దయతో వ్యవహరించడం ద్వారా—వ్యక్తిగత ఆసక్తి చూపించండి
1 “యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు.” (కీర్త. 145:8) ఆయన విశ్వ సర్వాధిపతి అయినప్పటికీ, అపరిపూర్ణ మానవులతో వ్యవహరిస్తున్నప్పుడు ఆయన వారి పరిస్థితులు పరిగణలోకి తీసుకుని, దయతో, గౌరవపూర్వకంగా వ్యవహరిస్తాడు. (ఆది. 13:14; 19:18-21, 29) దయాళుడైన మన దేవుణ్ణి అనుకరించడం ద్వారా మనం రాజ్య సువార్తను మరింత మెరుగైన రీతిలో అందించగలుగుతాం. (కొలొ. 4:6) అలా చేయడంలో, కేవలం సభ్యతతో వ్యవహరించడం, గౌరవపూర్వకంగా సంభాషించడంకన్నా ఎక్కువే ఇమిడివుంది.
2 ఇంటింటి పరిచర్యలో: గృహస్థులకు అనుకూలించని సమయంలో, లేదా మనతో మాట్లాడడానికి తీరికే లేని సమయంలో మనం వారిని సందర్శిస్తే అప్పుడేమి చేయాలి? సరైన సమయంలో వెళ్లలేదనే విషయాన్ని గ్రహించి మన ప్రతిపాదనను సంక్షిప్తంగా అందించవచ్చు లేదా మరో సమయంలో వస్తామని చెప్పవచ్చు. మన సాహిత్యాలను తీసుకోవడానికి నిరాకరించిన వారిపట్ల దయతో వ్యవహరించి వారిని బలవంతపెట్టకుండా ఉంటాం. ఇతరులపట్ల మనకుండే శ్రద్ధ, వారికి సంబంధించిన వస్తువులపట్ల గౌరవం చూపించడానికి అంటే గేటు లేదా తలుపు మూయడంలాంటివి చేస్తూ, మన పిల్లలు కూడా అలాగే చేసేందుకు వారికి శిక్షణనివ్వడానికి పురికొల్పుతుంది. ఇంట్లోలేనివారి ఇంటివద్ద సాహిత్యాలు విడిచిపెడుతున్నప్పుడు అవి దార్లో వెళ్లేవారికి కనిపించని చోట పెట్టేందుకు మనం జాగ్రత్త తీసుకోవాలి. అవును, ఇతరులు మనపట్ల ఎలా వ్యవహరించాలని కోరుకుంటామో మనమూ వారిపట్ల అలాగే వ్యవహరించేందుకు దయాగుణం మనల్ని పురికొల్పుతుంది.—లూకా 6:31.
3 వీధిసాక్ష్యమిస్తున్నప్పుడు: మనం వీధిసాక్ష్యంలో పాల్గొంటున్నప్పుడు, పాదచారులు నడిచే మార్గానికి అడ్డుగా నిలబడకుండా, దుకాణాల ముందు గుంపుగా సమకూడకుండా ఉండడంద్వారా మనం మర్యాదగా వ్యవహరించవచ్చు. ఇతరుల పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకొని, తొందరలో ఉన్నారని స్పష్టంగా కనబడేవారితోకాక, కొన్ని నిమిషాలు వెచ్చించగల వారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. వీధిలో ఉండే శబ్దంవల్ల కొన్నిసార్లు గృహస్థునికి వినిపించేలా మనం కాస్త బిగ్గరగా మాట్లాడాల్సిరావచ్చు. అయినా, మనం గౌరవపూర్వకంగా, మనవైపు అవధానం మళ్లించబడకుండా ఉండేలా మాట్లాడాలి.—మత్త. 12:19.
4 ఫోన్లో సాక్ష్యమిస్తున్నప్పుడు: ఫోన్లో సాక్ష్యమిస్తున్నప్పుడు వెనక ఎక్కువగా శబ్దంలేని చోటునుండి అలా చేయడానికి ఇతరులపట్ల ఉండే దయ మనల్ని పురికొల్పుతుంది. మనం ఫోన్ చేసినవెంటనే మనల్ని మనం పరిచయం చేసుకొని, వారికి ఎందుకు ఫోన్ చేశామో తెలపడంద్వారా మనం మంచి సంస్కారాన్ని చూపిస్తాం. మనం ఫోన్లోకి సూటిగా మాట్లాడడం ద్వారా, ఆహ్లాదకరమైన స్వరంతో మాట్లాడడం ద్వారా, వినేవారు ప్రోత్సాహకరమైన ఆధ్యాత్మిక సంభాషణలో పాల్గొనేలా చేస్తుంది. (1 కొరిం. 14:8, 9) పైవిధాలుగా మనం ఇతరులతో వారి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని, దయతో, గౌరవపూర్వకంగా వ్యవహరిస్తే, మనం మన దయాళుడైన యెహోవా దేవుణ్ణి అనుకరిస్తాం.