ్మును మీరే పరీక్షించుకొనుడి” అని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది. (2 కొరిం. 13:5) రాజ్యానికి ప్రథమస్థానమిస్తున్నామో లేదో మనమెలా పరీక్షించుకోవచ్చు?
2 మన సమయాన్ని వెచ్చిస్తున్న విధం: మన సమయాన్ని ఎలా వెచ్చించాలనుకుంటున్నామో పరిశీలించడం ద్వారా ప్రారంభించవచ్చు. (ఎఫె. 5:15, 16) ప్రతీవారం ఇతరులను కలిసేందుకు, టీవీ చూసేందుకు, ఇంటర్నెట్ను ఉపయోగించేందుకు లేదా మన అభిరుచుల కోసం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాము? అలాంటి వాటికి మనం వెచ్చించే సమయాన్ని వ్రాసిపెట్టుకొని దానిని ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో వెచ్చించే సమయంతో పోలిస్తే మనమే ఆశ్చర్యపోవచ్చు. కేవలం సుఖజీవితాన్ని పొందడానికి పరిశుద్ధ సేవను నిర్లక్ష్యం చేస్తూ, పనిలో ఎక్కువ గంటలు వెచ్చిస్తున్నామా? ఉల్లాస కార్యకలాపాలకు సంబంధించిన వారాంతాల ప్రయాణాల కోసం మనం ఎంత తరచుగా కూటాలను, పరిచర్యను మానేస్తున్నాము?
3 ప్రాధాన్యతలను ఏర్పరచుకోండి: మనం అనుకున్నవన్నీ చేయడానికి తగినంత సమయం మనలో చాలామందికి లేదు. రాజ్య సంబంధ విషయాలకు ప్రథమస్థానం ఇవ్వాలంటే మనం మన ప్రాధాన్యతలేమిటో నిర్ణయించుకొని, “శ్రేష్ఠమైన కార్యముల” కోసం సమయ పట్టికను తయారుచేసుకోవాలి. (ఫిలి. 1:9) ఆ కార్యాల్లో దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం, పరిచర్యలో పాల్గొనడం, కుటుంబంపట్ల శ్రద్ధ కనపర్చడం, కూటాలకు హాజరవడం ఇమిడివున్నాయి. (కీర్త. 1:1, 2; రోమా. 10:13, 14; 1 తిమో. 5:8; హెబ్రీ. 10:24, 25) ఆరోగ్యదాయకమైన ఉల్లాస కార్యకలాపాలు, మితవ్యాయామం వంటి ఇతర కార్యకలాపాలు ప్రయోజనకరమైనవే. (మార్కు 6:31; 1 తిమో. 4:8) అయితే, అంతగా ప్రాముఖ్యంకాని ఆ కార్యకలాపాలు రాజ్య సంబంధ విషయాలను మరుగుపర్చేవిగా ఉండకూడదు.
4 ఒక యువ సహోదరుడు ఉద్యోగం సంపాదించుకునేందుకు ఉన్నత విద్యను అభ్యసించే బదులు పూర్తికాల పరిచర్యను ప్రారంభించడంద్వారా రాజ్య సంబంధ విషయాలకు ప్రథమస్థానం ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఆయన మరో భాషను నేర్చుకొని ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్నచోట సేవ చేయడానికి వేరే ప్రాంతానికి వెళ్లాడు. ఆ సహోదరుడు ఇలా అన్నాడు: “నేను ఇక్కడ జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నాను. పరిచర్య ఎంతో ఉత్తేజపర్చేదిగా ఉంది! యౌవనులందరూ నేను తీసుకున్న చర్యనే తీసుకొని నేను పొందుతున్న అనుభూతినే పొందాలని ఆశిస్తున్నాను. మనకున్న వాటన్నింటితో యెహోవాను సేవించడంకన్నా శ్రేష్ఠమైనది మరొకటి లేదు.” అవును, రాజ్యానికి ప్రథమస్థానం ఇవ్వడం మనకు ఆశీర్వాదాలను తెస్తుంది, అంతకన్నా ప్రాముఖ్యంగా అది మన పరలోక తండ్రియైన యెహోవాను సంతోషపరుస్తుంది.—హెబ్రీ. 6:10.