యెహోవా సాటిలేని లక్షణాలపట్ల కృతజ్ఞతను పెంపొందించండి
1 పరిచర్యలో మనం ఇతరులకు ప్రాథమిక బైబిలు సత్యాలను మాత్రమే బోధించం. మనం ప్రజలకు యెహోవా వ్యక్తిత్వాన్ని తెలుసుకొనేలా, ఆయన సాటిలేని లక్షణాలపట్ల కృతజ్ఞతను పెంపొందించుకునేందుకు సహాయం చేస్తాం. యథార్థహృదయులు దేవుని గురించిన సత్యం తెలుసుకున్నప్పుడు అది వారిపై ఎంతో ప్రభావం చూపించి ‘అన్ని విషయములలో యెహోవాను సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకునేందుకు’ తమ జీవితంలో మార్పులు చేసుకోవడానికి వారిని పురికొల్పుతుంది.—కొలొ. 1:9, 10; 3:9, 10.
2 మన క్రొత్త అధ్యయన సహాయకం: బైబిలు బోధిస్తోంది పుస్తకం, ప్రారంభం నుండే యెహోవా లక్షణాల గురించి వివరిస్తుంది. మొదటి అధ్యాయంలోనే దేవునికి నిజంగా మీ పట్ల శ్రద్ధ ఉందా?, దేవుడు ఎలా ఉంటాడు?, దేవునికి సన్నిహితమవడం సాధ్యమేనా? వంటి ప్రశ్నలకు సమాధానాలున్నాయి. అదే అధ్యాయం యెహోవా పరిశుద్ధతను (10వ పేరా), ఆయన న్యాయాన్ని, కనికరాన్ని (11వ పేరా), ఆయన ప్రేమను (13వ పేరా), ఆయన శక్తిని (16వ పేరా), ఆయన కరుణను, దయను, క్షమించడానికి సిద్ధంగా ఉండడాన్ని, సహనాన్ని, విశ్వసనీయతను (19వ పేరా) నొక్కిచెబుతోంది. 20వ పేరా సారాంశంగా ఇలా చెబుతోంది: “యెహోవా గురించి మీరెంత ఎక్కువగా తెలుసుకుంటే, ఆయన మీకు అంత ఎక్కువగా వాస్తవమైనవాడిగా ఉంటాడు, అంతేగాక ఆయనను ప్రేమించడానికి, ఆయనకు సన్నిహితమవడానికి మీకు మరింత బలమైన కారణం ఉంటుంది.”
3 బైబిలు విద్యార్థులు యెహోవాకు సన్నిహితమవడానికి మనం బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఎలా ఉపయోగించవచ్చు? యెహోవా లక్షణాలను పేర్కొంటున్న పేరాను చర్చించిన తర్వాత, “ఈ పేరాలో యెహోవా వ్యక్తిత్వం గురించి మీరేమి తెలుసుకున్నారు? లేదా “దేవునికి వ్యక్తిగతంగా మీపట్ల శ్రద్ధ ఉందని ఇది ఎలా చూపిస్తుంది?” వంటి ప్రశ్నలను మీరు విద్యార్థిని అడగవచ్చు. అధ్యయనం జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడూ అలాంటి ప్రశ్నలు వేయడం ద్వారా బైబిలు విద్యార్థులకు తాము నేర్చుకుంటున్నవాటిని ఎలా ధ్యానించాలో నేర్పిస్తాం, యెహోవా సాటిలేని లక్షణాలపట్ల కృతజ్ఞతను పెంపొందించుకోవడానికి వారికి సహాయం చేస్తాం.
4 పునఃసమీక్ష బాక్సును ఉపయోగించండి: ప్రతీ అధ్యాయం చివర్లో, “బైబిలు ఈ విషయాలను బోధిస్తోంది” అనే బాక్సులోని ప్రతీ అంశం గురించి తన సొంత మాటల్లో వ్యాఖ్యానించమని విద్యార్థిని ఆహ్వానించండి. ఉల్లేఖించబడిన లేఖనాలపై అవధానం మళ్ళించండి. విద్యార్థి హృదయంలో ఉన్న విషయాన్ని రాబట్టేందుకు మీరు కొన్నిసార్లు ఇలా అడగవచ్చు, “ఈ అంశంపై బైబిలు బోధిస్తున్నదాని గురించి మీ అభిప్రాయం ఏమిటి?” అలా అడగడం ద్వారా, మీరు అధ్యాయంలోని ముఖ్యాంశాలను కేవలం నొక్కి చెప్పడమేకాక, విద్యార్థి నిజంగా ఏమి నమ్ముతున్నాడు అనేది కూడా స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ఆ విధంగా చేయడం విద్యార్థి యెహోవాతో మంచి సంబంధాన్ని పెంపొందించుకునేందుకు సహాయం చేస్తుంది.