పరిచర్యలో ప్రగతి సాధించడానికి మీ పిల్లలకు సహాయం చేయండి
1 క్రైస్తవ తల్లిదండ్రులకు తమ పిల్లలు చిన్నప్పటి నుండే పరిచర్యలో శిక్షణ ఇవ్వాల్సిన గంభీరమైన బాధ్యత ఉంది. ఆ బాధ్యతను అనేక విధాలుగా నిర్వర్తించవచ్చు. కొంతమంది పిల్లలు తమకు చదవడం రాకముందే, సందర్భానికి తగినట్లు ఒక బైబిలు లేఖనాన్ని కంఠతాః చెప్పగలుగుతున్నారు. అది వినేవారి మీద బలమైన ప్రభావం చూపించగలదు. పిల్లలు పెద్దవారవుతున్నకొద్దీ వారు పరిచర్యలో ఇంకా ఎక్కువగా పాల్గొనవచ్చు. తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలు సాక్ష్యమివ్వడంలో భాగం వహించేందుకు వారికి ఎలా సహాయం చేయవచ్చు? బహుశా క్రింది సూచనలు మీకు ఇంకా ఎక్కువ సహాయం చేస్తాయి.
2 పలకరించిన తర్వాత, మీరు ఇలా అనవచ్చు:
◼ “మా అబ్బాయి [ఆయన పేరు], ఒక అర్థవంతమైన లేఖనాన్ని మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాడు.” అప్పుడు మీ పిల్లవాడు ఇలా అనవచ్చు: “కీర్తనలో ఉన్న ఈ లేఖనం దేవుని పేరును నాకు నేర్పించింది. [పిల్లవాడు కీర్తన 83:18 చదువుతాడు లేక కంఠతా చెబుతాడు.] యెహోవా దేవుడు మన కోసం ఏమి చేస్తాడో ఈ పత్రికలు వివరిస్తాయి. మీరు ఈ పత్రికలను తీసుకోవడానికి ఇష్టపడుతున్నారా?” ప్రపంచవ్యాప్తంగా ఈ పనికి మద్దతు లభిస్తున్న విధానాన్ని వివరించడం ద్వారా మీరు సంభాషణను ముగించవచ్చు.
3 లేక ఈ ప్రతిపాదనను మీరు ప్రయత్నించవచ్చు:
◼ “నమస్తే. సమాజంలోని ఇతరులపట్ల శ్రద్ధ చూపించడం గురించి నేను మా అమ్మాయి [ఆమె పేరు]కి నేర్పిస్తున్నాను. ఆమె మీకు ఒక క్లుప్తమైన బైబిలు సందేశాన్ని చెప్పాలనుకుంటోంది.” అప్పుడు ఆమె ఇలా అనవచ్చు: “భవిష్యత్తు విషయంలో బైబిలు ఇస్తున్న నిరీక్షణ గురించి చెప్పడం ద్వారా నేను ప్రజలకు సహాయం చేయాలనుకుంటున్నాను. [ఆ అమ్మాయి ప్రకటన 21:4 ను చదువుతుంది లేక కంఠతా చెబుతుంది.] దేవుని రాజ్యం మనకోసం ఏమి చేస్తుందో ఈ పత్రికలు వివరిస్తాయి. ఈ పత్రికలు చదవడానికి మీరు ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను.”
4 పిల్లలు రాజ్య సందేశాన్ని చెప్పడంలోని తమ సామర్థ్యం మీద దృఢనమ్మకాన్ని సంపాదించుకోవడానికి తరచూ సరళమైన ప్రతిపాదనను ఉపయోగించడం సహాయం చేస్తుంది. తగినంత స్వరంతో స్పష్టంగా మాట్లాడడం మీద దృష్టి నిలిపే అభ్యాస కార్యక్రమాలు వివిధ పరిస్థితుల్లో మాట్లాడడానికి వారిని సిద్ధం చేస్తాయి. చిన్నపిల్లలు తమ విశ్వాసాన్ని వ్యక్తం చేయడానికి, ముందుగానే బాగా సిద్ధపడడం, యథార్థమైన ప్రశంస సహాయం చేస్తాయి.
5 అలాంటి ప్రోత్సాహంతో చాలామంది చిన్న పిల్లలు బాప్తిస్మం తీసుకోని ప్రచారకులు కావడానికి అర్హులయ్యారు. మన పిల్లలు క్రైస్తవ పరిచర్యలో ప్రగతి సాధించడాన్ని చూడడం ఎంతటి ఆనందకరమైన విషయమో కదా!—కీర్త. 148:12, 13.