‘సంతోషంగా ఉండే మన దేవుడైన’ యెహోవాను అనుకరించండి
1 ప్రజలు సంతోషంగా ఉండాలని యెహోవా నిజంగా కోరుకుంటున్నాడు. ఆయన వాక్యం మానవజాతి కోసం తాను సిద్ధం చేసిన అద్భుతమైన ఆశీర్వాదాలను ఉత్సాహంతో ఎదురు చూసేలా చేస్తుంది. (యెష. 65:21-25) ‘సంతోషంగా ఉండే దేవుని మహిమగల సువార్తను’ వారికి ప్రకటించడంలో మనం ఆనందం పొందుతున్నట్లు ఇతరులకు కనిపించాలి. (1 తిమో. 1:11) రాజ్యసందేశం గురించి మనం మాట్లాడే విధానం సత్యంపట్ల మనకున్న ప్రేమను, మనం మాట్లాడే ప్రజలపట్ల మనకున్న నిజమైన ఆసక్తిని ప్రతిబింబించాలి.—రోమా. 1:14-16.
2 నిజమే, కొన్నిసార్లు సంతోషభరిత దృక్పథాన్ని కాపాడుకోవడం చాలా కష్టంగా ఉండవచ్చు. కొన్ని క్షేత్రాల్లో, రాజ్యసందేశానికి కొంతమందే అనుకూలంగా ప్రతిస్పందిస్తున్నట్లు మనం గమనిస్తాం. మన సొంత జీవితంలోనే గడ్డుపరిస్థితులను ఎదుర్కొనే సమయాలు ఉండవచ్చు. సంతోషభరిత స్ఫూర్తిని కాపాడుకోవడానికి, మన క్షేత్రంలోని ప్రజలు మనం ప్రకటించే సువార్తను విని, దాన్ని అర్థం చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమో ధ్యానించాలి. (రోమా. 10:13, 14, 17) దాని గురించి ధ్యానించడం యెహోవా కనికరంతో రక్షణకోసం చేసిన ఏర్పాట్లను సంతోషంగా తెలియజేస్తూ ఉండడానికి మనకు సహాయం చేస్తుంది.
3 సానుకూల విషయాల గురించి మాట్లాడండి: మనం మాట్లాడే విషయాలకు కూడా అవధానమివ్వాలి. ప్రజలకు తెలిసిన సమస్యను లేదా వార్తను చెప్పి మనం చర్చను ప్రారంభించినా, ప్రతికూల విషయాల గురించి అనవసరంగా చర్చించడం మానుకోవాలి. మనకు “సువర్తమానము” ప్రకటించడమనే ఆజ్ఞ ఇవ్వబడింది. (యెష. 52:7; రోమా. 10:15) ఈ సువార్త అనేది ఉజ్జ్వల భవిష్యత్తు గురించిన దేవుని వాగ్దానాలమీద ఆధారపడిన సందేశం. (2 పేతు. 3:13) దీన్ని మనసులో ఉంచుకొని, “నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకు” లేఖనాలను ఉపయోగించండి. (యెష. 61:1, 2) అలా ఉపయోగించడం మనలో ప్రతీ ఒక్కరం సంతోషభరిత స్ఫూర్తిని, అనుకూల దృక్పథాన్ని కాపాడుకోవడానికి సహాయం చేస్తుంది.
4 మనం ప్రకటనా పనిలో భాగం వహిస్తున్నప్పుడు ప్రజలు ఖచ్చితంగా మన సంతోషభరిత దృక్పథాన్ని గమనిస్తారు. కాబట్టి, మన క్షేత్రంలోవున్న ప్రజలకు రాజ్యసువార్తను ప్రకటిస్తున్నప్పుడు ‘సంతోషంగా ఉండే మన దేవుడైన’ యెహోవా దృక్పథాన్ని మనం ఎల్లప్పుడూ ప్రతిబింబిద్దాం.