“హృదయపూర్వకముగా లోబడి” ఉండేలా ఇతరులకు సహాయం చేయండి
1. యెహోవా తన ఆరాధకులనుండి ఏమి కోరుతున్నాడు?
1 యెహోవాను ఆమోదయోగ్యంగా ఆరాధించాలంటే విధేయత చూపించడం ప్రాముఖ్యం. (ద్వితీ. 12:28; 1 పేతు. 1:14-16) త్వరలోనే, ‘దేవునినెరుగనివారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడనివారికి’ దేవుని తీర్పు వస్తుంది. (2 థెస్స. 1:8) దేవుని వాక్య బోధలకు “హృదయపూర్వకముగా లోబడి” ఉండేలా మనం ఇతరులకు ఎలా సహాయం చేయవచ్చు?—రోమా. 6:17.
2. బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకునేలా ఇతరులకు సహాయం చేయడం ఎందుకు ప్రాముఖ్యం?
2 విశ్వాస, ప్రేమలను పెంపొందించుకోవడానికి సహాయం చేయడం ద్వారా: లేఖనాల్లో విధేయతకూ, విశ్వాసానికీ దగ్గరి సంబంధం ఉంది. అపొస్తలుడైన పౌలు ‘నిత్యదేవుని ఆజ్ఞప్రకారము విశ్వాసమునకు విధేయులవడం’ గురించి మాట్లాడాడు. (రోమా. 16:26) హెబ్రీయులు 11వ అధ్యాయం విశ్వసనీయంగా ఉన్న చాలామంది ఉదాహరణలను పేర్కొంటోంది, వారిలో చాలామంది యెహోవా వ్యక్తపరచిన చిత్తానికి అనుగుణంగా ప్రవర్తించారు. (హెబ్రీ. 11:7, 8, 17) మరోవైపున, అవిధేయతకూ, అవిశ్వాసానికీ దగ్గరి సంబంధం ఉంది. (యోహా. 3:36; హెబ్రీ. 3:18, 19) విధేయతను ఫలింపజేసే విశ్వాసాన్ని వృద్ధిచేసుకొనేలా ఇతరులకు సహాయం చేయడానికి మనం దేవుని వాక్యాన్ని నైపుణ్యవంతంగా ఉపయోగించడాన్ని మెరుగుపరుచుకోవాలి.—2 తిమో. 2:15; యాకో. 2:14, 17.
3. (ఎ) విధేయతకు ప్రేమకు ఎలాంటి సంబంధం ఉంది? (బి) యెహోవాపట్ల ప్రేమను వృద్ధి చేసుకోవడానికి బైబిలు విద్యార్థులకు మనమెలా సహాయం చేయవచ్చు?
3 విధేయతకు దేవునిపట్ల ఉన్న ప్రేమకు కూడా సంబంధముంది. (ద్వితీ. 5:10; 11:1, 22; 30:16) ‘మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు’ అని 1 యోహాను 5:3 తెలియజేస్తుంది. యెహోవాపట్ల ప్రేమను వృద్ధి చేసుకోవడానికి బైబిలు విద్యార్థులకు మనమెలా సహాయం చేయవచ్చు? అధ్యయనం జరుగుతున్న సమయంలో యెహోవా లక్షణాలపట్ల వారి కృతజ్ఞతను పెంపొందింపజేసే అవకాశాల కోసం చూడండి. దేవునిపట్ల మీకున్న లోతైన భావాలను వ్యక్తపరచండి. యెహోవాతో వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవడం గురించి ఆలోచించేలా విద్యార్థికి సహాయం చేయండి. ప్రాముఖ్యంగా, యెహోవాపట్ల ఉన్న ప్రేమే హృదయపూర్వకంగా ఆయనకు లోబడేలా ఇతరులను అలాగే మనల్ని కూడా పురికొల్పుతుంది.—మత్త. 22:37.
4. (ఎ) మన ఆదర్శం ఎందుకు ప్రాముఖ్యం? (బి) ‘విధేయతగల హృదయమును’ అలవరచుకోవడానికి మనమేమి చేయాలి?
4 మన వ్యక్తిగత ఆదర్శం ద్వారా: ఇతరులు సువార్తకు లోబడేలా ప్రోత్సహించడానికి మన వ్యక్తిగత ఆదర్శమే బలమైన ప్రేరణగా ఉండగలదు. అయితే, ‘విధేయతగల హృదయమును’ అలవరచుకోవడానికి మనవైపు నుండి నిరంతర ప్రయత్నం అవసరం. (1 రాజు. 3:9, NW; సామె. 4:23) దీనిలో ఏమి ఇమిడివుంది? క్రమ బైబిలు అధ్యయనం ద్వారా, కూటాలకు హాజరవడం ద్వారా ఆధ్యాత్మిక ఆహారంతో మీ హృదయాలను నింపుకోండి. (కీర్త. 1:1, 2; హెబ్రీ. 10:24, 25) సత్యారాధనలో ఐక్యమైయున్న హృదయాలుగలవారి సహవాసాన్ని వెదకండి. (సామె. 13:20) మీ క్షేత్రంలో ఉన్న ప్రజలకు సహాయం చేయాలనే యథార్థమైన కోరికతో, క్రమంగా క్షేత్ర పరిచర్యలో భాగం వహించండి. సహృదయాన్ని పెంపొందించుకోవడానికి మనల్ని నడిపించమని యెహోవా సహాయాన్ని అర్థించండి. (కీర్త. 86:11) మీ హృదయాన్ని చెరిపే విషయాలను అంటే అనైతిక లేదా హానికరమైన వినోదాన్ని విసర్జించండి. మిమ్మల్ని యెహోవాకు సన్నిహితం చేసే ఆయనతో మీకున్న సంబంధాన్ని బలపరిచే విషయాలను అనుసరించండి.—యాకో. 4:7, 8.
5. విధేయులైనవారు ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నారు?
5 తన ప్రాచీనకాల ప్రజలు తన మాట వింటే వారికి మెండుగా ఆశీర్వాదాలు లభిస్తాయని యెహోవా వారికి హామీ ఇచ్చాడు. (ద్వితీ. 28:1, 2) అదేవిధంగా నేడు, యెహోవా ‘తనకు విధేయులైనవారిని’ మెండుగా ఆశీర్వదిస్తున్నాడు. (అపొ. 5:32) కాబట్టి మన బోధ ద్వారా, ఆదర్శం ద్వారా, ఇతరులు హృదయపూర్వకంగా లోబడేలా వారికి సహాయం చేయవచ్చు.