ఇతరులతో తర్కించే నైపుణ్యాన్ని పెంపొందించుకోండి
1. మనం ఏ బైబిలు వృత్తాంతాన్ని పరిశీలించనున్నాం, ఎందుకు?
1 అపొస్తలుల కార్యములు 13:16-41లో నమోదైనట్లుగా, అపొస్తలుడైన పౌలు పిసిదియకు చెందిన అంతియొకయలోని సమాజమందిరంలో ఇచ్చిన ప్రసంగం, ఇతరులతో ఎలా తర్కించాలనే విషయంలో చక్కని ఉదాహరణగా ఉంది. పౌలు తన శ్రోతల నేపథ్యాన్ని, మనస్తత్వాన్ని పరిగణలోకి తీసుకొని సువార్తకు సంబంధించిన తన చర్చాంశాన్ని దానికి అనుగుణంగా మలిచాడు. మనం ఆ వృత్తాంతాన్ని పరిశీలిస్తున్నప్పుడు, మనం మన పరిచర్యలో ఆయన ఉదాహరణను ఎలా అనుసరించవచ్చో చూద్దాం.
2. పౌలు తన ప్రసంగాన్ని ప్రారంభించిన పద్ధతి నుండి మనం ఏమి నేర్చుకుంటాం?
2 ఇరువురూ ఏకీభవించే అంశం కోసం చూడండి: దేవుని సంకల్పం నెరవేర్చడంలో యేసు పోషించిన కీలక పాత్ర మీదే పౌలు తన సందేశాన్ని కేంద్రీకరించినా, ఆయన ఆ అంశాన్ని చెప్పి తన ప్రసంగాన్ని ఆరంభించలేదు. అయితే ఆయన యూదులే ఎక్కువగా ఉన్న ప్రేక్షకులతో, వారు తనతో ఏకీభవించే అంశం గురించి అంటే యూదుల చరిత్ర గురించి మాట్లాడాడు. (అపొ. 13:16-22) అదే విధంగా మనం, ఇతరులు మనతో ఏకీభవించే అంశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారి హృదయాన్ని మరింత సమర్థంగా చేరుకుంటాం. దీనికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేలా నేర్పుతో కూడిన ప్రశ్నలను ఉపయోగించి వారికి నిజంగా ప్రాముఖ్యమైన అంశం ఏమిటో తెలుసుకోవడానికి జాగ్రత్తగా వినడం అవసరం కావచ్చు.
3. యేసు వాగ్దానం చేయబడిన మెస్సీయ అని అంగీకరించడానికి పౌలు శ్రోతలకు ఎందుకు కష్టమయింది?
3 పౌలు యూదుల చరిత్ర గురించి చర్చిస్తున్నప్పుడు దావీదు వంశావళి నుండి ఒక రక్షకుడ్ని నిలబెడతాననే దేవుని వాగ్దానం గురించి తన శ్రోతలకు గుర్తుచేశాడు. అయితే తమను రోమా ఆధిపత్యం నుండి విడుదల చేసి ఇతర జనాంగాల కన్నా యూదా జనాంగాన్ని ఉన్నతస్థానంలో నిలబెట్టే ఒక సైనిక నాయకుని కోసం చాలామంది యూదులు ఎదురుచూస్తున్నారు. యెరూషలేములోని యూదా మత నాయకులు యేసును తిరస్కరించి, రోమా అధికారులకు ఆయనను అప్పగించి చంపారని వారికి ఖచ్చితంగా తెలుసు. పౌలు ఆ యేసే వాగ్దానం చేయబడిన మెస్సీయ అని వారిని ఎలా నమ్మించగలడు?
4. పౌలు తన యూదా శ్రోతలతో నైపుణ్యంగా ఎలా తర్కించాడు?
4 మీ ప్రతిపాదనను పరిస్థితికి అనుగుణంగా మలచుకోండి; పౌలుకు తన శ్రోతల మనస్తత్వం తెలుసు కాబట్టి వారు అప్పటికే అంగీకరించిన అంశాల ఆధారంగా వారితో తర్కించడానికి లేఖనాలను ఉపయోగించాడు. ఉదాహరణకు, ఆయన యేసును దావీదు సంతానంగా పరిచయం చేశాడు, చాలామంది దేవుని ప్రవక్తగా చాలామంది పరిగణించిన బాప్తిస్మమిచ్చు యోహాను గుర్తించిన వ్యక్తిగా కూడా పరిచయం చేశాడు. (అపొ. 13:23-25) మత నాయకులు యేసును తిరస్కరించి దోషారోపణ చేసి చంపడం ద్వారా ‘ప్రవక్తల వచనాలను నెరవేర్చారు’ అని పౌలు సూచించాడు. (అపొ. 13:26-28) మృతులలో నుండి లేచిన యేసును చూసిన ప్రత్యక్షసాక్షులు ఉన్నారని ఆయన కూడా వివరించాడు, యేసు పునరుత్థానం విషయంలో వారికి పరిచయం ఉన్న నెరవేరిన లేఖన భాగాలవైపు వారి దృష్టి మళ్లించాడు.—అపొ. 13:29-37.
5. (ఎ) పౌలు గ్రీకు ప్రేక్షకులతో మాట్లాడుతున్నప్పుడు తన ప్రతిపాదనను ఎలా మలచుకున్నాడు? (బి) మనం స్థానిక క్షేత్రంలో సాక్ష్యమిస్తున్నప్పుడు పౌలు ఉదాహరణను ఎలా అనుకరించవచ్చు?
5 మరోవైపు, పౌలు ఏథెన్సులోని అరేయొపగులోని గ్రీకు ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడినప్పుడు వేరే ప్రతిపాదనను ఉపయోగించాడు. (అపొ. 17:22-31) అయినా ఆయన అదే ప్రాథమిక సందేశాన్ని అందించాడు, ఈ రెండు సందర్భాల్లో ఆయన ప్రయత్నాలవల్ల మంచి ఫలితాలు వచ్చాయి. (అపొ. 13:42, 43; 17:34) అదేవిధంగా నేడు, మనం మన శ్రోతలు మనతో ఏకీభవించే అంశాలను తెలుసుకోవడానికి ప్రయత్నించి మన ప్రతిపాదనను వారి నేపథ్యానికి, మనస్తత్వానికి అనుగుణంగా మలచుకున్నట్లయితే మనం మన పరిచర్యలో మరింత ఫలవంతంగా ఉంటాం.