ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగజేసుకోండి
1 అపొస్తలుడైన పౌలు తోటి విశ్వాసులను బలపరచడానికి తాను చేయగలిగినదంతా చేశాడు. (అపొ. 14:19-22) అలాగే మన సహోదరులు కష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు మనం వారి గురించి కలత చెందుతాం, వారికి సహాయం చేయాలనుకుంటాం. పెద్దలు మాత్రమే కాక అందరూ ఇతరులపట్ల శ్రద్ధ చూపించాలని బైబిలు సూచిస్తోంది. (రోమా. 15:1, 2) “ఒకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగ జేయుడి” అనే ప్రేమపూర్వక ఉద్బోధను అనుసరించడానికి మనకు సహాయం చేసే రెండు మార్గాలను పరిశీలించండి.—1 థెస్స. 5:11.
2 ఇతరుల అవసరాలను గుర్తించండి: దొర్కా “సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసియుండెను” అని దేవుని వాక్యం నివేదిస్తోంది. (అపొ. 9:36, 39) ఆమె అవసరాల్లో ఉన్నవారిని గమనించి వారికి సహాయం చేయడానికి తాను చేయగలిగింది చేసింది. ఆమె మనకు ఎంత మంచి మాదిరిని ఉంచిందో కదా! కూటాలకు రావడానికి సహాయం కావల్సిన ఒక వృద్ధుడు ఉన్నాడనో లేక వారంలోని ఒక మధ్యాహ్నం సేవలో తనతో పని చేయడానికి ఎవరూ తోడు లేని ఒక పయినీరు ఉన్నాడనో మీకు తెలుస్తుండవచ్చు. ఎవరికైనా అలాంటి అవసరం ఉందని తెలిసి మీరు వారికి ఆచరణాత్మకమైన సహాయం అందించినప్పుడు, ఆ వ్యక్తి ఎంత ప్రోత్సహించబడతాడో ఊహించండి!
3 ఆధ్యాత్మిక సంభాషణలు: మనం ఇతరులను మన సంభాషణ ద్వారా కూడా బలపరచవచ్చు. (ఎఫె. 4:29) అనుభవజ్ఞుడైన ఒక పెద్ద ఇలా వ్యాఖ్యానించాడు: “మీరు ప్రోత్సహించేవారిగా ఉండాలంటే, ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడండి. మీరు ప్రోత్సాహకరమైన సంభాషణ ప్రారంభించాలంటే ‘మీరు సత్యాన్ని ఎలా నేర్చుకున్నారు?’ వంటి సరళమైన ప్రశ్నను ఉపయోగించవచ్చు.” సంఘంలోని యౌవనులపట్ల నిజమైన శ్రద్ధ చూపించండి. నిరుత్సాహపడినవారిపట్ల, బిడియస్థులపట్ల శ్రద్ధ చూపించండి. (సామె. 12:25) లోకపు వినోదం గురించిన చర్చ, తోటి విశ్వాసులతో చేసే మంచి ఆధ్యాత్మిక సంభాషణల కోసం వెచ్చించే సమయాన్ని హరించనివ్వకండి.—రోమా. 1:11, 12.
4 అయితే ఇతరులను బలపరచడానికి మీరు ఏమి చెప్పవచ్చు? మీ వ్యక్తిగత బైబిలు పఠనంలో, అధ్యయనంలో యెహోవాపట్ల ప్రేమను, కృతజ్ఞతను పెంచిన ఒక సూత్రాన్ని ఇటీవల తెలుసుకున్నారా? బహిరంగ ప్రసంగంలో లేక కావలికోట అధ్యయనంలో మీరు విన్నదాన్నిబట్టి ప్రోత్సహించబడ్డారా? లేక విశ్వాసాన్ని బలపరిచే ఒక అనుభవం ద్వారా మీరు ప్రభావితులయ్యారా? మీరు అలాంటి ఆధ్యాత్మిక రత్నాలను విలువైనవిగా ఎంచితే, ఇతరులకు ప్రోత్సాహకరమైన విషయాలు చెప్పడానికి మీ దగ్గర ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది.—సామె. 2:1; లూకా 6:45.
5 మనం ఆచరణాత్మకమైన సహాయం అందించడం ద్వారా, మన నాలుకను జ్ఞానయుక్తంగా ఉపయోగించడం ద్వారా మనం ఒకరికొకరం క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటూ ఉందాం లేక బలపరచుకుంటూ ఉందాం.—సామె. 12:18.