ప్రకటించవలసిన సమయం ఇదే!
1. ఇది ఎందుకు ప్రకటించవలసిన సమయం?
1 “దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి.” ఈ సందేశం, దేవదూతల నిర్దేశం క్రింద “ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాటలాడువారికిని” ప్రకటించబడుతోంది. ఎందుకు ప్రకటించబడుతోంది? ‘[దేవుని] తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక.’ నేడు, మనం ఆ ‘తీర్పుతీర్చు గడియలో’ జీవిస్తున్నాము, అది ప్రస్తుత విధానం నాశనమైనప్పుడు ముగుస్తుంది. ప్రజలు “ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము” చేయడం చాలా ప్రాముఖ్యం. నేడు జరుగుతున్న ఏ ఇతర పనీ “నిత్యసువార్త” ప్రకటించడమంత ప్రాముఖ్యమైనదీ కాదు, అత్యవసరమైనదీ కాదు. అవును, ప్రకటించవలసిన సమయం ఇదే!—ప్రక. 14:6, 7.
2. యెహోవా సేవకులు, మన కాలంలోని అత్యవసర పరిస్థితిని గుర్తిస్తున్నామని ఏ విధంగా చూపిస్తున్నారు?
2 గత పది సంవత్సరాల్లో, యెహోవా సేవకులు రాజ్య ప్రకటనా పనికి, శిష్యులను చేసే పనికి దాదాపు 12 వందలకోట్ల గంటలు వెచ్చించారు. చాలామంది ఆధ్యాత్మిక కోతపనిలో ఇంకా ఎక్కువ భాగం వహించడానికి తమ జీవితాల్లో సర్దుబాట్లు చేసుకున్నారు. (మత్త. 9:37, 38) ఉదాహరణకు, గత సంవత్సరం, ప్రతీ నెల సగటున 8,50,000 కంటే ఎక్కువమంది ప్రచారకులు పయినీరు సేవ చేశారు. క్రమ పయినీర్లు ప్రతీ నెల ప్రకటనా పనికి సగటున 70 గంటలు వెచ్చించాలి. సహాయ పయినీర్లు 50 గంటలు వెచ్చించాలి.
3. పయినీరు సేవ చేయడానికి ప్రచారకులు తరచూ ఎలాంటి సర్దుబాట్లు చేసుకోవలసి ఉంటుంది?
3 పయినీరు సేవ ఎలా చేయవచ్చు: “కాలము సంకుచితమై యున్నది” అని గుర్తించి పయినీర్లు తమ జీవితాలను నిరాడంబరంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. (1 కొరిం. 7:29, 31) వారు తమ ఖర్చులను తగ్గించుకునే మార్గాలకోసం చూస్తారు, ఆ విధంగా వారు లోకసంబంధమైన ఉద్యోగంలో తక్కువ సమయం వెచ్చించగలరు. ఉదాహరణకు, కొంతమంది చిన్న ఇళ్ళలోకి మారారు. మరికొంతమంది అంతగా అవసరంలేని వస్తువులను వదిలించుకున్నారు. (మత్త. 6:19-21) తరచుగా వారు వ్యక్తిగత ఆనందం కోసం పెట్టుకునే లక్ష్యాలను కూడా తగ్గించుకోవాలి. ఇవన్నీ పరిచర్యలో ఎక్కువ సమయం గడపాలనే, పరిచర్యకు ఎక్కువ అవధానమివ్వాలనే లక్ష్యంతో చేశారు. (ఎఫె. 5:15, 16) చాలామంది ప్రచారకులు పట్టుదలతో, స్వయంత్యాగ స్ఫూర్తితో, ప్రార్థనాపూర్వకంగా యెహోవాపై ఆధారపడడం ద్వారా, పయినీరు సేవ చేయడానికి దోహదపడే ఒక ఆచరణాత్మకమైన పట్టికను ఏర్పాటు చేసుకోగలిగారు.
4. పయినీరు సేవ చేయడమనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి ఆచరణాత్మకమైన చర్యలు మీకు సహాయకరంగా ఉంటాయి?
