ప్రకటించేందుకు వీలుగా మీరు మీ సమయ పట్టికను మార్చుకోగలరా?
1. ప్రకటించేందుకు వీలుగా మనం మన సమయ పట్టిక ఎందుకు మార్చుకోవాలి?
1 నిజ క్రైస్తవులముగా మనం “మనుష్యులను పట్టుజాలరులుగా” ఉండమని ఇవ్వబడిన ఆహ్వానం స్వీకరించాం. (మత్త. 4:19) అక్షరార్థ జాలరుల్లాగే, ప్రజలు ఇంట్లో ఉండే సమయంలో ప్రకటించడానికి మనం పట్టిక వేసుకుంటే శిష్యులను చేసే పనిలో మనకు మంచి ఫలితాలు లభించే అవకాశముంది. అనేక దేశాల్లో, రాబోయే నెలల్లో పగటిపూట గంటలు ఎక్కువగా ఉంటాయి. మధ్యాహ్న లేదా సాయంత్రవేళల్లో ఎక్కువమంది ఇంట్లో ఉంటారు. ఆ సమయాల్లో వారు తరచూ తీరిగ్గా ఉండి, వారిని సందర్శించేవారిని ఆహ్వానించడానికి ఎక్కువ ఇష్టపడుతుండవచ్చు. ఆ సమయాల్లో ప్రకటించడానికి వీలుగా మీరు మీ సమయ పట్టికను మార్చుకోగలరా?—1 కొరిం. 9:23.
2. ఎటువంటి కొన్ని మార్గాలనుపయోగించి మనం ఎక్కువమందికి సువార్త ప్రకటించగలుగుతాం?
2 సాయంత్రవేళల్లో ప్రకటించడం: సాయంత్రవేళల్లో ప్రకటించడానికి ముందే మనం ప్రణాళిక వేసుకుంటే మనం చాలామందికి సువార్త ప్రకటించవచ్చు. (సామె. 21:5) యౌవనులైతే స్కూలు ముగిసిన తర్వాత ప్రకటనాపనిలో పాల్గొనవచ్చు. ఇతరులు తమ పని ముగిసిన తర్వాత అలా చేయవచ్చు. పుస్తక అధ్యయన గుంపులు, పుస్తక అధ్యయనానికి ముందు ఒక గంట ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకోవచ్చు.
3. మీ క్షేత్రంలో మధ్యాహ్న లేదా సాయంత్రవేళల్లో ఏయే విధానాలను ఉపయోగించి మీరు ప్రకటించవచ్చు?
3 మధ్యాహ్న లేదా సాయంత్రవేళల్లో ఇంటింటా ప్రకటించడంవల్ల సాధారణంగా ఇంట్లో ఉండని వారిని కలుసుకోవడానికి వీలుకావచ్చు. చాలా క్షేత్రాల్లో, వీధి సాక్ష్యం లేదా ఇతర బహిరంగ స్థలాల్లో ప్రకటించే విధానాలను ఉపయోగించి కూడా సాయంత్రవేళల్లో ప్రకటించవచ్చు. అంతేకాదు, పునర్దర్శనాలు చేసి, బైబిలు అధ్యయనాలు ఆరంభించడానికి సాయంత్రవేళ చాలా అనుకూలంగా ఉంటుందని చాలామంది కనుగొన్నారు.
4. సాయంత్రవేళల్లో సాక్ష్యమిచ్చేపనిలో పాల్గొంటున్నప్పుడు వివేచనతో, దయతో వ్యవహరించడం ఎందుకు ప్రాముఖ్యం?
4 వివేచన అవసరం: సాయంత్రవేళ సాక్ష్యమిచ్చేపనిలో పాల్గొంటున్నప్పుడు మంచి వివేచన ఉపయోగించడం అవసరం. గృహస్థులు రాత్రిపూట విశ్రమించేందుకు పూనుకొనే సమయంలో వారిని సందర్శించే బదులు, సాధారణంగా మన సాక్ష్యపు పనిని చీకటిపడకముందే ఆపేయడం మంచిది. (సామె. 2:11) మీరు తలుపు తట్టినప్పుడు వారికి కనబడేలా నిలబడండి, మిమ్మల్ని మీరు సరిగ్గా పరిచయం చేసుకోండి. మీరు వెళ్ళిన ఉద్దేశాన్ని సాధ్యమైనంత తర్వగా తెలపండి. మీరు ఒకవేళ సమయం కాని సమయంలో అంటే కుటుంబమంతా కలిసి భోజనం చేస్తున్నప్పుడు వెళ్తే, మరోసారి వస్తానని చెప్పండి. ఎల్లప్పుడూ దయతో వ్యవహరించండి.—మత్త. 7:12.
5. ప్రకటిస్తున్నప్పుడు ప్రమాదకర పరిస్థితులను మనమెలా నివారించవచ్చు?
5 ప్రమాదకర పరిస్థితుల విషయంలో కూడా మనం జాగరూకులుగా ఉండాలి. మీరు ప్రొద్దుగుంకినప్పుడు లేదా చీకటిపడిన తర్వాత సాక్ష్యమిస్తున్నట్లయితే, ఇద్దరిద్దరిగా లేదా గుంపులుగా కలిసి వెళ్లడం జ్ఞానయుక్తం. నిర్మానుష్యంగా లేని తగినంత వెలుతురున్న వీధుల్లోనే ఉండండి. మీరు సురక్షితమని భావించే ప్రదేశాల్లోనే సాక్ష్యమివ్వండి. చీకటిపడిన తర్వాత సురక్షితంకాని ప్రదేశాలకు వెళ్లకండి.—సామె. 22:3.
6. మధ్యాహ్న లేదా సాయంత్రవేళల్లో సాక్ష్యమివ్వడం ద్వారా ఎలాంటి అదనపు ప్రయోజనాలు చేకూరవచ్చు?
6 మధ్యాహ్న లేదా సాయంత్రవేళల్లో సాక్ష్యమిచ్చే పనిలో పాల్గొనడంవల్ల మనం సహాయ పయినీర్లతో, క్రమ పయినీర్లతో కలిసి సేవ చేయడానికి వీలుకావచ్చు. (రోమా. 1:11) ఆ పద్ధతిలో సేవ చేయడానికి అనుకూలంగా మీరు మీ సమయ పట్టికను మార్చుకోగలరా?