విశ్వసనీయంగా ఉండడంలో వారు మంచి మాదిరిని ఉంచారు
1 ప్రత్యేక పయినీరు కార్యక్రమం అనే క్రొత్త రకమైన పూర్తికాల పరిచర్య 1937లో ప్రారంభమైంది. క్రైస్తవ పరిచర్యలో అనుభవమున్న సామర్థ్యంగల స్త్రీపురుషులు, సంస్థ తమను ఎక్కడ నియమిస్తే అక్కడ సేవచేయడానికి సుముఖత చూపించారు. నేడు, దశాబ్దాల తర్వాత, ప్రత్యేక పయినీర్లు ఇప్పటికీ విశ్వసనీయత విషయంలో మనం అనుకరించదగ్గ మాదిరిని ఉంచుతున్నారు.—హెబ్రీ. 6:11.
2 వారు నాయకత్వం వహించారు: ప్రారంభంలో, గృహస్థుని గుమ్మంవద్ద పోర్టబుల్ ఫోనోగ్రాఫ్ను ఉపయోగించడం ద్వారా ప్రకటనా పనిని ముందుకు తీసుకెళ్ళారు. పునర్దర్శనాలలో బైబిలు చర్చలు చేయడానికి రికార్డింగులను కూడా ఉపయోగించేవారు. అప్పటికే సంఘాలు స్థాపించబడిన పెద్ద పట్టణాల్లో వాటిని ఉపయోగించేవారు. ఆ తర్వాత, ప్రత్యేక పయినీర్లు, రాజ్యప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు పంపించబడ్డారు. ఆసక్తి చూపించినవారినందరినీ కలిసి వారితో బైబిలు అధ్యయనాలను నిర్వహించేవారు. వారు చేసిన యథార్థ ప్రయత్నాలవల్ల, వందలాది క్రొత్త సంఘాలు స్థాపించబడ్డాయి. వారలా నిర్విరామంగా సువార్త ప్రకటించినందుకే నేడు మనం, ఎంతగానో విస్తరించిన సంస్థను చూస్తున్నాం. (యెష. 60:22) “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి” సువార్తను వ్యాప్తి చేయడంలో ప్రత్యేక పయినీర్లు ఇప్పటికీ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.—కొలొ. 1:23.
3 అనుకరించదగినవారు: కొంతమంది ప్రత్యేక పయినీర్లు దశాబ్దాలుగా పూర్తికాలసేవ చేస్తున్నారు. గడిచిన సంవత్సరాల్లో వివిధ పరిస్థితుల్లో ఈ నమ్మకమైన స్త్రీపురుషుల విశ్వాసం శుద్ధిచేయబడింది. (1 పేతు. 1:6, 7) ప్రత్యేక అవసరం ఉన్న ప్రాంతాల్లో సేవచేయడానికి వారు వస్తుసంబంధమైన సౌకర్యాలను త్యాగం చేయడానికి కూడా ఇష్టపడ్డారు. వారిలో కొందరు ఇప్పుడు అనారోగ్యంతోవున్న వృద్ధులుగా ఉన్నారు, లేదా ఇతర సవాళ్లను ఎదుర్కొంటున్నారు. (2 కొరిం. 4:16, 17) ఇండియాలో ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులవల్ల వారిలో చాలామంది తాము విలువైనదిగా ఎంచుకున్న సేవాధిక్యతను వదులుకోవాల్సి వచ్చింది. అయినా, వారు “ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు.” (కీర్త. 92:15) వారు యెహోవాపై తమ నమ్మకముంచి ఆయన ఆశీర్వాదాన్ని పొందుతారు.—కీర్త. 34:8; సామె. 10:22.
4 ప్రత్యేక పయినీర్లు మన ప్రేమపూర్వక ప్రశంసను పొందేందుకు ఖచ్చితంగా అర్హులు. మీకొకవేళ ప్రత్యేక పయినీర్లతో సహవసించే ఆధిక్యత లభిస్తే లేదా గతంలో ప్రత్యేక పయినీర్లుగా సేవ చేసినవారు మీ సంఘానికి నియమించబడితే, వారితో సమయం గడిపి వారి అనుభవం నుండి ప్రయోజనం పొందేందుకు మీకు ఉన్న అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. నమ్మకమైన రాజ్యప్రచారకులుగా వారు చేసిన సేవకు కృతజ్ఞత చూపించండి. వారి విశ్వసనీయత నుండి ప్రోత్సాహాన్ని పొందండి. వారి విశ్వాసాన్ని అనుకరించేవారందరూ వారిలాగే యెహోవా అనుగ్రహాన్ని, ఆశీర్వాదాలను పొందుతారు. ఎందుకంటే, నమ్మకస్థులు లేక “సత్యవర్తనులు ఆయనకిష్టులు.”—సామె. 12:22.