రాజ్య సువార్త సాధ్యమైనంతమందికి అందుబాటులో ఉండేలా చేయడం
1. తొలిక్రైస్తవులు, సాధ్యమైనంతమందికి రాజ్యసువార్త అందుబాటులో ఉండేలా చేయడానికి ఏమి చేశారు?
1 యేసు తొలి అనుచరులు రాజ్య సందేశాన్ని వ్యాప్తి చేయడానికి హృదయపూర్వకంగా ప్రయత్నించారు. సాధ్యమైనంతమందికి రాజ్య సువార్త అందుబాటులో ఉండేలా చేయడానికి వారు ఆచరణాత్మకమైన చర్యలు తీసుకున్నారు. క్రైస్తవ బైబిలు రచయితలు తమ ప్రేరేపిత గ్రంథాలను రోమా సామ్రాజ్యపు అంతర్జాతీయ భాష అయిన సామాన్య గ్రీకులో వ్రాశారు. అంతేకాక, సా.శ. రెండు, మూడు శతాబ్దాలకు చెందిన ఉత్సాహవంతులైన ప్రచారకులు, కోడెక్స్ను ఉపయోగించడంలో మొదటివారై ఉండవచ్చు, లేఖనాలు చూడడానికి గ్రంథపు చుట్టలను ఉపయోగించడంకన్నా దీన్ని ఉపయోగించడం సులభం.
2, 3. (ఎ) ఆధునిక కాలాల్లో యెషయా 60:16 ఎలా నెరవేరుతోంది? (బి) స్వచ్ఛారాధనను అభివృద్ధి చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉపయోగించబడుతోంది?
2 సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం: యెహోవా, యెషయా ప్రవక్త ద్వారా ముందుగానే ఇలా చెప్పాడు: “నీవు జనముల పాలు కుడి[చెదవు].” (యెష. 60:16) ఆ ప్రవచనపు ఆధునిక దిన నెరవేర్పులో యెహోవా సేవకులు ప్రకటనా పనిని అభివృద్ధి చేయడానికి జనముల విలువైన వనరులను ఉపయోగించుకుంటున్నారు. ఉదాహరణకు, టాకీ చలనచిత్రాలు వాణిజ్యపరంగా విజయవంతం కావడానికి చాలా సంవత్సరాల ముందే, 1914లో బైబిలు విద్యార్థులు “ఫోటో డ్రామా ఆఫ్ క్రియేషన్” ప్రదర్శించడం మొదలుపెట్టారు. పూర్తి రంగులతో, శబ్దంతో ఎనిమిది గంటలపాటు నడిచే ఆ చలనచిత్రం, స్లైడు ప్రదర్శన లక్షలాదిమందికి బలమైన సాక్ష్యమిచ్చింది.
3 దేవుని ప్రజలు నేడు బైబిళ్ళను, బైబిలు సాహిత్యాలను వందలాది భాషల్లో ప్రచురించడానికి హైస్పీడ్ ముద్రణా యంత్రాలను, కంప్యూటరీకరణ చేయబడిన ఉపకరణాలను ఉపయోగిస్తున్నారు. వేగవంతమైన రవాణా సౌకర్యాలు బైబిలు సాహిత్యాలను సుదూర ప్రాంతాలకు చేరుస్తున్నాయి, ఆ సాహిత్యాలు 235 దేశాల్లోని ప్రజలకు చేరుతున్నాయి. అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించడానికి యెహోవా తన ఆత్మ ద్వారా తన ప్రజలను పురికొల్పుతున్నాడు, తద్వారా చరిత్రలో మునుపెన్నటికన్నా ఎక్కువమందికి బైబిలు సత్యాన్ని అందుబాటులో ఉండేలా చేశాడు.
4. రాజ్య సువార్తతో చాలామందిని చేరుకోవడానికి కొందరు తమ జీవితాల్లో ఎలాంటి సర్దుబాట్లు చేసుకున్నారు?
4 వ్యక్తిగత సర్దుబాట్లు: సత్యారాధకులు రాజ్య సువార్తతో చాలామందిని చేరుకోవడానికి వ్యక్తిగత సర్దుబాట్లు చేసుకొనేలా కూడా ప్రేరేపించబడ్డారు. చాలామంది ప్రకటనా పనిలో ఎక్కువగా భాగం వహించడానికి తమ జీవితాలను నిరాడంబరం చేసుకున్నారు. కొందరు రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సేవ చేయడానికి వెళ్ళారు. మరికొందరు క్రొత్త భాష నేర్చుకోవడం ద్వారా తమ పరిచర్యను విస్తృతం చేసుకున్నారు.
5, 6. స్థానిక క్షేత్రంలో సాధ్యమైనంతమందికి సువార్త అందుబాటులో ఉండేలా చేయడానికి ఏమి చేయవచ్చు?
5 అంతేకాక, ప్రజలు ఎప్పుడు ఉంటే అప్పుడు, ఎక్కడ ఉంటే అక్కడ ప్రకటించడం ద్వారా మనం రాజ్యసువార్తతో చాలామందిని చేరుకోవచ్చు. మీ క్షేత్రంలో ప్రజలు సాధారణంగా పగటిపూట ఇంట్లో ఉండనట్లయితే, సాయంకాల సమయాల్లో సాక్ష్యమిచ్చేందుకు మీ పట్టికను సర్దుబాటు చేసుకోగలరా? సాక్ష్యమివ్వగల బహిరంగ స్థలాలు ఏమైనా ఉన్నాయా? మీరు టెలిఫోనులో సాక్ష్యమివ్వడానికి, వ్యాపార క్షేత్రంలో పనిచేయడానికి ప్రయత్నించారా? మీరు అనియతంగా సాక్ష్యమిచ్చే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారా?
6 యెహోవా నామం గురించి, రాజ్యం గురించి ఇవ్వబడుతున్న గొప్ప సాక్ష్యంలో భాగం వహించే ఎంత గొప్ప ఆధిక్యత మనకు ఉందో కదా! దేవుని వాక్యం నుండి ప్రాణాలను రక్షించే సత్యాన్ని సాధ్యమైనంతమందికి చెప్పడంలో కొనసాగుదుము గాక.—మత్త. 28:19, 20.