4 మీరు పయినీరు సేవ చేయగలరా? విజయవంతమైన పయినీర్లు ఆ సేవను ఎలా చేయగలుగుతున్నారో వారినే ఎందుకు అడగకూడదు? వారితో కలిసి క్షేత్ర పరిచర్యలో పనిచేయండి, వారు పొందుతున్న ఆనందాన్ని మీరూ పొందండి. పయినీరు సేవకు సంబంధించి మన ప్రచురణల్లో వచ్చిన ఆర్టికల్స్‌ను పరిశీలించండి. పయినీరు సేవ చేయడానికి దోహదపడే ఆచరణాత్మకమైన లక్ష్యాలను పెట్టుకోండి. ప్రస్తుతం పయినీరు సేవ చేయకుండా మిమ్మల్ని ఆపుతున్న అడ్డంకులేవైనా ఉంటే వాటిని ప్రార్థనలో యెహోవాకు తెలియజేసి, వాటిని తొలగించుకోవడానికి సహాయం చేయమని ఆయనను అడగండి.—సామె. 16:3.
5. పరిచర్యలో మన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి పయినీరు సేవ మనకు ఎలా సహాయం చేస్తుంది?
5 ఆశీర్వాదాలు, ఆనందాలు: పయినీరు సేవ దేవుని వాక్యాన్ని ఉపయోగించడంలో మన నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది, అది మన ఆనందాన్ని అధికం చేస్తుంది. ఒక యౌవన పయినీరు సహోదరి ఇలా చెబుతోంది: “దేవుని సత్యవాక్యమును సరిగా ఉపదేశించగలగడం అనేది నిజంగా ఒక ఆశీర్వాదం. మనం పయినీరు సేవ చేస్తున్నప్పుడు బైబిలును ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇప్పుడైతే నేను ఇంటింటికి వెళ్తున్నప్పుడు ప్రతీ గృహస్థుడికి ఏ లేఖనాలు సముచితంగా ఉంటాయనేది ఆలోచించగలుగుతున్నాను.”—2 తిమో. 2:15.
6. పయినీరు సేవ ఎలాంటి శిక్షణనిస్తుంది?
6 పయినీరు సేవ మన జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఎన్నో విలువైన నైపుణ్యాలను కూడా నేర్పిస్తుంది. ఇది యౌవనులకు సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకునేందుకు ఎలా పథకం వేసుకోవాలో, డబ్బును జాగ్రత్తగా ఎలా సద్వినియోగం చేసుకోవాలో, ప్రజలతో ఎలా మెలగాలో నేర్చుకోవడానికి సహాయం చేస్తుంది. పయినీరు సేవ చేయడం ద్వారా చాలామంది తమ జీవితాన్ని మరింత ఆధ్యాత్మిక దృక్కోణం నుండి చూడడం నేర్చుకుంటారు. (ఎఫె. 4:13) అంతేకాక, యెహోవా హస్తము తమకు తోడైయుందని చూసే ఆధిక్యత పయినీర్లకు తరచూ లభిస్తుంది.—అపొ. 11:21; ఫిలి. 4:11-13.
7. యెహోవాకు సన్నిహితమవడానికి పయినీరు సేవ మనకెలా సహాయం చేస్తుంది?
7 పయినీరు సేవవల్ల వచ్చే అతిగొప్ప ఆశీర్వాదాల్లో ఒకటేమిటంటే, అది యెహోవాకు సన్నిహితమవడానికి మనకు సహాయం చేస్తుంది. కష్టాలను సహించడానికి అది మనకు శక్తినివ్వగలదు. కొంతకాలంపాటు తీవ్రమైన కష్టాలను సహించిన ఒక సహోదరి ఇలా అంది: “పయినీరు సేవ చేయడం ద్వారా యెహోవాతో నేను వృద్ధి చేసుకున్న సన్నిహిత సంబంధం కష్టాలన్నిటినీ సహించడానికి నాకు సహాయం చేసింది.” ఆమె ఇంకా ఇలా అంది: “నా జీవితంలో ఎక్కువభాగం యెహోవా సేవచేస్తూ పూర్తికాల సేవలో గడపగలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. నేను చేయగలనని ఎన్నడూ అనుకోని మార్గాల్లో సేవ చేయడానికి ఇది నాకు సహాయం చేసింది.” (అపొ. 20:35) అతి ప్రాముఖ్యమైన ప్రకటనా పనిలో మనకు సాధ్యమైనదంతా చేస్తూ మనం కూడా మెండైన ఆశీర్వాదాలను అనుభవించుదము గాక.—సామె. 10:22.