‘నన్ను వెంబడించడంలో కొనసాగాలి’
1 అనేకమంది తమనుతాము సంతోషపెట్టుకోవడంపైనే తమ జీవితాలను కేంద్రీకరిస్తారు, అయితే తరచూ వారు దుఃఖంగానే ఉంటున్నారు. దానికి భిన్నంగా యేసు, నిజమైన సంతోషాన్నిచ్చే, నిస్వార్థంగా ఇవ్వడమనే జీవనవిధానాన్ని సిఫారసు చేశాడు. (అపొ. 20:35) ఆయనిలా అన్నాడు: “నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని . . . నన్ను” [“వెంబడించడంలో కొనసాగాలి,” NW] (మార్కు 8:34) అలా చేయడంలో, అప్పుడప్పుడూ మనకు సంతోషాన్నిచ్చే కొన్ని విషయాల్ని త్యాగం చేయడంకన్నా మరింత ఎక్కువే ఇమిడివుంది. జీవితంలోని ప్రతీరోజుని మనల్నిమనం సంతోషపెట్టుకోవడం కోసంకాక యెహోవాను సంతోషపెట్టడం కోసం జీవించడమని దాని భావం.—రోమా. 14:8; 15:3.
2 అపొస్తలుడైన పౌలు మాదిరిని గమనించండి. ‘ప్రభువైన యేసుక్రీస్తు గురించిన జ్ఞానం అతి శ్రేష్ఠమైనది’ కాబట్టి, పౌలు తన వ్యక్తిగత కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నించడం మానేసి రాజ్య సంబంధిత విషయాల పురోభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. (ఫిలి. 3:7, 8) ఇతరులకు సేవ చేయడంలో “బహు సంతోషముగా వ్యయపరచెదను; నన్నును నేను వ్యయపరచుకొందును” అని ఆయన అన్నాడు. (2 కొరిం. 12:15) మనలో ప్రతీ ఒక్కరం ఇలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘నేను నా సమయాన్ని, శక్తిసామర్థ్యాలను, వనరులను ఎలా ఉపయోగిస్తున్నాను? నా ప్రయోజనాలపైనే నేను దృష్టి కేంద్రీకరిస్తున్నానా, లేక యెహోవాను సంతోషపెట్టడానికి కృషి చేస్తున్నానా?’
3 ఇచ్చేందుకు అవకాశాలు: ప్రాణాల్ని రక్షించే రాజ్య ప్రకటనాపని చేయడానికి దేవుని ప్రజలు ప్రతీ సంవత్సరం 100 కోట్లకన్నా ఎక్కువ గంటలు వెచ్చిస్తున్నారు. సంఘాల్లో ఇతరులకు ప్రయోజనం చేకూర్చే వివిధ రకాల నియామకాలను యౌవనులు, వృద్ధులు సమానంగా నిర్వర్తిస్తున్నారు. సమావేశాలకు సంబంధించేకాక, సత్యారాధన పురోభివృద్ధికి దోహదపడే భవనాల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి కూడా చాలా పని జరుగుతోంది. అంతేగాక, ఆసుపత్రి అనుసంధాన కమిటీల్లో, రోగి సందర్శనా గుంపుల్లో సేవచేసే సహోదరులు అందించే ప్రేమపూర్వక సహాయం గురించి ఆలోచించండి. అలాంటి స్వయంత్యాగపూరిత ప్రయత్నాలన్నీ మన క్రైస్తవ సహోదరత్వానికి ఎంత ఆశీర్వాదకరమో కదా!—కీర్త. 110:3.
4 విపత్తు సంభవించినప్పుడు లేదా ఏదైనా అత్యవసర సమయంలో ఎన్నోరకాలుగా సహాయం చేయడానికి మనకు అవకాశాలు దొరకవచ్చు. అయితే, సాధారణంగా అనేక సందర్భాల్లో మన తోటి క్రైస్తవునికి మన సహాయమో, ప్రోత్సాహమో అవసరమని మనం గ్రహించవచ్చు. (సామె. 17:17) ఇతరులకు సహాయం చేయడానికి, రాజ్యానికి సంబంధించిన విషయాల్ని పురోగమింపజేయడానికి మనం మనఃపూర్వకంగా ముందుకు వచ్చినప్పుడు మనం యేసు మాదిరినే అనుసరిస్తున్నాం. (ఫిలి. 2:5-8) అలా చేయడంలో కొనసాగడానికి మనం కృషి చేద్దాం.