ఆధ్యాత్మిక అలవాట్లను పెంపొందించుకోండి, విస్తారమైన ఆశీర్వాదాలను పొందండి
1. మీ ఆధ్యాత్మిక దినచర్యను పరిశీలించుకోవడం ఎందుకు ప్రయోజనకరం?
1 మీరు క్రైస్తవులుగా మారిన ఆరంభంలో, బైబిలు అధ్యయనం, క్రైస్తవ కూటాలు, క్షేత్ర పరిచర్య, ప్రార్థనవంటి మంచి ఆధ్యాత్మిక దినచర్యను అలవర్చుకోవడానికి ఎంతో ప్రయత్నించివుండవచ్చు. మీ ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదించడంవల్ల మీరు ఆధ్యాత్మికంగా ఎదిగారు. బహుశా, మీరు బాప్తిస్మం తీసుకొని కొన్ని సంవత్సరాలు గడిచివుండవచ్చు. మీరు క్రైస్తవులుగా మారుతున్నకొద్దీ మీరు అలవర్చుకున్న మంచి ఆధ్యాత్మిక అలవాట్లను కాపాడుకుంటున్నారా?
2. ప్రతిదినం బైబిలు చదవడంవల్ల మనమెలా ప్రయోజనం పొందుతాం?
2 మీ ఆధ్యాత్మిక దినచర్యను జాగ్రత్తగా పరిశీలించండి: ప్రతీరోజు దేవుని వాక్యంలోని కొంతభాగాన్ని చదివే అలవాటు మీకు ఉందా? మనమలా చేయడం ద్వారా ఎంత గొప్ప ఆశీర్వాదాలను అనుభవిస్తామో కదా! (యెహో. 1:8; కీర్త. 1:2, 3) ప్రాచీన ఇశ్రాయేలులో, ప్రతీ రాజు “తాను బ్రదుకు దినములన్నిటను” తన ధర్మశాస్తపు ప్రతిని చదవాలి. అలా చదవడంవల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? యెహోవా ఆజ్ఞలనుండి వైదొలగకుండా ఉండే విధంగా రాజు వినయ హృదయాన్ని అలవర్చుకుని ఆయనపట్ల భయభక్తులతో ఉండడం నేర్చుకుంటాడు. (ద్వితీ. 17:18-20) నేడు కూడా, ప్రతీరోజు బైబిలు చదవడం చెడిపోయిన ఈ దుష్ట లోకంలో, నిరపరాధులుగా, నిష్కళంకులుగా ఉండడానికి మనకు సహాయం చేస్తుంది. అది పరిచర్యకు పూర్తిగా సన్నద్ధులవ్వడానికి కూడా సహాయం చేస్తుంది.—ఫిలి. 2:14; 2 తిమో. 3:16.
3. క్రమంగా కూటాలకు హాజరవడంవల్ల మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం?
3 యేసుకు లేఖనాలు చర్చించబడే సమాజమందిరానికి వెళ్లే అలవాటు ఉండేది. (లూకా 4:16) అలా వెళ్ళడం ఆయన అనుభవించబోయే శోధనలను ఎదుర్కోవడానికి ఆయనను బలపర్చిందనడంలో సందేహం లేదు. సంఘ కూటాల్లో ఇవ్వబడే ఆధ్యాత్మిక ఉపదేశంవల్ల, ‘ఒకరినుండి ఒకరం పొందే’ మంచి ‘ఆదరణవల్ల’ మనం కూడా బలపర్చబడతాం. (రోమా. 1:11) మన సహోదరులతో కలిసి సమాజముగా కూడుకోవడం ఈ అంత్యదినాల్లో మనం ఎదుర్కొనే కష్టాలను సహించడానికి సహాయం చేస్తుంది. (హెబ్రీ. 10:24, 25) అన్ని కూటాలకు హాజరవడం ఇప్పటికీ మీ అలవాటుగానే ఉందా?
4. ప్రతివారం ప్రకటనా పనిలో భాగం వహించడంవల్ల మనకెలాంటి ప్రయోజనం చేకూరుతుంది?
4 అపొస్తలులు “ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను” సువార్తను ప్రకటించడంలో భాగం వహించారని ప్రేరేపిత బైబిలు వృత్తాంతాలు తెలియజేస్తున్నాయి. (అపొ. 5:42) మనం ప్రతిదినం ప్రకటించలేకపోవచ్చు, కనీసం ప్రతీ వారం ఏదో ఒక రకమైన పరిచర్యలో పాల్గొనే అలవాటు చేసుకోగలమా? అలా అలవాటు చేసుకోవడం ద్వారా దేవుని వాక్యాన్ని ఉపయోగించడంలో మనం తప్పక మరింత నైపుణ్యాన్ని సాధిస్తాం, బైబిలు సత్యాలను ఇతరులతో పంచుకొనేటప్పుడు మనం ప్రోత్సాహకరమైన అనుభవాలను చవిచూస్తాం.
5. యెహోవాకు క్రమంగా ప్రార్థించడం ఎందుకు చాలా ప్రాముఖ్యం?
5 ప్రవక్త అయిన దానియేలు తన జీవితాంతం యెహోవాను “నిత్యము” సేవించడంవల్ల విస్తారంగా ఆశీర్వదించబడ్డాడు. అలా సేవించడంలో యెహోవాకు క్రమంగా ప్రార్థించే అలవాటు ఇమిడివుంది. (దాని. 6:10, 16, 20) అదేవిధంగా, మనం క్రమంగా యెహోవాకు హృదయపూర్వక ప్రార్థన చేసినప్పుడు, ఆయన మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. (లూకా 11:9-13) అంతేకాక, యెహోవా తనతో సన్నిహిత సంబంధాన్ని ఆనందించేలా మనకు సన్నిహితమవుతాడు. (కీర్త. 25:14; యాకో. 4:8) అది ఎంత గొప్ప ఆశీర్వాదమో కదా! కాబట్టి, మంచి ఆధ్యాత్మిక అలవాట్లను కాపాడుకొని యెహోవా నుండి గొప్ప ఆశీర్వాదాలను పొందడానికి మనం కృషిచేద్దాం.